HAPPY BIRTHDAY SENIOR TOP COMEDY STAR VIJAYA KRISHNA NARESH DO YOU KNOW FACTS ABOUT HIS PERSONAL CINEMA AND POLITICAL CAREER TA
HBD Senior Naresh : ఒకప్పటి సీనియర్ హీరో ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేష్ గురించి ఈ నిజాలు తెలుసా..
హ్యాపీ బర్త్ డే సీనియర్ హీరో నరేష్ (Twitter/Photo)
Happy Birthday Vijaya Krishna Naresh : తెలుగు ప్రేక్షకులకు హాస్యాన్ని కొత్తకోణంలో చూపించిన హీరో విజయ్ కృష్ణ నరేష్. 80,90దశకాల్లో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన టాలెంటెడ్ హీరో. ఈ రోజు ఈ విలక్షణ నటుడి పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం.
Happy Birthday Vijaya Krishna Naresh : తెలుగు ప్రేక్షకులకు హాస్యాన్ని కొత్తకోణంలో చూపించిన హీరో విజయ్ కృష్ణ నరేష్. 80,90దశకాల్లో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన టాలెంటెడ్ హీరో. ఏ రసాన్నైనా పండించగల ఆల్ రౌండర్. నటి, దర్శకురాలు విజయనిర్మల కొడుకుగా వారసత్వంగా హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కామెడీ హీరోగా తనదైన ముద్రని వేసుకుని.. ప్రస్తుతం తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవ్వులు పండిస్తూ, బరువైన పాత్రలతో మెప్పిస్తున్నాడు..నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేకం. కామెడీ హీరోగా ఒక తరం ప్రేక్షకులను అలరించిన కామెడీ హీరో నరేష్. అప్పటివరకు ఉన్న హీరోయిజానికి.. కామెడీని జత చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. లవ్, కామెడీ, మాస్ లాంటి అన్నిరకాల సినిమాలనూ చేసిన టాలెంటెడ్ హీరో నరేష్. తెలుగులో రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
నరేష్ విషయానికొస్తే.. 1960 జనవరి 20న చెన్నైలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కృష్ణ మూర్తి. ఈయన చిన్నపుడే తండ్రి చనిపోయినట్టు పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఆయన ఎలా ఉంటారో తెలియదన్నారు. నరేష్ పుట్టేనాటికే తల్లి విజయనిర్మల టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా, ప్రొడ్యుసర్‌గా ఉన్నారు. దాంతోపాటు.. ఇంట్లో ఉండే సినీ వాతావరణం నరేష్ ని సినిమాల్లో కి వచ్చేలా చేసింది. 1970లో కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించిన ‘రెండు కుటుంబాల కథ’ సినిమాతో బాల నటుడిగా తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత 1972లో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలో నటించిన ‘పండంటి కాపురం’ సినిమాలో కూడా నరేష్ బాల నటుడిగా అలరించారు. ఆ తర్వాత 1982లో తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ సంకెళ్లు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.
ఆ తర్వాత జానర్ మార్చి కామెడీ సినిమాలు చేశారు నరేష్. ముఖ్యంగా హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో చేసిన ‘నాలుగు స్థంభాలాట’ మూవీ హీరోగా నరేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్‌తో హీరోగా నరేష్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘రెండు జెళ్ల సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ లాంటి సినిమాలతో కామెడీ హీరోగా సెటిలైపోయారు. ఈ సినిమాలతో నరేష్ కెరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాల్లో కామెడీతో పాటు.. లవ్ ని కూడా టచ్ చేసి రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు.
జంధ్యాల దర్శకత్వంలో నరేష్ చాలా సినిమాల్లో నటించారు. జంధ్యాల అంటేనే ఆరోగ్యకరమైన కామెడీకి కేరాఫ్ అడ్రస్...నవ్వుల ఫ్యాక్టరీ...అందుకే నరేష్, జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ నవ్వుల పువ్వులు పూయిస్తూ అటు ప్రేక్షకులను అలరిస్తూ...సినిమా హిట్ తో ఇటు నరేష్‌కు కామెడీ హీరోగా సక్సెస్ లు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘పుత్తడి బొమ్మ, ‘మొగుగు పెళ్లాలు ‘ ‘చూపులు కలిసిన శుభవేళ’, హై హై నాయకా’, ‘ బావ బావ పన్నీరు’ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.
ఒకవైపు హీరోగా నటిస్తూనే.. వేరే హీరోల సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘జీవన పోరాటం’. శోభన్ బాబు, రజినీకాంత్ వంటి హీరోలతో నటించి తనదైన సత్తా చాటారు. అటు వెంకటేష్‌తో కూడా ‘టూటౌన్ రౌడీ’, శృతిలయలు’ వంటి సినిమాల్లో సెకండ్ హీరో పాత్రల్లో మెప్పించారు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే.. ‘అగ్ని సమాధి’,సాహసమే నా ఊపిరి’ ‘శివ శక్తి’ వంటి సినిమాల్లో యాక్షన్ హీరోగా మెప్పించారు. ఇక ‘శివ శక్తి’ సినిమాలో డ్యూయల్ రోల్లో అదరగొట్టారు. ఈ సినిమానే ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ .. నాగార్జునతో కాస్త మార్పులతో జాకీ చాన్ ‘ట్విన్ డ్రాగన్స్’ను స్పూర్తిగా తీసుకొని ‘హలో బ్రదర్’గా తెరకెక్కిస్తే సూపర్ హిట్టైయింది.
అటు తల్లి విజయ నిర్మల, జంధ్యాలతో పాటు వంశీ దర్శకత్వంలో చేసిన ‘కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ సినిమాలో గోపాలంగా నరేష్ నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్లో పెద్ద సంచలన విజయం సాధించింది. నరేష్ కెరీర్ లో ఇలాంటి సినిమాలు ఎన్నో..అందులో ఒకటి 1991లో వచ్చిన చిత్రం భళారే విచిత్రం సినిమా. నరేష్ కెరీర్ లో మరో హిట్ మూవీగా ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నరేష్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. అందుకే ఈ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమాను తమిళ్, కన్నడ భాషల్లోకి కూడా రీమేక్ చేసారు.
1992లో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘జంబలకిడిపంబ’. ఈ సినిమా నరేష్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఏ కామెడీ సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి, టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. జంబలకిడి పంబ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ క్రియేట్ చేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీలా వచ్చినా ఆ ఛాయలేవీ కనిపించకుండా ఎంతో హాస్యంగా అందరూ మెచ్చేలా రూపొందించిన ఈ సినిమా నరేష్ కు ఎంత పేరు తెచ్చిందో..దర్శకుడిగా ఈవీవీ సత్యనారాయణకు, హీరోయిన్ గా ఆమనికీ అంతే పేరు తెచ్చి సంచలనం సృష్టించింది ఈ సినిమా.
ఆ తర్వాత నరేష్ హీరోగా ‘ఆమె’, ‘సొగసు చూడతరమా’ వంటి సినిమాల్లో హీరోగా నటించారు. చివరగా కథానాయకుడిగా నటించింది గుణ శేఖర్ ‘సొగసు చూడతరమా’ సినిమాలో. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిర పడ్డారు. ఇన్నేళ్ల కెరీర్లో బాలకృష్ణ.. ‘శ్రీకృష్ణార్జున విజయం’, ఎన్టీఆర్.. ‘యమదొంగ’లో నారదుడి వేషంలో మెప్పించారు.
ఎన్నో సినిమాల్లో హీరోగా, కామెడీ హీరోగా, రొమాంటిక్ కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరించిన నరేష్..మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తండ్రిగా, మామాగా లాంటి వయసుకు తగ్గ పాత్రలతో అలరిస్తున్నారు నరేష్. అలా చేసిన సినిమాల్లో ’రంగస్థలం, ‘వీ’, దృశ్యం, భలే భలే మొగాడివోయి, గుంటూరు టాకీస్, నిన్నమొన్న వచ్చిన ‘మ్యాస్ట్రో’ ‘సూపర్ మచ్చి’, ‘హీరో’ లాంటి చాలా మూవీల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన స్టామీనా, స్టార్ డమ్ రుజువుచేసుకున్నారు నరేష్.
కృష్ణ, విజయ నిర్మలతో సీనియర్ నటుడు నరేష్ (Twitter/Photo)
ఎక్కువగా కామెడీ సినిమాలే చేసినా అపుడపుడు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నరేష్ అంతేకాదు ప్రేక్షకుల హృదయాల్లో విలక్షణ హస్య నటుడుగా నిలిచిపోయారు ఈ నవ్వుల రారాజు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా భారతీయ జనతా పార్టీలో క్రీయా శీలకంగా వ్యవహరించారు. 1999లో హిందూపురం నుంచి లోక్‌సభకు పోటీ చేసారు.
అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మొన్నటి వరకు పనిచేసారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో నరేష్ వాయిస్ బాగానే వినిపించింది. ఈయనకు భార్య రేఖ ఉంది. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి కూతురు రమ్య రఘుపతిని వివాహా మాడారు. ఈయనకు ముగ్గురు కుమారులు.ఆల్రెడీ ఓ కుమారుడు నవీన్ విజయ కృష్ణ హీరోగా ‘నందిని నర్సింగ్ హోం’ మూవీతో పరిచయమయ్యారు. ఇక 150కి పైగా సినిమాల్లో వైవిద్యమైన పాత్రల్ని పోషించిన ఈ నవ్వుల రేడు సీనియర్ నరేష్... ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.