Ram Pothineni: టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యాచులర్ హీరోల లిస్ట్‌లో రామ్ పోతినేని ఒకరు. మిగిలిన హీరోల పెళ్లిళ్ల గురించి అప్పుడప్పడు గాసిప్‌లు వచ్చినా.. రామ్ గురించి మాత్రం అలా వచ్చిన వార్తలు చాలా తక్కువ. అయితే ఇంటర్వ్యూలకు వచ్చిన ప్రతిసారి మాత్రం రామ్‌కి ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ప్రతిసారి రామ్ కూడా తప్పించుకుంటూ ఉంటాడు. ఇక ఇటీవల తన మూవీ రెడ్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్‌కి అదే ప్రశ్న ఎదురైంది. మీ సీతను ఎప్పుడు పరిచయం చేస్తారు..? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. నాకు పరిచయం అయ్యాక అప్పుడు పరిచయం చేస్తానని రామ్ అన్నారు. ఇక పెళ్లి గురించి మాత్రం పెద్దగా సాగదీయకుండా అక్కడికే కట్ చేశాడు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లో ఉన్నందుకు ఎలా అనిపించింది అని ప్రశ్నించగా.. మొదట్లో కాస్త ఫ్రీగా అనిపించినా, తరువాత బోర్ కొట్టిందని తెలిపారు.
అలాగే మీరు ఈ లాక్‌డౌన్‌లో ఏదైనా కొత్తగా నేర్చుకున్నారా..? అన్న ప్రశ్నకు ఏం లేదని తెలిపారు. అయితే తాను తన కోసం వంటలు చేసుకుంటానని తెలిపారు. ఏదొక ప్రయోగాలు చేస్తూనే ఉంటానని అన్నారు. ఇంట్లో ఎవ్వరూ దాన్ని తినే సాహసం చేయలేదా..? అనే ప్రశ్నకు.. వాళ్లు తింటే ఇందులో అది ఎక్కువ, ఇది ఎక్కువ అయ్యిందని అంటారు. అప్పుడు అందులో అది ఎక్కువగానే ఉండాలి అని చెబుతుంటాను అని రామ్ అన్నారు. మరి మీ వంటకు పేర్లు ఉండవా..? అంటే అది అప్పటికప్పుడు పెడతానని ఫన్నీగా చెప్పుకొచ్చారు.
ఇక ఈ సంక్రాంతి బరిలో రామ్ రెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో విజయం సాధించిన తాడం రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీలో మాలవిక శర్మ, నివేథా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఇక రామ్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో ఉన్నట్లు ఆ మధ్యన తెలిపారు. అయితే ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారా..? లేక త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో మరో దర్శకుడు తెరకెక్కించనున్నాడా..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ram Pothineni