వెండితెర యాంగ్రీ యంగ్ మెన్. దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్. బాలీవుడ్ షెహెన్ షా. ‘లాక్ కర్ దే’ అంటూ టీవీతెరపై కోటీశ్వరులను తయారుచేసే పని మొదలుపెట్టాడు. అక్కడా సక్సెస్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తాజాగా తెలుగులో సైరా..నరసింహారెడ్డి మూవీతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. ఆయనే పద్మశ్రీ,పద్మభూషణ్, పద్మవిభూషణ్.. తాజాగా కేంద్రం బిగ్‌బీని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. అమితాబ్ బచ్చన్.. పేరెత్తకుండా భారతీయ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు. బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన... లెక్కలేనన్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి. అమితాబచ్చన్‌తో భారతీయుల అనుబంధం ఈనాటిదికాదు.
1969లో ‘సాత్ హిందుస్థానీ’తో మొదలైన ఆయన నట ప్రస్థానం తాజాగా విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ వరకు కొనసాగుతూనే ఉంది.

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ బచ్చన్ (twitter/photo)
భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గ్రంథాన్నే రాసుకున్నఅమితాబ్... 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జన్మించారు. తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి. తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన సిక్కు మహిళ. అమితాబ్‌కు మొదట వారి తల్లిదండ్రులు ‘ఇంక్విలాబ్’ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ‘ఎన్నటికీ ఆరని దీపం’ అని అర్ధం వచ్చేలా.. అమితాబ్ అని పేరు మార్చారు. ఆ పేరు ప్రభావమో ఏమో అమితాబ్ నాన్ స్టాప్‌గా నటిస్తూనే వున్నారు. ఇంటి పేరు శ్రీ వాత్సవ కూడా అలాంటిదే. తండ్రి కలం పేరైన బచ్చన్‌ను ఇంటి పేరుగా మార్చుకున్నారు.

అమితాబ్ బచ్చన్ (File photo)
ఐదు దశాబ్దాల తిరుగులేని సినిమా ప్రస్థానంలో వందలకొద్దీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అందులో ఎన్నో బాక్సాఫీసు విజయాలను అందుకున్నారు. తన నట ప్రస్థానంలో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాంతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు.. ఇలా చెప్పుకొంటూపోతే అమితాబ్ బచ్చన్ జీవితం మహా గ్రంథం. అందులో ప్రతి పేజీ విలువైందే.

అమితాబ్ బచ్చన్ (File Photo)
అమితాబ్ బచ్చన్ పొడవు ఆరడుగుల రెండు అంగుళాలు. ఆయన ఆర్ట్స్‌లో రెండు పీజీలు చేశారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన కిరోరిమల్ కాలేజ్ లో బీఎస్సీ చేశారు. చదువయ్యాక ఉద్యోగంలో చేరాడు. కలకత్తాలోని ‘బర్డ్ అండ్ కో’ అనే షిప్పింగ్ కంపెనీలో మెటీరియల్ బ్రోకర్‌గా పనిచేస్తూ.. సినిమా వేషాల కోసం ప్రయత్నించాడు. 20వ ఏట ఉద్యోగం వదిలి, ముంబై చేరాడు.

బిగ్ బీ (ఫైల్ ఫోటో)
సునీల్ దత్ సినిమా ‘రేష్మా ఔర్ షేరా’లో ఒక మూగవాడి పాత్రకోసం అమితాబ్‌ని ఎంపిక చేశారు. అమితాబ్‌కు ఆ అవకాశం ఇప్పించడం కోసం ఇందిరా గాంధీ తన స్నేహితురాలైన నర్గీస్‌కు లేఖ రాయడం విశేషం.

రేష్మా ఔర్ షేరా (file Photo)
సినిమాల్లో అమితాబ్ కెరీర్ వాయిస్ నేరేటర్ గా మొదలైంది. 1969లో బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘భువన్ షోమ్’ (Bhuvan Shome) తో అమితాబ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ డైరెక్ట్ చేసిన ‘సాత్ హిందుస్థానీ’ చిత్రంలో ఏడుగురు హీరోల్లో ఒకడిగా నటించారాయన. సినిమా హిట్ కాలేదు. కానీ, అమితాబ్ క్లిక్ అయ్యాడు. తొలి చిత్రంతోనే బెస్ట్ న్యూ కమర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అమితాబ్ ఆయన కెరీర్లో నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే. ఈ సినిమాకి అమితాబ్ అందుకున్న పారితోషికం వెయ్యి రూపాయలు.

‘సాత్ హిందుస్థానీ’లో అమితాబ్ బచ్చన్ (File Photo)
హీరోగా అమితాబ్‌కు తొలి సూపర్‌హిట్‌ని అందించిన సినిమా ‘జంజీర్’. ఈ సినిమాకి ముందు బిగ్‌బీ నటించిన 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక, సినిమాల్లో ఆయనకు ఇష్టమైన పేరు విజయ్. ఆ పేరుతో దాదాపు 20 సినిమాల్లో నటించారు బిగ్‌బీ.

జంజీర్ మూవీ (యూట్యూబ్ క్రెడిట్)
1970ల్లో విడుదలైన చిత్రాలు ఆయన్ని 'యాంగ్రీ యంగ్‌మేన్'ను చేశాయి. ఆ తర్వాత తరం నటులెవరూ ఆ పిలుపును దక్కించుకోలేకపోయారు. అమితాబ్ తన జీవితభాగస్వామి అయిన జయ బాధురిని పుణె టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తొలిసారి కలిశారు. ‘గుడ్డి’ సినిమా సెట్లో రెండోసారి చూశారు. ఆ తర్వాత 1973లో అమితాబ్, జయబాధురిని ప్రేమపెళ్లి చేసుకున్నారు.

ఫ్యామిలీతో అమితాబ్ బచ్చన్
1971లో వచ్చిన ‘ఆనంద్’ నుంచీ 1988లో వచ్చిన ‘షెహన్షా’ సినిమా వరకూ పదిహేడేళ్లపాటు ఏటా శతదినోత్సవ సినిమా ఇచ్చిన ఏకైక భారతీయ నటుడు అమితాబ్. బాలీవుడ్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన నటుడు కూడా అమితాబే.

అమితాబ్ బచ్చన్ 50 ఇయర్స్
తన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ‘షోలే’ లో హీరోగా నటించిన బిగ్‌బీ...ఆ మూవీ రీమేక్ ‘ఆగ్’లో విలన్‌గానూ నటించి కొత్త రికార్డు క్రియేట్ చేసారు. 90 దశకం చివర్లో వచ్చిన ‘మృత్యుదాత’ సినిమాతో అమితాబ్ తన రెండో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టారు. అప్పటి నుంచే అమితాబ్ బిగ్‌బీగా పేరుపొందారు.

అమితాబ్ బచ్చన్ (File Photo)
ఆ తర్వాత ఏబీసీ కార్పొరేషన్ స్థాపించి విఫలమైనప్పుడు 'అమితాబ్ పని అయిపోయింది' అన్నారందరూ. అప్పులపాలై ఆఖరికి ఇల్లు తాకట్టు పెట్టాల్సిన స్థితిలో పడిపోయారు అమితాబ్. తిరిగి పుంజుకున్నప్పుడు గుర్తుపెట్టుకుని మరీ అందరి బాకీలను చెల్లించిన క్రమశిక్షణ, నిబద్ధత అమితాబ్కే సొంతం.

అనిల్ కపూర్‌తో బిగ్ బీ
అప్పటివరకు వెండితెరపై దూసుకుపోయిన అమితాబ్ టీవీ తెరపై ప్రభంజనంలా వచ్చారు. 2000 సంవత్సరంలో 'కౌన్ బనేగా కరోడ్ పతి' షో టెలివిజన్ చరిత్రలో సంచలనం. ఇపుడు అమితాబ్ వ్యాఖ్యాతగా పదకొండో సీజన్ నడుస్తోంది.
అమితాబ్ నటించిన 'అగ్నిపథ్', 'డాన్' రీమేక్ అయినా మాతృకను మించి మెప్పించలేకపోయారు.ఇక ‘మిస్టర్ ఇండియా’లోని ప్రధాన పాత్రను అమితాబ్‌ని దృష్టిలో పెట్టుకునే రాశారట సలీం జావేద్.‘సిల్సిలా’ సినిమాలోని హిట్ సాంగుల్లో ఒకటైన రంగ్ బర్సేను అమితాబ్ తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ రచించారు.

అగ్నిపథ మూవీ
ఎన్నో సినిమాల్లో మద్యం తాగుతూ కనిపించిన అమితాబ్ నిజజీవితంలో అసలు మద్యం తీసుకోరు. అంతేకాదు ఆయన పూర్తి శాకాహారి కూడా. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడే అమితాబ్ రెండు చేతులతోనూ రాయగలరు.మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో చోటుదక్కించుకున్న తొలి ఆసియా నటుడు అమితాబ్.2001 ఈజిప్టులో జరిగిన అలెగ్జాండ్రియా ఫిల్మ్ ఫెస్టివల్లో అమితాబ్‌ని ‘యాక్టర్ ఆఫ్ ది సెంచరీ’ పురస్కారంతో గౌరవించారు.ఒలింపిక్ జ్యోతిని అందుకునే అరుదైన గౌరవం అమితాబ్‌కి లభించింది.

మన దేశం నుంచే కాదు..ఆసియా నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మగా కొలువైన మొదటి వ్యక్తి
2012 జులై 27న లండన్‌లో ఒలింపిక్ జ్యోతిని చేతబట్టి ఆయన 300 మీటర్లు పరుగుతీశారు.2015లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించారు బిగ్‌బీ.అమితాబ్...వృత్తిని దైవంగా భావిస్తారు. చిత్రీకరణకు ఆలస్యంగా రావడం అంటే ఆయనకు తెలియదు. 'షరాబీ' చిత్రీకరణలో ఉండగా ఆయన చేతులు కాలిపోయాయి. అయినా ఆయన షూటింగ్ ఆపలేదు. గాయాలు కనబడకుండా చేతుల్ని కోటు జేబులో పెట్టి నటించారు. అది అప్పట్లో ఓ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారడం విశేషం.

అమితాబ్ బచ్చన్ (file Photo)
ఇక బీబీసీ నిర్వహించిన యాక్టర్ ఆఫ్ ది మిలీనియం పోల్‌లో చార్లీచాప్లిన్, మార్లన్ బ్రాండోలను సైతం వెనక్కునెట్టి అమితాబ్ ఆ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం అమితాబ్‌ని పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అక్కినేని తర్వాత మూడు పద్మ పురస్కారాలు అందుకున్న రెండో భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్. సినిమా నటుల్లో ఏఎన్నాఆర్, దిలీప్ కుమార్ తర్వాత పద్మవిభూషణ్ అందుకున్న మూడో నటుడు.

మాజీ రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ పురస్కారం (file Photo)
ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారం 'ది నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్' అందుకొన్న నటుడు అమితాబ్. తనో సూపర్‌స్టార్ అనే హోదాను అమితాబ్ చూపించడానికి ఇష్టపడరు. కొత్తతరం నటులతో కలిసి పనిచేసినా, నూతన దర్శకుల చిత్రాల్లో నటించినా తననో సాధారణ నటుడిగానే భావిస్తారు. అందరితోనూ కలసిపోతారు.

అమితాబ్ బచ్చన్ (file Photo)
సామాజిక అనుసంధాన వేదికల్లో నేటితరం కథనాయకులెవరూ అమితాబ్‌కు సాటిరారు. అంతలా మిలియన్ల కొద్దీ అభిమానులున్నారు బిగ్‌బీకు. నిత్యం తన అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకొంటూ వయసు శరీరానికే కానీ మనసుకుకాదని నిరూపిస్తున్నారు. హిందీ చిత్రసీమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్న అమితాబ్ బచ్చన్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం..