Happy Birthday Director Sekhar Kammula | తెలుగు సినిమాకు వన్నెలద్దిన దర్శకులు కొందరు. ఆ కొందరిలో శేఖర్ కమ్ముల ఒకరు శేఖర్ కమ్ముల. ఈయన సినిమాలు తెలుగుతనం ఉట్టిపడుతూ, విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఆశ్లీలతకు ఆమడదూరంలో ఉంటాయి.. యూత్ ప్రేక్షకులు ఫిదా అయ్యి, థియేటర్స్ ముందు క్యూ కట్టేలా చేయడంలో సిద్దహస్తుడు. తెలుగుఅమ్మాయిని, తెలుగుతనాన్ని అందంగా తనదైన బాణీలో చిత్రీకరించడంలో శేఖర్ కమ్ములది అందెవేసిన చెయ్యి.. తనదైన దర్శకత్వ శైలితో సినిమాపై ప్రత్యేక ముద్ర వేసిన దర్శక లీడర్ శేఖర్ కమ్ముల...ఈ రోజు శేఖర్ కమ్ముల పుట్టిన రోజు సందర్బంగా న్యూస్ 18 ప్రత్యేకం. తెలుగులో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. అప్పట్లో.. బాపు, విశ్వనాథ్‌ల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల.
పాటను అందంగా చిత్రీకరించినా, మాటను ఆకట్టుకునేలా పలికినా, విలువలకు పట్టంకట్టినా, అబాలగోపాలం అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమాను చూసినా అది శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభకే చెల్లింది. తనదైన మేకింగ్ స్టైల్ తో, వినూత్నతను ప్రదర్శిస్తూ ,యూత్ కు మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు శేఖర్ కమ్ముల, ఈయన సినిమాలలో స్టార్ లుండరు. కథే సినిమాకు స్టార్.
తనదైన హృద్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4వ తారీఖున జన్మించారు. ఆంద్ర ప్రదేశ్ లోని ఏలూరు ప్రాంతానికి చెందిన శేఖర్ కమ్ముల బాల్యం నుండి హైదరాబాద్ లోనే గడిపాడు. ఆ తర్వాత అమెరికాలో సినిమాకు సంబందించిన టెక్నాలజీలో కోర్సు చేసిన శేఖర్..ఇండియాకు వచ్చి తీసిన మొదటి సినిమా ‘డాలర్ డ్రీమ్స్’..ఫస్ట్ సినిమాతోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.
ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో అందరూ కొత్తవాళ్లతో, తక్కువ బడ్జేట్ లో తీసిన సినిమా ‘ఆనంద్’. మంచి కాఫీ లాంటి సినిమాగా తయారైన ఈ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో వినూత్న దర్శకుడిని పరిచయం చేసింది. ఈ సినిమా మెగాస్టార్ శంకర్ దాదా mbbs సినిమా రెండూ ఒకేరోజు రిలీజైనా చిరంజీవి సినిమా హవాను తట్టుకుని నిలబడి సూపర్ హిట్ అయ్యింది. ప్రేక్షకుల మదిలో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫీల్మ్ గా నంది అవార్డు తో పాటు..శేఖర్ కమ్ములకు బెస్ట్ డైరెక్టర్‌గా నంది అవార్డులను తీసుకువచ్చింది.
ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గోదావరి’. అలనాటి బాపు తెరకెక్కించిన ‘అందాల రాముడు’ సినిమాను ఇది గుర్తుకు తెచ్చింది. పాపికొండల అందాలు, గోదావరి హోయలు తన దైన శైలిలో అందంగా చిత్రీకరించాడు శేఖర్ కమ్ముల...ఈ సినిమా ఫలితం అంత ఆశా జనకంగా లేక బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఐతే శేఖర్ కమ్ముల మాత్రం బెస్ట్ దర్శకుడుగా నంది అవార్డు అందుకున్నారు ..
గోదావరి చిత్రం నిరాశ పరచడంతో ఈ సారి సక్సెస్ సినిమా అందించాలని తీసిన సినిమా ‘హ్యపీడేస్’.ఈ సినిమాలో కూడా పూర్తిగా కొత్త నటీనటులను పరిచయం చేశాడు. కాలేజ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులకు తమ కాలేజీ మధుర స్మృతులను గుర్తుకు తెచ్చింది ఈ మూవీ.ఈ సినిమా ద్వారా పరిచయం అయి స్టార్స్ గా ఎదిగిన వారిలో తమన్నాను ముందుగా చెప్పుకోవాలి. ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది.
దర్శకుడిగానే కాకుండా శేఖర్ కమ్ముల టేస్ట్ ఉన్న నిర్మాతగా కూడా నిరూపించుకున్నాడు, తన మిత్రుడు అనిష్ కురువిల్లను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా ‘అవకాయ్ బిర్యాని’. కానీ ఈ చిత్రం కమర్షియల్‌గా నిరాశ పరిచింది.
శేఖర్ కమ్ముల సినిమాలు మిడిల్ క్లాస్ జీవితాలలోని వాస్తవికతను ప్రతిబించేలాగా ఉంటాయి. వివిధ సందర్భాల్లో మనుషుల భావోద్వేగాలు, సందర్భాన్ని బట్టి మారే మనస్తత్వాలను అత్యంత సహజంగా పట్టి చూపడంలో శేఖర్ కమ్ముల మంచిదిట్ట.శేఖర్ కమ్ముల సినిమా లలో ప్రత్యేకంగా చెప్పు కోవాల్సిన మరో అంశం హీరోయిన్....బాపు తర్వాత అంత అందంగా హీరోయిన్ ని చిత్రీకరించే దర్శకుడు శేఖర్ కమ్ములనే. ఈయన హీరోయిన్స్ ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో, తమ దైన డైలాగ్ మాడ్యులేషన్ లతో అలరిస్తాయి. అశ్లీలతకు తావివ్వకుండా కుర్రకారు గుండెల్లో స్వప్న సుందరిగా గిలిగింతలు పెట్టేలా ఈ కథానాయిక ఉంటుంది.
హ్యపీ డేస్ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తీసిన మూవీ ’లీడర్’. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాతో దగ్గుబాటి రాణా హీరోగా పరిచయం అయ్యాడు..ఈ మూవీ మంచి సినిమాగా గుర్తింపు పొందినా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోద చేసింది. ఈ సినిమాతో కానీ శేఖర్ బెస్ట్ స్టోరి రైటర్ గా నంది అవార్డు అందుకున్నారు.
ఆ తర్వాత మరోసారి కొత్త నటీనటులతో నిర్మించిన సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’. జీవితం ఎంత అందమైనదో చెప్తూ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది.ఈ సినిమా తర్వాత హిందీ కహానీ సినిమాకు రీమెక్ గా తెలుగులో నయనతార కథానాయికగా ‘అనామిక’ సినిమాకు దర్శకత్వం వహించాడు శేఖర్ కమ్ముల..తన పంథాకు బిన్నంగా త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.
ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయి పల్లవితో తెరకెక్కించిన ‘ఫిదా’ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను తన సినిమాతో ఫిదా అయ్యేలా చేసాడు. తెలంగాణ, అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అదే తరహాలో నాగ చైతన్య, సాయి పల్లవిలతో ‘లవ్ స్టోరీ’ అనే సెన్సిబుల్ కథను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి తెలంగాణ యువతీ, యువకులుగా అలరించారు.
చూడటానికి సాదారణంగా కనిపించే శేఖర్ కమ్ముల అసామాన్య ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. లవ్ స్టోరీ తర్వాత ధనుశ్‌తో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. చేసినవి తక్కువ సినిమాలే ఐనా తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో తెలుగు సినిమాపై ప్రత్యేక ముద్రవేస్తున్న దర్శకుడు. తన దర్శక ప్రతిభతో సిల్వర్ స్క్రీన్ పై తన సినిమాలతో కనువిందు చేస్తున్న శేఖర్ కమ్ముల ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sekhar kammula, Tollywood