సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరును ప్రత్యేకంగా సినీ అభిమానులకు పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు రజనీకాంత్ గురించి తెలియనివారుండరు. తనదైన స్టైల్, నటనతో అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నటుడు మాత్రమే కాదు.. నిర్మాత, ఓ రచయితకూడా. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. రజనీ కోలీవుడ్ నటుడు అయినా.. తెలుగు వారికి కూడా ఎంతో దగ్గరయ్యాడు. ఆయన తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించాడు. రజనీని.. సూపర్ స్టార్, తలైవర్ అని ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకుంటారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన, విజయవంతమైన దక్షిణాది నటుడిగా రజనీ తనదైన ముద్ర వేసి గుర్తింపు పొందాడు. సినిమాల్లో ఆయన పలికే డైలాగ్స్, ప్రత్యేకమైన స్టైలు దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. రజనీకాంత్ దాదాపు యాభై సంవత్సరాలకు పైగా తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని భాషల్లో కలిపి రజనీ ఇప్పటివరకు సుమారు 160 కి పైగా సినిమాల్లో నటించారు.
శివాజీరావుగా, బెంగళూరులోని బస్సు నంబర్ 134లో బస్ కండక్టర్‌గా పనిచేసినప్పుడు రజనీకాంత్ స్టైల్ బెంగళూరు అంతటా ప్రసిద్ధి చెందింది. బస్సులో కిక్కిరిసిన రద్దీలో రజనీ స్టైల్‌గా టిక్కెట్లు చించేస్తున్న స్టైల్ చూడడానికే కాలేజీ అమ్మాయిలు రజనీ బస్సు ఎక్కేందుకు ఇష్టపడతారని రజనీ స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. బెంగుళూరులో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో రజనీకాంత్‌కి నిర్మల అనే మెడికల్ స్టూడెంట్‌తో పరిచయం ఏర్పడింది. అతను ఒక రంగస్థల నాటకంలో ప్రదర్శన ఇవ్వడం చూసి, నటనా వృత్తిని కొనసాగించమని ప్రోత్సహించింది. అతని తరపున తెలియకుండా అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి ఒక దరఖాస్తు పంపింది.
అలా నటనపై ఆసక్తి పెంచుకున్న సూపర్ స్టార్ 1975 లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించాడు. కొన్నాళ్ళు ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమా ఘన విజయం సాధించి రజినీకాంత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007 లో వచ్చిన శివాజీ సినిమా వందకోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది. 2010 లో వచ్చిన రోబో, 2018 లో వచ్చిన 2.0 సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా డ్యూయల్ రోల్ చేశాడు. ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. 1978 లో రజినీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి
సినిమా రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2016 లో పద్మవిభూషణ్ పురస్కారాన్నీ బహుకరించింది. ఒక జాతీయ పురస్కారం, ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారం, ఒక ఫిల్ం ఫేర్ పురస్కారంతో పాటు మరిన్ని పురస్కారాలు అందుకున్నారు రజనీకాంత్. రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్ కావడంతో అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ పేర ఉండటంతో ఆ గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ శివాజీ పేరును కాస్త తెరమీద రజినీకాంత్ అని మార్చాడు. అతని మునుపటి చిత్రం మేజర్ చంద్రకాంత్‌లోని పాత్ర పేరు నుండి దీనిని తీసుకున్నారు.
రజనీకాంత్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన.. 1950 డిసెంబరు 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ మీదుగా ఆయనకు ఆ పేరు పెట్టారు. వీరి ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. రజినీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. మహరాష్ట్ర, పుణె సమీపంలోని మావడి కడెపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజినీకాంత్ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణ రావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్ బాలూభాయి. 1956 లో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్ కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రజినీకాంత్ 9 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Kollywood News, Rajnikanth