టాలీవుడ్‌లో (Tollywood) పెద్ద దిక్కు ఎవరు? నటీనటుల కష్టసుఖాలు పంచుకునేది ఎవరితో? ఇండీస్ట్రీకి కష్టమొస్తే ఆదుకునే వారు ఎవరు? దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) మరణం తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానమే కరువైంది. దాసరి తర్వాత ఇండీస్ట్రీ పెద్దగా ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై నిత్యం చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ హీరో సుమన్ (Suman) ఇదే విషయమై నోరు విప్పారు. ఫిలిం చాంబర్‌లో జరిగిన దాసరి ఫిలిం అవార్డ్స్ (Dasari Film Awards) వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన సుమన్.. ఇదే వేదికపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు చిత్రసీమలో క్రమశిక్షణ కొరవడిందంటూ ఆయన చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
ఒకానొక సమయంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన సుమన్.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో అవకాశం ఉన్న ప్రతిసారి ఇండస్ట్రీ తీరుపై తన అభిప్రాయాన్ని బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాసరి ఫిలిం అవార్డ్స్ వేడుకలో ఆయన ఓపెన్ అయ్యారు. దాసరి నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సుమన్.. అంతటి దార్శనికత కలిగిన గొప్ప వ్యక్తి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీ పెద్ద అని ఎవరినీ చెప్పుకోలేమని, ఈ విషయమై భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేమని అనడం సినీ వర్గాల్లో పలు చర్చలకు తావిచ్చింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి అంటూ పలువురు సినీ ప్రముఖులు అంటున్నప్పటికీ.. చిరంజీవి మాత్రం దాన్ని అంగీకరించలేదు. తాను ఇండస్ట్రీని పెద్దను కాదని, ఇండస్ట్రీ బిడ్డను మాత్రమే అని అన్నారు చిరు. ఓ బిడ్డగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సాయం అందిస్తానని గతంలోనే చిరంజీవి చెప్పారు. అయితే ఇప్పుడు దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుమన్ నోట ఇండస్ట్రీ పెద్ద అనే మాట రావడం డిస్కషన్ పాయింట్ అయింది.
ఇకపోతే బయ్యర్ల గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు సుమన్. సినిమా ఫ్లాప్ అయితే ఎక్కువగా నష్టపోయేది బయ్యర్లు మాత్రమే అని, మనల్ని నమ్ముకొని బయ్యర్లు కోట్లు ఇన్వెస్ట్ చేస్తారని చెప్పిన సుమన్.. దాసరి గారు బయ్యర్ల క్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించారని అన్నారు. సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లకి ఆదుకునేందుకు ఆయన ప్రయత్నించేవారని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడున్న మేకర్స్ బయ్యర్ల గురించి ఆలోచించడం లేదని, అలాగే అనవసరంగా సినిమా బడ్జెట్ పెంచేస్తున్నారని అన్నారు. మేకర్స్ మీద నమ్మకంతో సినిమా కొని రోడ్డునపడ్డ బయ్యర్స్ కూడా ఉన్నారని, కాబట్టి బయ్యర్స్ క్షేమం కోసం ఇండస్ట్రీ ఆలోచించాల్సిన అవసరం ఉందని సుమన్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Dasari Narayana Rao, Suman, Tollywood