ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా ఒక ఫైర్ బ్రాండ్. ప్రతిపక్షం కనిపిస్తే చాలు.. ఆమె తన మాటలను తూటాలుగా మార్చేస్తారు. చంద్రబాబు నాయుడిపై తన అక్కసునంతా వెళ్లగక్కుతారు. అసెంబ్లీలో మైకు అప్పగిస్తే.. ఆమె మాటలకు అడ్డు చెప్పేవారు ఉండరంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె మాటలకు ఎంత పదునో. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. అయితే, కొన్ని సమీకరణాల రీత్యా సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ.. ఏపీఐఐసీ బాధ్యతలు అప్పగించారు.. అసెంబ్లీలో ప్రతి రోజు ఓ పది నిమిషాల పాటు మైక్ అప్పగించారు. పలు సందర్భాల్లో కీలకంగా వ్యవహరించే ఛాన్స్ ఇచ్చారు. అయినా.. ఆమెకు మంత్రి పదవి దక్కితే బాగుంటుందని చాలా మందే కోరుకుంటారు. సీఎం కూడా రోజాకు ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇప్పుడు మరోసారి రోజా మంత్రి పదవి గురించి చర్చ తెరపైకి వచ్చింది. ఆ మధ్య శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించగానే రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆ ఊసే రాలేదు. అయితే.. జబర్దస్త్లో రోజాకు మంత్రి పదవి గురించి చర్చ వచ్చింది. వచ్చే వారానికి సంబంధించిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో ఆర్టిస్ట్ శశి.. శాంతికుమార్ను బెత్తంతో కొట్టాలని కోరతాడు. కొట్టేందుకు రోజా సంశయిస్తుండగా.. మేడం! మీరు కొడితే మినిస్ట్రీ గ్యారెంటీ అని అంటాడు. అంతే.. శాంతి కుమార్ను చితకబాదేస్తుంది. ఈ సన్నివేశాన్ని చూసిన వాళ్లంతా అమ్మో! మంత్రి పదవి కోసం రోజా పడిగాపులు కాస్తున్నట్లే కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సన్నివేశంపై చర్చ మొదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, MLA Roja, Tollywood