Happy Birthday Rajasekhar | రాజశేఖర్ అంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేవి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలే అయినా..ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యే పాత్రలతో కూడా మెప్పించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎన్ని సినిమాలు చేసినా.. రాజశేఖర్ అంటే ఆడియన్స్ ముందు ఆయన చేసిన యాంగ్రీ మెన్ పాత్రలే గుర్తుకు వస్తాయి. అందుకే తెలుగు ఇండస్ట్రీలో ఈయన్ని యాంగ్రీ యంగ్ మెన్‌గా పిలుస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా హీరోగా సక్సెస్‌లేని రాజశేఖర్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గరుడవేగ’తో ట్రాక్‌లో పడ్డాడు. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాడు.
ప్రస్తుతం రాజ శేఖర్.. ’శేఖర్’ ది మ్యాన్ విత్ స్కార్’ ట్యాగ్ లైన్. ఈ సినిమాతో లలిత్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హీరోగా రాజశేఖర్‌కు 91వ చిత్రం. ఈ సినిమాలో రాజశేఖర్.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో పలకరించబోతున్నట్టు ఈ సినిమా పోస్టర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ రోజు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు చిత్ర యూనిట్.
ఐతే.. రాజశేఖర్ ఒక మూసకు పరిమితం కాకుండా.. కథ నచ్చితే.. హీరోగానే కాకుండా.. విలన్‌గా యాక్ట్ చేయడానికి ఎలాంటి మెహమాటం లేదంటున్నాడు. అన్ని కుదిరితే..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘థృవ’లో అరవింద్ స్వామి పాత్ర కోసం ముందుగా రాజశేఖర్‌ను అనుకున్నారట. ఐతే చివరకు ఆ పాత్రను అరవింద స్వామితోనే తెలుగులో చేయించారని రాజశేఖర్..అప్పట్లో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘ధృవ’ సినిమా తమిళంలో ‘తనీ ఒరువన్’ సినిమాకు రీమేక్. తెలుగులో రామ్ చరణ్‌తో తెరకెక్కిద్దామనుకున్నపుడు అక్కడ అరవింద స్వామి పోషించిన స్టైలిష్ విలన్ పాత్రను తెలుగులో రాజశేఖర్‌తో చేయిద్దామని దాదాపు ఖరారు అయిందట. లాస్ట్ మినిట్‌లో ఆ పాత్రను అరవింద్ స్వామి చేసాడు. ఇక తమిళంలో అరవింద్ స్వామి ఒక్కడే ఉన్న చాలా సీన్స్ ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా షూట్ చేయాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశ్యంతో తెలుగులో కూడా అరవింద్ స్వామినే తీసుకున్నారు. ఈ రకంగా అల్లు అరవింద్‌కు బడ్జెట్ కలిసి రావడంతో రాజశేఖర్‌కు విలన్‌గా నటించే ఛాన్స్ మిస్ అయింది. ఒక్క రామ్ చరణే కాదు... చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’లో విలన్‌గా రాజశేఖర్ పేరు ప్రస్తావన వచ్చింది. అంతకు ముందు చిరు హీరోగా నటించిన ‘స్నేహం కోసం’లో విజయ్ కుమార్ చేసిన పాత్ర కోసం రాజశేఖర్‌ను అనుకున్నారట.
ఐతే.. యంగ్ గా ఉన్న మీరు ఆ క్యారెక్టర్‌కు సూట్ కారని చిరు చెప్పారు. మరేదైన మంచి పాత్ర ఉంటే తప్పకుండా చేద్దాం అని చిరు అన్నారని రాజశేఖర్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉంటారు. అంతేకాదు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో ఉపేంద్ర పాత్ర కోసం ముందుగా రాజశేఖర్‌ను అనుకున్నారట. కానీ ఫైనల్‌గా ఆ క్యారెక్టర్‌ను ఉపేంద్రతో చేయించారని రాజశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఒక్క మెగా హీరోల సినిమాలే కాదు..‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కోసం ముందుగా రాజశేఖర్ పేరు పరిశీలించారట. ఫైనల్‌గా ఆ పాత్ర ప్రకాష్ రాజ్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఇక దర్శకుడిగా శంకర్ తెరకెక్కించిన ‘జెంటిల్ మెన్’ సినిమాను ముందుగా అనుకున్నది రాజశేఖర్‌నే. ఆ తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు శంకర్. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే కదా.
అటు శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు’లో కూడా ముందుగా ముసలి కమల్ హాసన్ పాత్ర కోసం రాజశేఖర్‌ను..యంగ్ కమల్ హాసన్ పాత్ర కోసం వెంకటేష్‌ను అనుకున్నారు. చివరకి శంకర్‌కు కమల్ హాసన్ డేట్స్ ఇవ్వడంతో ..ఆయనతోనే ‘భారతీయుడు’ సినిమాను తెరకెక్కించారు.
అటు చిరంజీవి కెరీర్‌లో బెస్ట్ గా నిలిచిన ‘ఠాగూర్’ సినిమాను ముందు రాజశేఖర్ రీమేక్ చేయాలనకున్నాడు. కానీ చివరకు అది చిరంజీవి దగ్గరకు వెళ్లిపోయింది. అప్పటి నుంచే చిరు, రాజశేఖర్‌ల మధ్య మనస్పర్ధలు మొదలైయ్యాయి.
ఇప్పటికీ ఆ వివాదాలు సద్దు మణగలేదనుకో. మొత్తంగా తనకు కథతో పాటు క్యారెక్టర్ నచ్చితే.. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి వెనకాడనని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. మరి రాజశేఖర్ మాటలు విని ఎవరైనా ఆయనకు మంచి క్యారెక్టర్స్ ఇస్తారేమో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Action King Arjun, Chiranjeevi, Rajasekhar, Ram Charan, Tollywood