అభిమానం అనేది ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటుంది. దాన్ని బేరీజు వేయడం ఎవరి తరం కాదు. మరీ ముఖ్యంగా తమిళనాట అయితే హీరోలపై అభిమానం కాదు.. దానికి మించి చూపిస్తుంటారు ఫ్యాన్స్. తమ హీరోల సినిమాలు విడుదలైతే ఇప్పటికీ బాక్సులు ఊరేగించుకుంటూ తీసుకెళ్తుంటారు. డిజిటల్ యుగంలో కూడా తమిళనాట ఇంకా పాత పద్దతులనే ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. ఒక్కోసారి వాళ్లు అభిమానంతో చేసే పనులు ఇతరులకు చిరాకు, కోపం, అసహనం తెప్పిస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా రజినీకాంత్ ఫ్యాన్స్ చేసిన పనితో చాలా మంది సోషల్ మీడియాలో బాగా డీప్‌గా హర్ట్ అయ్యారు. ఈ మధ్యే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. రజినీకాంత్ సహా ఇందులో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.
ఒకప్పటి హీరోయిన్లు ఖుష్బూ, మీనాతో పాటు ఇప్పటి స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, నయనతార ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక జాకీ ష్రాఫ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మధ్యే మోషన్ పోస్టర్‌లో రజినీ బైక్‌పై కూర్చుని రాడ్ పట్టుకుని అదిరిపోయే పోజు ఇచ్చాడు. దాంతో పాటు మరో పోస్టర్ కూడా విడుదల చేసారు చిత్రయూనిట్. ఇది చూసి ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకున్నారు.
రజినీకాంత్ పోజులకు తమిళనాట అభిమానులు ఫిదా అయిపోయారు. ఏకంగా ఆ పోస్టర్‌కు దండేసి దండం పెట్టడమే కాకుండా ఓ మేకపోతును కూడా బలిచ్చేసారు. ఆ బలిచ్చే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మేకపోతు తలను చూస్తుండగానే నరికేసారు.. ఆ రక్తాన్ని తీసుకెళ్లి రజినీకాంత్ పాదాలకు అభిషేకం చేసారు. ఈ వీడియోను ఇప్పుడు యానిమల్ లవర్స్ చూసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ రకమైన రాక్షస అభిమానాన్ని ఏ హీరో కూడా కోరుకోడు.. అనవసరంగా వాళ్ల పేరును ఇలాంటి రాక్షసపు పనులతో మీరు చెడగొట్టొద్దంటూ చాలా మంది సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇదే వీడియోపై జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా స్పందించింది.
I dont think any actor wud support something so cruel https://t.co/o55hBY5U9L
— rashmi gautam (@rashmigautam27) September 12, 2021
ఈ పిచ్చిని అభిమానం అనుకోవాలా.. ఏ హీరో కూడా దీన్ని హర్షించడు అంటూ పోస్ట్ చేసింది రష్మి. అయితే దీనిపై కొందరు పాజిటివ్.. మరికొందరు నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. పండగలు, జాతర్ల పేరుతో ఇదే మేక, గొర్రెలను బలిస్తుంటారు కదా.. మరి అది తప్పు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోలు కూడా అభిమానులకు దేవుళ్లే అందుకే వాళ్లు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మతం, దేవుడు వేరు.. దానికి దీనికి సంబంధమే లేదంటూ స్పందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Rajinikanth, Telugu Cinema, Tollywood