రాజకీయాలు మెగా ఫ్యామిలీకి కలిసిరావా..తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే... సుమారు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో మగ మహారాజుగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి, సామాజిక న్యాయం పేరుతో ప్రజల్లోకి వచ్చి తిరుపతి వేదిక ‘ప్రజారాజ్యం’ పార్టీని 2008 ఆగష్టు 26న స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.కానీ ప్రజలలోకి తన పార్టీని తీసుకెళ్లడంలో దారుణంగా విఫలమైయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది . దీంతో సీఎం కుర్చీ ఎక్కాలన్న చిరు ఆశలు అడి ఆసలయ్యాయి. నిర్మాణ, నిర్వహణ లోపాలతో కుదేలైన పార్టీని ఇక తాను చేసేదేమిలేక మూడేళ్ల కూడా పూర్తి కాకుండానే 2011 ఆగష్టులో తన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. తరువాత కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ యూపీఏ-2 క్యాబినెట్లో స్వతంత్య్రంగా పర్యాటకశాఖ మంత్రి అయ్యారు. మంత్రిగా కొనసాగినా.. తన శాఖలో ఎలాంటి ప్రత్యేకత చూపించలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం.. ఆపై ఏపీ ఎన్నికల్లో ప్రచార కమిటీ బాధ్యతలు భుజాన ఎత్తుకున్న పార్టీకి 2014 ఎన్నికల్లో ఒక్క సీటు సాధించ పెట్టలేకపోయారు. ఆ తర్వాత పార్టీకి క్రమం క్రమంగా దూరమవుతూ.. రాజకీయాలకు స్వస్తి చెప్పి..తనకు అచ్చొచ్చిన సినిమాలవైపు అడుగులు వేసారు.
చిరంజీవితో పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
ఇక అన్నయ్య చిరంజీవి బాటలోనే పయనించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు. జనసేన ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నాన్నారు. ఆపై చేసిన ప్రసంగంలో ఆయన తన రాజకీయ చైతన్యం గురించి, తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన తీరుపై ఆవేదన వ్యక్తం చేసాడు. అంతేకాదు పార్టీ విధి విధానాలు వంటివి స్పష్టంగా వ్యక్తపరిచారు. 2014లో ఎన్నికల్లోజనసేన పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దుతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయమై..బీజేపీ, టీడీపీకి దూరం జరిగారు. ఆ తరువాత 24 అక్టోబరు 2017 న హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయం స్థాపించి , 2019 ఎన్నికలే లక్ష్యంగా దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఏపీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ప్రత్యర్ధుల్ని తలెత్తుకోనీయకుండా చేసింది.
పవన్ కళ్యాణ్, నాగబాబు (File)
ముఖ్యంగా పార్టీ స్థాపించినా.. దాన్ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లో జనసేనానిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు. కేవలం ఓకే ఒక్క స్థానాన్ని సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. ఇక తమ్ముడికి తోడుగా నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన నాగబాబు ఘోరంగా ఓడిపోయారు. ఇలాంటి పరిణామాలపై మెగా ఫాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. తమ ఆరాధ్య నటులకు ఓటమి కలిగడాన్ని చూసి తల్లడిల్లి పోతున్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ కి రాజకీయాలు అచ్చిరావు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తండ్రి,,బాబాయిలకు జరిగిన గుణపాఠం చూసైన భవిష్యత్తులో రామ్ చరణ్..రాజకీయాలవైపు రాకుండా ఉంటే పదివేలని మెగాభిమానులు వేడుకుంటున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.