గిరిజన ప్రజలు కష్టాలు, కన్నీళ్లే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కథ అని హీరో అల్లరి నరేష్ (Allari Naresh) చెప్పారు. ఈ చిత్రం ద్వారా అడవుల్లో నివసించే గిరిజన ప్రజలు సరైన వసతులు లేక పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించామని తెలిపారు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam) ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖపట్టణంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నరేష్‌తో పాటు ప్రవీణ్, కుమ్నన్, శ్రీతేజ్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన అల్లరి నరేష్... నాంది (Naandhi) చిత్రం తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానని చెప్పారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నగరాల్లో ఎన్నో వసతులు ఉన్నా .. అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. రహదారులు, సరైన తిండి, వైద్యం, విద్యా వంటి వసతులు లేక ఎండనక, వానక కష్టపడుతూ ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నారని తెలిపారు.
ఇందులో తాను టీచర్ క్యారెక్టర్ చేశానని.. వృత్తిరీత్యా ఒక అడవిలోకి వెళ్తే.. అక్కడ పడుతున్న వారి బాధలు తెలిశాయని నరేష్ చెప్పారు. దానిపై ఎలాంటి పోరాటం చేసి.. ఎలాంటి మార్పు తీసుకొచ్చాం అనేది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంలో చూపామని ఆయన తెలిపారు. కేవలం 56 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ అత్యద్భుతమైన హాస్యభరితమైన చిత్రాలు తీశారని 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రం కొత్త కాన్సెప్ట్‌తో భవిష్యత్తులో తీయాలని ఆలోచన ఉందని చెప్పుకొచ్చారు నరేష్. తదుపరి 'ఉగ్రం' చిత్రం లో నటించనున్నట్లు చెప్పారు. ఇట్లు మారేడుమిల్లి చిత్రాన్ని అందరూ ఆదరించి.. విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ చిత్రం సందేశాత్మకంగా, అందర్నీ ఆలోచింపచేసే విధంగా ఉంటుందని నటుడు ప్రవీన్ అన్నారు. మారేడుమిల్లి అడవుల్లో షూట్ చేశామని ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.సరిలేరు నీకెవ్వరు తర్వాత అంతటి మంచి క్యారెక్టర్ తనకు ఇందులో దక్కిందన నటుడు కుమ్నన్ అన్నారు. కాగా, ఇట్లు మారేడుమిల్లి చిత్రం నవంబరు 25న విడుదల కానుంది. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహించగా.. రాజేంద్ర దొండ నిర్మాతగా వ్యవహరించారు అన్నారు. నవంబర్ 25న మూవీ విడుదలకానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allari naresh, Itlu Maredumilly Prajaneekam, Telugu Cinema, Tollywood