పెళ్లి తర్వాత కూడా కెరీర్ సాఫీగా సాగించొచ్చు అని సినిమాల్లో సమంత నిరూపిస్తే.. బుల్లితెరపై అంతకంటే ముందే అనసూయ కూడా ప్రూవ్ చేసింది. పైగా సుమలా పద్దతిగా కాకుండా కాస్త గ్లామర్ షో చేసుకుంటూ కెరీర్ కొనసాగించొచ్చు అని నిరూపించింది మాత్రం అనసూయే. ఓ వైపు బుల్లితెరపై చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడూ సినిమాల్లో కూడా సంచలనాలు సృష్టిస్తుంది ఈ రంగమ్మత్త. తన కెరీర్ ఇంత బాగా డిజైన్ చేసుకోడానికి.. తాను ఇంత సక్సెస్ కావడానికి కారణమంతా తన భర్త భరద్వాజ్ అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆయనే లేకపోతే ఇంత దూరం వచ్చేదాన్ని కాదని నిర్మొహమాటంగా చెప్తుంది ఈమె.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అనసూయ అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేస్తుంది. అందులో వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఈ క్రమంలోనే తనకు సుశాంక్ భరద్వాజ్‌తో ఏర్పడిన ప్రేమ గురించి గుర్తు చేసుకుంది అనసూయ. 16 ఏళ్ల వయసులోనే తాను అతడిని యిష్టపడ్డానని చెప్పింది ఈమె. తమ ప్రేమ ఎన్సీసీ క్యాంపులో మొదలైందని.. ఆ సమయంలో తనకు ప్రేమ, ఎఫైర్స్ లాంటి వాటిపై నమ్మకం లేదని.. అందుకే నిర్ణయం తీసుకోడానికి చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చింది అనసూయ.
ఇదిలా ఉంటే తర్వాత ఒకర్నొకరం అర్థం చేసుకున్న తర్వాత ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోతే తానే చాలాసార్లు బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందామని బలవంతపెట్టినట్లు చెప్పింది అనసూయ. కానీ అలాంటి పెళ్లికి గౌరవం ఉండదని భరద్వాజ్ చెప్పడంతో తానే కూల్ అయ్యానని.. ఆ తర్వాత తొమ్మిదేళ్ల వెయింటింగ్ తర్వాతే ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది ఈమె. ఈ మధ్యే పదేళ్ల దాంపత్య జీవితం పూర్తి చేసుకున్నారు అనసూయ దంపతులు. మీ ఇద్దరి మధ్య గొడవలు రాలేదా అనే ప్రశ్నకు కూడా సమాధానమిస్తూ చాలా విషయాలు చెప్పింది అనసూయ.
ఎందుకు రాలేదు.. అందరి ఇంట్లో మాదిరిగానే తమ మధ్య కలహాలు, కలతలు వచ్చాయని.. వారానికి ఓ సారి ఏదో విషయంపై గొడవ పడుతూనే ఉంటామని చెప్పుకొచ్చింది అనసూయ. తమ మధ్య మూడో వ్యక్తి కారణంగా గొడవలు అవుతుంటాయని.. అందుకే ప్రతి వారం విడాకులు తీసుకుంటాం.. కానీ అంతలోనే కలిసిపోయి విడాకులను విసిరేస్తామని నవ్వుతూ చెప్పుకొచ్చింది అనసూయ. మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు.. ఇద్దరం ఒకర్నొకరు అర్థం చేసుకుంటే గొడవలు పడినా అర్థం చేసుకుంటామని చెప్పింది ఈమె. మొత్తానికి చాలా వ్యక్తిగత విషయాలను కాదనకుండా అభిమానులతో పంచుకుంది అనసూయ భరద్వాజ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Telugu Cinema, Tollywood