కమెడియన్ సత్య సినీ జర్నీ : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో వేణుమాధవ్ సినిమా కోసం వెళ్తే..

కమెడియన్ సత్య (File Photo)

Comedian Satya : స్వామి రారా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ సుధీర్ వర్మ తన హావభావాలను నచ్చి సత్యకు నటుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా నటుడిగా అతని జీవితాన్ని మలుపు తిప్పింది.

 • Share this:
  స్వామి రారా,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్,కార్తీకేయ వంటి సినిమాల ద్వారా హాస్య నటుడిగా 'సత్య' మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని పూర్తి పేరు సత్య అక్కల. తాజాగా ఈనాడు పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సత్య తన సినీ జర్నీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. రజనీకాంత్ అంటే ఇష్టపడే సత్య.. అప్పట్లో శివాజీ సినిమా ట్రైలర్ థియేటర్‌లో వేస్తున్నారని తెలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వెళ్లాడు. అక్కడ ఓ థియేటర్‌లో వేణుమాధవ్ హీరోగా నటించిన 'భూకైలాస్' సినిమా థియేటర్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడుకోవడం గమనించాడు. దగ్గరికెళ్లి వారిని
  పలకరించాడు.

  మరుసటి రోజు షూటింగ్‌కి రమ్మని చెప్పడంతో.. వాళ్లు చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడికెళ్లాక సత్య నుంచి రూ.500 తీసుకుని జూనియర్ ఆర్టిస్టుగా అతన్ని ఓ సినిమా షూటింగ్‌కి పంపించారు. అలా వెళ్తున్న క్రమంలో మరికొంతమంది జూనియర్ ఆర్టిస్టులతో పరిచయమైంది. అయితే తనకు పరిచయమైన ఓ జూనియర్ ఆర్టిస్ట్ తన వద్ద డబ్బు తీసుకుని పారిపోవడంతో.. ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో మూడు రోజులు తిండి లేకుండా పస్తులు ఉన్నాడు. ఆ తర్వాత అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తే.. నాన్న వచ్చి తనను ఇంటికి తీసుకెళ్లాడు.సత్య తండ్రి స్నేహితుడి బంధువు ఒకరు దర్శకుడు రాజమౌళి వద్ద పనిచేస్తుండటంతో.. కొడుకును అక్కడికి పంపించాడు. సత్య అక్కడికి వెళ్లి తండ్రి చెప్పిన వ్యక్తిని కలిశాడు. అతని ద్వారా నితిన్ 'ద్రోణ' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు.

  అలా అమృతం సీరియల్‌కి కూడా సత్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. స్వామి రారా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు డైరెక్టర్ సుధీర్ వర్మ తన హావభావాలను నచ్చి సత్యకు నటుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా నటుడిగా అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అంతకుముందు కళావర్ కింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు అతనికి అంతగా గుర్తింపు
  తీసుకురాలేదు.
  Published by:Srinivas Mittapalli
  First published: