Happy BirthdaySuper Star Rajinikanth:రజినీకాంత్ మిగతా హీరోల్లా స్మార్ట్ గా ఉండడు. కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ అసలే లేదు. లేటెస్ట్ ట్రేండ్ అసలే ఫాలో కాడు. కానీ అందరు తనని ఫాలో అయ్యేట్టు చేస్తాడు.అంతేకాదు సినీ వినీలాకాశంలో స్వయంకృషితో ఎదిగిన నల్లని చంద్రుడు. అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా న్యూస్18 స్పెషల్. ఈ రోజు రజినీకాంత్ 70వ వసంతాలు పూర్తి చేసుకున్నారు. రజనీకాంత్ ఏం చేసినా సంచలనమే. నవ్వులో వైవిధ్యం, నడకలో వేగం, గొంతులో గాంభీర్యం, మ్యానరిజంలో మాస్ అప్పియరెన్స్ అన్నీ కలిసి ఆయన్ని సూపర్ స్టార్‌ని చేశాయి. రజినీకాంత్ సిగరెట్ వెలిగించినా, సెల్యూట్ చేసినా...కోట్ వేసినా.. అదొక స్టైల్..అదొక స్పెషల్ మ్యానరిజం. అందుకే మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది నటుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.
నేను ఒక్కసారి చెప్పితే వందసార్లు చెప్పినట్టే... దేవుడు శాసిస్తాడు ఈ అరుణచలం పాటిస్తాడు.... నా దారి రహదారి... నాన్నా పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది... లాంటి డైలాగ్స్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చాయి. ఈ డైలాగ్స్ పలకడంలో రజినీకాంత్ స్టైయిలే వేరు.
తన సినిమాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే రజినీకాంత్..1950 డిసెంబర్ 12న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మొదట బెంగుళూరు ట్రాన్స్ పోర్టులో కండక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. దాంతో పాటు అప్పుడప్పుడు స్టేజీల మీద నాటకాలు కూడా వేస్తుండేవాడు. అలా దర్శక దిగ్గజం కే.బాలచందర్ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వంలో మొదటిసారి 1975లో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాలో ప్రతినాయకుడిగా రజినీకాంత్ అదరగొట్టేసారు.
తెలుగులో వచ్చిన ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాలో రజనీకాంత్ ఫస్ట్ టైం మెయిన్ రోల్ చేశాడు. రజనీలోని నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది..సినీ ఇండస్ట్రీకి రజనీకాంత్ ను బహుమతిగా ఇచ్చింది కె.బాలచందర్. అయితే రజనీ మొదట్లో చేసిన రోల్స్ అన్నీ నెగెటివ్ లేదా సెకండ్ హీరో ఆఫ్షన్స్...అయితే ఆయన్ని పూర్తిస్థాయి పాజిటివ్ హీరోగా మార్చిన డైరెక్టర్ మాత్రం ఎస్.పి.ముత్తురామన్. ఈయన హీరో కార్తీక్ తండ్రి.
బాలచందర్ ‘అంతులేని కథ’ సినిమాలో హీరోగా కనిపించినా అది నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్..ఫీమేల్ లీడ్ స్టోరీ...కానీ ముత్తురామన్ తీసిన ‘చిలకమ్మ చెప్పింది’ సినిమా రజనీ ఇమేజ్ నే మార్చేసింది. ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ పాజిటివ్ హీరో రోల్లో రజనీకాంత్ కెరీర్ ను టర్న్ చేసింది ఈ సినిమా.
1977లో తెలుగులో సింగిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా...తమిళ్లో సోలో హీరోగా అవకాశాలు రాలేదు.తెలుగు, తమిళ, కన్నడ, హిందీల్లో మంచి రోల్స్ వచ్చాయి. సెకండ్ హీరోగా చాలా సినిమాలు చేశాడు. అయితే 1980లో 25వ సినిమాగా చేసిన ‘భైరవి’ తమిళ్లో పుల్ లెంగ్త్ హీరో రోల్‌తో సోలో హీరోగా మారారు. ఆ తరువాతే వరుస విజయాలతో సౌత్ ఇండియాలో సూపర్ స్టార్‌గా రజినీకాంత్ వెనుదిరిగి చూసుకోలేదు.
ప్రేక్షకుల్లో రజినీకాంత్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఆయన స్టైయిల్. ఆయన నటించిన సినిమాలు అంత పాపులార్ కావడానికి కారణం కూడా ఇదే. సిగరెట్ వెలిగించే స్టైల్... సెల్యూట్ చేసే స్టైయిల్ ఆయన్ని మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేశాయి. ఇక రజినీకాంత్ స్టైల్, మేనరిజమ్ పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన చిత్రం ‘బాషా’. ఈ సినిమాలో ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే డైలాగ్స్ ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోలేదు.’బాషా’ మూవీతో రజినీకాంత్..తెలుగులో ఇక్కడి స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.
ఇక రజనీకాంత్ పేరుని ప్రపంచం మొత్తం పరిచయం చేసిన సినిమా ‘దళపతి’. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో కలిసి పనిచేశారు. తమిళ, కన్నడ, హిందీ, తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, జగపతిబాబు వంటి అనేకమంది కథానాయకులతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రజినీ. మరోవైపు హాలీవుడ్ సినిమాలో నటించిన ఘనత రజినీకాంత్ సొంతం.
తెలుగులో రజినీకాంత్ డైరెక్ట్‌గా నటించిన మరో సినిమా ‘పెదరాయుడు’. ఈ చిత్రంలో ఆయన కనిపించింది కాసేపే అయినా..ఆ రోల్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. రజినీకాంత్ చేసిన పాపారాయుడు పాత్ర ఈ సినిమా విజయంలో కీలకంగా మారింది.
ఆ తరువాత వచ్చిన ‘ముత్తు’ సినిమా కూడా రజినీకి పెద్ద హిట్. సూపర్ స్టార్ ఖ్యాతిని జపాన్ వరకు తీసుకెళ్లిన సినిమా ‘ముత్తు’. ఈ సినిమా హిట్ తో విదేశాల్లో రజినీ పేరు ఖండాంతరాలు దాటింది.
ఆ తర్వాత ‘అరుణాచలం’, నరసింహా’, ‘చంద్రముఖి’, ‘శివాజీ’ మూవీలు రజినీకాంత్ ఇమేజ్ను పెంచాయి. శంకర్ ,రజినీ కాంబీనేషన్‌లో వచ్చిన రెండో అద్బుత సైంటిఫిక్ మూవీ ‘రోబో’. కోలీవుడ్, బాలీవుడ్‌లతో పాటు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.
రోబో తర్వాత రజినీకాంత్ నటించిన ‘కొచ్చాడయాన్’, ‘లింగ’, ‘కబాలి’, ‘కాలా’ 2.O‘పేట’, దర్బార్’ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
రజినీకాంత్ సినీకెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తమిళ్లో ఆరు సార్లు ఉత్తమ నటుడి అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, కేంద్రం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. రజినీకాంత్‌లో ఆధ్మాత్మిక భావాలు కూడా ఎక్కువ. ఖాళీ సమయాల్లో హిమాలయాకు వెళుతూ సేద తీరుతూ ఉంటారు.
అంతేకాదు త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించబోతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 31న రాజకీయ పార్టీ పేరు.. ఎపుడు స్థాపించేది తదితర విషయాలను వెల్లడిస్తానని స్వయంగా రజినీకాంత్ మీడియాకు , అభిమానులకు తెలయిజేసారు. అంతేకాదు వచ్చే యేడాది మేలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. అంతేకాదు తమిళనాడు ద్రవిడ పాలిటిక్స్‌కు పోటీగా ఆధ్యాత్మిక రాజకీయాలు నడుపుతానని చెప్పారు. ఇప్పటికే రజినీకాంత్‌కు చెందిన మక్కల్ మండ్రం.. పొలిటికల్‌గా రాబోయే ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతోంది. మొత్తానికి రీల్ లైఫ్‌లోనే కాదు..రియల్ లైఫ్‌లో నిజమైన హీరోగా ఎదిగిన రజినీకాంత్ రాజకీయ రంగంలోకి ఏ మేరకు విజయం సాధిస్తారనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Kollywood, Rajinikanth, Tollywood