HAPPY BIRTHDAY KAMAL HAASAN HOW IS BECOME UNIVERSAL HERO TA
HBD Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ఈ నిజాలు తెలుసా..
హ్యాపీ బర్త్ డే కమల్ హాసన్ (Twitter/Photo)
Happy Birthday Universal Hero Kamal Haasan | దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భారతీయుడు. ప్రయోగాలు, విభిన్నపాత్రలకు ఆయనే నాయకుడు. తన యాక్టింగ్ తో ఆడియన్స్ కు దశావతారం చూపిస్తున్న లోకనాయకుడు. భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు. ఆయనే ప్రముఖ నటుడు లివింగ్ లెజండ్ కమల్ హాసన్. ఈయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. న్యూస్18 స్పెషల్.
Happy Birthday Kamal Haasan : దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భారతీయుడు. ప్రయోగాలు, విభిన్నపాత్రలకు ఆయనే నాయకుడు. తన యాక్టింగ్ తో ఆడియన్స్ కు దశావతారం చూపిస్తున్న లోకనాయకుడు. భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు. వెండితెరపై విశ్వరూపం చూపిస్తున్న నట కమలం. కేవలం నటుడిగానే కాకుండా...దర్శకుడిగా, నిర్మాతగా ,స్క్రీన్ ప్లే రైటర్ గా, కథకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇపుడు ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీతో పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే ప్రముఖ నటుడు లివింగ్ లెజండ్ కమల్ హాసన్. ఆయన బర్త్ డే సందర్భంగా న్యూస్18 స్పెషల్.‘మరోచరిత్ర’, ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘శుభ సంకల్పం’.. తెలుగులో ఆయన చేసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు. ఇవి చాలు.. నటుడిగా ఆయన స్టామినా ఏమిటో చెప్పడానికి.
‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో బాలనటుడిగా ప్రారంభమైన కమల్ సినీ ప్రస్థానం....నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ 5 షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే.. త్వరలో ‘విక్రమ్’ మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు.
విభిన్న పాత్రల్లో కమల్ హాసన్ (Twitter/Photo)
నవరసాలు ఆయనకు కొట్టిన పిండి. దశావతారాలు పోషించడంలో దిట్ట. విశ్వరూపం చూపడంలో అనితరసాధ్యుడు. కమల్ పేరెత్తకుండా భారతీయ ఉత్తమ చిత్రాల గురించి మాట్లాడ్డం వీలు కాదు. స్టార్ డమ్, ఇమేజ్ చట్రాలేమిటో ఆయనకు తెలియవు. అందుకే ఆర్ట్, కమర్షియల్ సినిమాలను ఏకం చేసిన కొందరంటే కొందరిలొ ఆయన ఒకడిగా నిలిచారు.
విశ్వరూపం
ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న కమల్ హాసన్...1954, నవంబర్ 7న తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా, పరమకుడిలో జన్మించారు కమల్ హాసన్. తన ఆరేళ్ల వయసులో ‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో.. బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించారు. కమల్ ఉత్తమంగా నటించడం.. అక్కడి నుంచే మొదలైంది.
బాల నటుడి నుంచి యూనివర్సల్ హీరోగా కమల్ హాసన్ ప్రస్థానం (twitter/Photo)
బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీ రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు. తర్వాత భాషా బేధం పాటించకుండా నటుడిగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటించారు. అందులో భాగంగా.. ఆరేడు సినిమాలు యాక్ట్ చేసారు. వాటిలో 1974లో మలయాళంలో వచ్చిన ‘కన్యాకుమారీ’ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన ‘పదనారు వయదినిలె’ కమల్ హాసన్ కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ తర్వాత కమల్ వెనుదిరిగి చూసుకోలేదు.
పలు రకాల పాత్రల్లో కమల్ హాసన్ (twitter/Photo)
అప్పటి వరకూ తమిళ, మలయాళ భాషలకు మాత్రమే పరిచయమైన కమల్ నట విన్యాసం.. తెలుగు వారికి సైతం పరిచయమైంది. అందుకు డైరెక్టర్ కె. బాలచందరే కారణం. అటు కమల్ కెరీర్ ను మలుపు తిప్పడమే కాకుండా.. ఇటు ప్రేమకథా చిత్రాల ఒరవడికి శ్రీకారం చుట్టిందీ చిత్రం. అదే 1978లో వచ్చిన ‘మరో చరిత్ర’. ఇందులో కమల్, సరితలు చేసిన నటనకు.. తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు. కలర్ సినిమాల టైంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ మూవీ ఇది.
మరో చరిత్ర (యూట్యూట్ క్రెడిట్)
మొదటి రోజుల్లో కమల్ అదృష్టమో, డైరెక్షర్ల అవసరమో తెలియదుగానీ.. వైవిధ్యమున్న పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చేవి. 1981లో తెలుగులో రిలీజైన ఆకలిరాజ్యం.. కమల్ కెరీర్ ఫస్ట్ డేస్ లో వచ్చిన గ్రేట్ మూవీస్ లో ఒకటి. 1981లో మరో చరిత్రను హిందీలో.. ‘ఏక్ దూజ్ కేలియే’గా రీమేక్ చేసారు. బాలచందర్ డైరెక్షన్లో, కమల్ హాసన్ హీరోగా, రతీ అగ్నిహోత్రి హీరోయిన్ గా మూవీ రిలీజైంది. బాక్సాఫీసు దగ్గర సంచలన విజయం సాధించింది. రూ.10 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
1983లో కమల్ శ్రీదేవి జంటగా మరో సెన్సేషనల్ మూవీ రిలీజైంది. బాలుమహేంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ‘మూన్రాంపిరై’ గా తమిళంలో వచ్చింది. దాన్ని ‘వసంత కోకిల’గా తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసారు. మతి తప్పిన అమాయకురాలి పాత్రలో శ్రీదేవి. ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయాలని ప్రయత్నించే టీచర్ కేరెక్టర్లో కమల్ హాసన్ నటించారు. ఈ చిత్రం హిందీలో ‘సద్మా’గా రీమేక్ అయింది. ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడిగా ఎంపికయ్యాడు లోకనాయకుడు.
గిరఫ్తార్ హిందీ మూవీ
ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘నాయకుడు’ మూవీలో నటనకుగాను రెండోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. మూడోసారి శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాలో నటనకు ముచ్చటగా మూడోసారి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు.
భారతీయుడు
కమల్ హాసన్, విశ్వనాథ్ ల కాంబినేషన్లో.. వచ్చిన సాగర సంగమం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పుడప్పుడే ‘శంకరాభరణం’ వంటి భారీ హిట్టు తన అకౌంట్లో వేసుకున్న విశ్వనాథ్.. ‘సాగర సంగమం’తో మరో సంచలనానికి తెరలేపారు. టాలెంట్ ఉన్నా, గుర్తింపుకు నోచుకోని ఓ నృత్యకారుడి వ్యధాభరితగాథ.. సాగర సంగమం. ‘సాగర సంగమం’..ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది. అందుకు కమల్ నటనే ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సాగర సంగమం
కమల్ హాసన్, కె. విశ్వనాథ్ కలయికలో వచ్చిన మరో హిట్ మూవీ.. స్వాతిముత్యం. ఇందులో ఎలాంటి కల్మషం లేని శివయ్య పాత్రలో కమల్ మరోసారి జీవించారు. 1985లో విడుదలైన ఈ సినిమా.. 1986లో భారత దేశం తరఫున ఆస్కార్ కు వెళ్లింది. అదే ఏడాది బంగారు నంది, తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. కమల్ అసమాన నటన వల్ల ఈ సినిమా టైటిల్ అమాయకులకు మారు పేరుగా స్థిరపడి పోయింది.
కే.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాతి ముత్యం’ (Facebook/Photo)
‘స్వాతి ముత్యం’ రిలీజైన పదేళ్ల తర్వాత అంటే 1995లో.. కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన మరో చిత్రం ‘శుభసంకల్పం’. దాసుగా కమల్ నటన అద్భుతంగా వుంటుంది. దీంతో కమల్ హాసన్ ‘నటనకు దాసుడని’ మరో సారి రుజువైంది.ఏదైనా ప్రయోగం చెయ్యాలనుకుంటే, డైరెక్టర్ల బెస్ట్ ఛాయిస్ కమల్ హాసనే. 1988లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం అలాంటిదే. మూకీ కమ్ స్లాప్ స్టిక్ కామెడీగా ఈ మూవీ వండర్ క్రియేట్ చేసింది.
పుష్పక విమానం (ఫేస్బుక్ ఫోటో)
కమల్ హాసన్ చేసిన వండర్లు చెప్పుకుంటూ పోతే.. చాలానే వున్నాయి. ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘విచిత్ర సోదరులు’, ‘గుణ’, ‘భామనే సత్యభామనే’, ‘క్షత్రియ పుత్రుడు’, ‘భారతీయుడు, ‘మహానది’, ‘సత్యమే శివం’, ‘తెనాలి’, ‘పంచ తంత్రం’, ‘ద్రోహి’, ‘హేరామ్’, ‘అభయ్’, ‘పోతురాజు’, ’బ్రహ్మచారి’, ‘దశావతారం’, ‘ఈనాడు’.. దేనికదే ప్రత్యేకం. ముఖ్యంగా విచిత్ర సోదరుల్లో మరుగుజ్జు పాత్ర చేసిన తీరు.. కమల్ కు తప్ప మరొకరికి వీలు కాదు. మైకెల్ మదన కామరాజులో నాలుగు పాత్రలతో మెప్పించడమే ఎక్కువనుకుంటే, దశావతారంలో పది పాత్రలతో అదరగొట్టారు. అందులో అతి పొడగరి పాత్రలో మెప్పించారు.
కమల్ దశావతారం
వేరే భాష నటుడైన తెలుగులో ఉత్తమ నటుడిగా మూడు నందులు అందుకున్న ఏకైక పరభాష నటుడు కూడా కమల్ హాసనే. ఆయన మూవీ అంటే ఏదో ఒక మేజిక్ ఉంటుందని... థియేటర్లకు పరుగులు పెట్టడం అలవాటు చేసుకున్నారు ప్రేక్షకులు. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతూనే వుంది. ఆయన కెరీర్లో చెయ్యాలసిన ప్రయోగాలన్నీ చేసాడు. ఇంకా చేస్తూనే వుంటాడు. తీరని కోరికగా ‘మరుదనాయగం’ మిగిలే వుంది. ‘మర్మయోగి’గా ప్రేక్షకులు ముందుకు రావాలన్న ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే వుంది. రానున్న ‘భారతీయుడు2’ ఆడియన్స్ ను వూరిస్తూనే వుంది.
భామనే సత్యభామనే మూవీ
కమల్ హాసన్ కేవలం నటుడిగానే కాకుండా, ప్రొడ్యూసర్, డైరెక్టర్, సింగర్, లిరిక్ రైటర్ గానూ సేవలందించాడు. ఇపుడు ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీ అధినాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఈ యేడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి తన సమీప బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు
కమల్ హాసన్
కమల్ తన కెరీర్లో.. మొత్తం 170 పైగా అవార్డులు అందుకున్నారు. అందులో 18 ఫిలిం ఫేర్ పురస్కారాలున్నాయి. ఉత్తమ బాల నటుడిగా ఒకటి, ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఆసియా ఫిలిం ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ గానూ నిలిచారు. ఆయన నటించిన ఆరు చిత్రాలను.. ఆస్కార్ అవార్డుకు పంపించారు.
కమల్ హాసన్ (File/Photo)
భారతదేశంలో మరే నటుడికీ ఈ గౌరవం దక్కక పోవడం గుర్తించాల్సిన విషయం. తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డుతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు . భారత ప్రభుత్వం 1990లో కమల్ హాసన్‌కు పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. 2004లో కేంద్రం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్‌లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కమల్ హాసన్...కుటుంబ జీవనం ఎన్ని ఒడిదొడుకులకు లోనైనా.. కెరీర్లో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. వాటిల్లోంచి మరిన్ని పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్లే కళాకారుడు కమల్ హాసన్. అందుకే ఆయన, సినిమాల్లో రాణించాలనుకునే వారికి.. ఇన్స్ పిరేషన్‌గా నిలిచారు. త్వరలో ’విక్రమ్’ సినిమాతో పాటు శంకర్‌తో ఆగిపోయిన ‘భారతీయుడు 2’ చిత్రాలతో త్వరలోప్రేక్షకులను పలకరించనున్నారు. కమల్ హాసన్ విన్యాసాలు మరింత కాలం పాటూ కొనసాగాలని ఆశిస్తూ.. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుదాం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.