వరుణ్ తేజ్ ప్రస్తుతం జోరు మీదున్నాడు. వరస విజయాలతో రచ్చ చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా అంతరిక్షం మినహా ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ అంటూ వరస విజయాలతో జోరు మీదున్నాడు మెగా వారసుడు. మరోవైపు విజయ్ దేవరకొండ మాత్రం ఫ్లాపుల్లో ఉన్నాడు. టాక్సీవాలా తర్వాత ఈయనకు హిట్ లేదు. భారీ అంచనాలతో వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ పూరీ జగన్నాథ్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన వరుణ్ తేజ్‌తో గొడవ పడుతున్నాడని తెలుస్తుంది. గొడవ అంటే బయట పడేది కాదు సినిమా పరంగా అంతర్గతంగా వార్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కంటికి కనిపిస్తుంది కూడా ఇదే. ఎందుకంటే ఇద్దరు హీరోలు ఇప్పుడు ఒకే బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలోనే పూరీ-విజయ్ సినిమా వస్తుంది. ఈ కాంబినేషన్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో తన సినిమా తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. మరోవైపు వరుణ్ తేజ్ కూడా సినిమాను కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నాడు నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి. అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. ఈ రెండు సినిమాల నేపథ్యం బాక్సింగ్ కావడంతో ఆసక్తి కూడా బాగానే ఉంది.
ఇదిలా ఉంటే జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈయన సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే సమయంలో విజయ్ దేవరకొండ కూడా సడన్‌గా సీన్లోకి వచ్చాడు. పూరీతో ఈయన చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కూడా ఇదే సమయంలో రానుంది. జనవరి 19న వరుణ్ సినిమా అప్ డేట్ వస్తుంటే.. ఒకరోజు ముందుగానే జనవరి 18 ఉదయం 10 గంటలకు తన సినిమా అప్ డేట్ విడుదల చేయనున్నాడు పూరీ జగన్నాథ్.
దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా విడుదల చేసాడు పూరీ జగన్నాథ్. జనవరి 18 ఉదయం 10.08 నిమిషాలకు విజయ్ సినిమా అప్ డేట్స్ బయటికి రానున్నాయి. ఈ సినిమాకు ముందు నుంచి కూడా ఫైటర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు దాన్ని మార్చేసే ఆలోచనలో ఉన్నాడు పూరీ. ఏదేమైనా కూడా ఒకేసారి వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరోలు ఇద్దరూ బాక్సింగ్ నేపథ్యంలోనే సినిమాలు చేయడం మాత్రం ఆసక్తికరంగా మారిందిప్పుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood, Varun Tej, Vijay Devarakonda