‘కథానాయకుడు’ సినిమా విడుదలైంది. ఊహించని విధంగా డిజాస్టర్ అయిపోయింది. ఎన్టీఆర్ జీవితం ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఊహించుకున్నారో అలాగే తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. తొలి భాగంలో ఆయన వైభోగమే కానీ ఎక్కడా చిన్న వివాదం కూడా లేదు. అందుకే ప్రేక్షకులు కూడా నిరాశపడ్డారు. తోటి నటులతో ఆయన ఉండే విధానం.. తనను అంత వాన్ని చేసిన ప్రజలకు ఏదో చేయాలని పడిన తపన.. ఇవన్నీ ‘కథానాయకుడు’లో చూపించాడు క్రిష్. ఇక్కడ ఈయన దర్శకత్వ ప్రతిభకు తార్కాణం అంటూ నిలిచే సీన్స్ ఏమీ లేవు. ఈ విషయం క్రిష్ కూడా ఒప్పుకున్నాడు. అసలైన పరీక్ష ఆయనకు ముందున్న ‘మహానాయకుడు’తో ఎదురు కానుంది.
ఈ సినిమాను క్రిష్ ఎలా తెరకెక్కించి ఉంటాడు అనే ఊహే ఇప్పుడు ప్రేక్షకులతో పాటు అభిమానుల్లోనూ టెన్షన్ పెంచేస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో అసలైన ఆటుపోట్లు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే మొదలయ్యాయి. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు అప్పటి వరకు దేవుడిగా ఉన్న ఆయన్ని కూడా సాధారణ మనిషిని చేసి రాళ్లు కాదు.. ఏకంగా చెప్పులేసారు. అలాంటి దారుణమైన అనుభవాలు కూడా ఎన్టీఆర్ జీవితంలో ఉన్నాయి. మరి వాటన్నింటినీ క్రిష్ ఎలా తెరకెక్కించి ఉంటాడు..?
అసలు ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని నేలమట్టం చేసిన వైస్రాయ్ సంఘటన ఉంటుందా ఉండదా.. అంతదూరం సినిమా వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కేవలం ఎన్టీఆర్ ప్రాభవాన్ని మాత్రమే చూపించాలనుకుంటున్న క్రిష్.. బాలయ్య.. వివాదాల జోలికి వెళ్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందిప్పుడు. ‘మహానాయకుడు’లో చంద్రబాబునాయుడు పాత్ర కీలకం కానుంది. ఆయన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్తో ఎలా ఉన్నారు.. అక్కడ్నుంచి ఎలా ఎదిగారు.. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఆయన్ని మహానాయకుడిగా మార్చేసాయనేది రెండో భాగంలో కీలకం కానుందని తెలుస్తుంది.
నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తర్వాత సినిమా రెండోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే సినిమా ముగుస్తుందని.. అక్కడ్నుంచి కేవలం కొన్ని ఫైల్ షాట్స్ వేసి ఎన్టీఆర్ చనిపోవడాన్ని చూపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు కథానాయకుడు క్రిష్ తెరకెక్కించిన తీరు చూసిన తర్వాత కచ్చితంగా మహానాయకుడు సినిమాపై కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా భజన చేస్తే కచ్చితంగా మహానాయకుడు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవుతుందనే భయం కూడా లేకపోలేదు. అందుకే రెండో భాగంలో కాస్త మసాలా ఎక్కువే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం.
దిశాపటానీ హాట్ ఫోటోషూట్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NTR, NTR Biopic, Telugu Cinema, Tollywood