#HappyBirthDay: ఒకే ఒక్కడు శంకర్

జెంటిల్ మేన్ తో ప్రారంభమైన శంకర్ కెరీర్.. త్వరలో రాబోతున్న ‘2.0’ వరకూ నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. ఇపుడు మరోసారి కమల్ హాసన్‌తో భారతీయుడు2ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ రోజు ఆయన బర్త్ డే.

news18-telugu
Updated: August 17, 2018, 11:46 AM IST
#HappyBirthDay: ఒకే ఒక్కడు శంకర్
శంకర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు ఇండియన్ మూవీ మేకింగ్ స్టైల్ మార్చిన గ్రేట్ డైరెక్టర్. శంకర్ తీసే సినిమాల్లో భారతీయత, దేశభక్తి అడుగడున కనిపిస్తాయి.

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఫస్ట్ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆయన సినిమాలకు ఎంత ఖర్చు పెడితే నిర్మాతలకు అంత లాభం. జెంటిల్ మేన్ తో ప్రారంభమైన శంకర్ కెరీర్.. త్వరలో రాబోతున్న ‘2.0’ వరకూ నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. ఇపుడు మరోసారి కమల్ హాసన్‌తో భారతీయుడు2ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.


ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో మెమరబుల్ హిట్స్ అందించిన శంకర్... 1963 ఆగష్టు 17న, తమిళనాడులోని కుంభకోణంలో జన్మించాడు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పుచ్చుకున్న...శంకర్ తన దృష్టి సినిమాలపై కేంద్రీకరించాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభమైన శంకర్ కెరీర్, జెంటిల్ మేన్ మూవీతో డైరెక్టర్ గా టర్న్ తీసుకుంది. జెంటిల్ మేన్ అప్పటి వరకూ సౌత్ ఇండియా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. శంకర్ డైరెక్షన్ కు, యాక్షన్ కింగ్ అర్జున్ నటనతోపాటు.. రెహమాన్ మ్యూజిక్ కూడా తోడు కావడంతో.. జంటిల్మెన్ ఒక రేంజ్ హిట్ సాధించింది.  =ఈ మూవీ తర్వాత దర్శకుడిగా వెనుతిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా అవినీతి, లంచగొండితనంపై శంకర్ రూపొందించిన సినిమాలు ఆయనకు ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చాయి.

అత్యంత భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించడంలో శంకర్ రూటే వేరు. ఆయన సినిమాకి భారీ బడ్జెట్ కంపల్సరీ. సినిమా ఏదైనా.. అందులో ఒక రేంజ్ ఉండాల్సిందే. తొలి సినిమా జెంటిల్ మేన్ నుంచి నిన్నటి మొన్నటి రోబో వరకూ ఆయన చిత్రాల్లో రిచ్ నెస్ ఉట్టిపడుతుంది. స్టోరీ డిమాండ్ మేరకు డబ్బు బాగా ఖర్చు పెట్టిస్తాడు. మూవీలో నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా అన్ని ఫ్రేముల్లో కనబడుతుంది. దటీజ్ ఒన్ అండ్ ఓన్లీ శంకర్.

శంకర్ సినిమాకు వెళ్తే చాలు.. అందమైన లోకేషన్స్ ప్రేక్షకులను కనువిందు చేస్తాయి. ప్రపంచంలోని ఏడు వింతల దగ్గర ఎనిమిదో వింతైన ఐశ్వర్య అందాలను చేర్చి.. తీసిన జీన్స్.. ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. అప్పటి వరుకూ ఎవరు తీయని లోకేషన్స్ లో సినిమా తీసి హిట్ సాధించాడు.ఎంత రిస్క్ చేస్తే అంత రిజల్ట్. రొటీన్ మూస ఫార్ములాకు చెక్ పెట్టి... కమర్షియల్ హిట్స్  అందించిన ఒకే ఒక్కడు శంకర్. ముఖ్యంగా పాటల్ని అందంగా తెరకెక్కించడంలో శంకర్ స్టైలే వేరు. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేయండంలో సిద్దహస్తుడు. హీరోయిన్లను తెరపై అందంగా ఎలా చూపించాలో శంకర్ కు బాగా తెలుసు. అందుకే ఆయన సినిమాల్లో పాటల కోసం చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

అంతకు ముందు అవినీతి నిర్మూలన, పేరుకు పోయిన బ్లాక్ మనీ బయటకి తీయడం, వంటి ఉత్తమ పౌర విధులే ఆయన సబ్జెక్టులు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా శంకర్ తీసిన ‘భారతీయుడు’ సంచలనం సృష్టించింది. అవినీతికి విసిగి వేసారిన ఒక భారతీయుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూపించి కమర్షియల్ గా బిగ్ హిట్ సాధించాడు.‘భారతీయుడు’ మూవీలో కమలహాసన్‌ను రెండు విభిన్న గెటప్‌లలో చూపించి మెప్పించాడు శంకర్. ఈ సినిమా ద్వారా కమల్ మూడో సారి జాతీయ అవార్డు సాధించాడంటే, ఆ ఘనత శంకర్ దే. ఎంత గొప్ప నటులైనా వారిలోని యాక్టింగ్ టాలెంట్ పూర్తిగా బయటపడేది దర్శక ప్రతిభతోనే...ఆ టెక్నిక్ తెలిసిన బెస్ట్ డైరెక్టర్ శంకర్.

ఇక రాజకీయాలపై శంకర్ తీసిన ‘ఒకే ఒక్కడు’ సంచలనమే సృష్టించింది. ఒక రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాయకులు కరెప్షెన్‌కు దూరంగా.. నీతివంతమైన పాలన అందిస్తే దేశం అభివృద్ధి పథాన పయనిస్తుందని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించి వావ్ అనిపించాడు.

శంకర్ కు మొదటి నుంచీ టాప్ స్టార్స్ తో సినిమాలు తీయడం ఇష్టం. రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో హై వోల్టేజ్ సబ్జెక్ట్‌లు తీసి సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా రజనీ కాంత్‌తో తీసిన ‘శివాజీ’ బాక్సాఫీసు రికార్డులు తిరగ రాసింది. దేశంలో పేరుకు పోయిన నల్లధనం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ డైరెక్టర్ గా శంకర్ గట్స్ మరింత పెంచింది. ఒకసారి స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే మళ్లీ మార్పులు చేర్పులుండవు. ఇలాంటి మంచి లక్షణాలు శంకర్‌ను ఒక స్థాయి దర్శకుడ్ని చేశాయి.

శంకర్ సినిమా ఒక సమ్మోహనాస్త్రం. ఎంత కఠినమైన సోషల్ ప్రాబ్లెం తీసుకున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా, అట్ ది సేమ్ టైం అత్యంత అర్ధవంతంగా తీసి మెప్పించడం ఆయనకే సాధ్యం. మెసేజ్ ఓరియంటెడ్స్ ఇలా ప్రేక్షకులకు నచ్చేలా తీయగలిగే ఒకరిద్దరు అరుదైన డైరెక్టర్లలో శంకర్ ఒకడు. జనం తమ సమస్యలను మర్చిపోవడానికి సినిమాలకు వస్తారు. అవే సమస్యలను చాలా అందంగా.. చూపడంతో పాటు, ఆలోచించే విధంగానూ ప్రెజెంట్ చేయడంలో శంకర్ అసలైన స్టైల్ ఆఫ్ మేకింగ్ దాగుంది.

శంకర్ సినిమాలు క్లాస్ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తాయి. అపరిచితుడులో మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడే హీరోని సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆవిష్కరించి సక్సెస్ సాధించాడు.

ఆయన సినిమాల్లో విలనిజం కూడా ప్రత్యేకంగా వుంటుంది. ‘జెంటిల్ మేన్’, ‘ప్రేమికుడు’, ‘ఒకేఒక్కడు’, ‘శివాజీ’ల వరకూ విలన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తుంది. విలన్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందన్న నమ్మకం శంకర్లో చాలా ఎక్కువ.

శంకర్ షూటింగ్ లో హడావిడి ఉండదు. ఆయన మేకింగ్ అంతా కార్పోరేట్ స్టైల్లో ఉంటుంది. తన దగ్గర పనిచేసే వాళ్లకు మంచి వేతనాలు ఇచ్చే శంకర్లో హాస్య ప్రియత్వం ఎక్కువ. ప్రేమికుడు సమయంలోనే శంకర్ తెలుగు నేర్చుకున్నాడు. డబ్బింగే కదా అని తేలిగ్గా తీసుకోడు. డబ్బింగ్ థియటర్లకు వచ్చి వర్క్  ఎలా జరుగుతుందో గమనించడం ఆయన తన చిత్రాల పట్ల తీసుకునే కేర్ ఎలాంటిదో తెలుపుతుంది. ఫలానా పాత్రకు ఫలానా వాయిస్ సూట్ అయిందో లేదో చూస్తాడు. అందుకే శంకర్ చిత్రాలు, డబ్ అయినవే అయినా.. స్ట్రెయిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తాయి. పిక్చర్ లో కనబడే నేమ్ బోర్డు దగ్గర నుంచి ప్రతి విషయంలో శంకర్ తీసుకునే జాగ్రత్త ఆడియన్స్‌కు అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది.

శంకర్ సినిమాల్లో సామాజిక అంశాలతో పాటు కథలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్త వహిస్తాడు. మూవీ మూవీకీ అసలు పోలికే ఉండదు. గ్రాఫిక్స్, విజువల్ఎఫెక్ట్స్ వంటి టెక్నికల్ అంశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం శంకర్ స్టైల్. ‘ప్రేమికుడు’ నుంచి ‘రోబో’ వరకూ ఆయన ప్రతి చిత్రంలో గ్రాఫిక్స్ మాయాజాలం ప్రేక్షకులను కనువిందు చేస్తునే వచ్చింది. మార్కెట్ ఎకానమిలో ప్రాంతీయ సరిహద్దులకే పరిమితమైన రీజినల్ సినిమాను గ్లోబల్ మార్కెట్ లో నిలబెట్టిన దర్శకుడు శంకర్.

ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ మేకర్లెవరూ అడుగుపెట్టని ‘స్టాన్ విన్స్ టన్’ యానిమేషన్ స్టూడియోలో శంకర్ తన రోబోకు మెరుగులద్దాడు. ‘టెర్మినేటర్’, ‘జురాసిక్ పార్క్’, ‘అవతార్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల యానిమేషన్ వర్క్స్ ఈ స్టూడియోలోనే జరిగాయి. స్టాన్ విన్స్ టన్లో షూటింగ్ జరుపుకున్న తొలి భారీతీయ చిత్రంగా శంకర్ ‘రోబో’ రికార్డ్ క్రియేట్ చేసింది. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్, విలన్ రోబో రజనీలు పాల్గొన్న భారీ క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఇక్కడే జరిగింది. హీరో రజనీకాంత్ తో పోరాడటానికి 100రోబోలు వరుసగా వస్తాయి. వీటిని యానిమేట్రిక్స్ టెక్నాలజీతో ఈ స్టూడియోలోనే రూపొందించారు. ఇలా తన చిత్రాలకు హాలీవుడ్ రేంజ్ ట్రీట్ మెంట్ ఇచ్చిన డైరెక్టర్ గా శంకర్ పేరు సాధించాడు.

ప్రస్తుతం రజనీకాంత్, అక్షయ్ కుమార్‌లతో తెరకెక్కించిన ‘2.0’ మూవీని దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని ఈ యేడాది నవంబర్ 29న రిలీజ్ కానుంది.

దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణించాడు శంకర్. అభిరుచి గల నిర్మాతగా కొన్ని ఉత్తమ చిత్రాలు నిర్మించి విజయాలందుకున్నాడు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్స్ కు డైరెక్టర్లుగా ఛాన్సులిచ్చి వారిని తీర్చిదిద్దిన క్రెడిట్ శంకర్ కే దక్కుతుంది. సౌతిండియాలో ఇలాంటి కొత్త ట్రెండ్ కు తెరలేపిన దర్శకుడు శంకర్.రీసెంట్‌గా దర్శకుడిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. 25 ఏళ్ల కెరీర్‌లో శంకర్...తమిళంలో 11 సినిమాలు, హిందీలో ఒక సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇక శంకర్ సినిమాలంటే రెహమాన్ మ్యూజిక్ కంపల్సరీ. తొలి చిత్రం జెంటిల్మన్ నుంచీ.. 2.0 వరకూ ఆయన సినిమాలకు రెహమానే సంగీతం అందించాడు. మధ్యలో ‘అపరిచితుడు2, ‘స్నేహితుడు’ సినిమాలకు తప్పించి, శంకర్  సినిమాలన్నిటికీ ఆస్కార్ విజేత రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.

సోషల్ ఎలిమెంట్స్ మీద సినిమాలు తీసిన దర్శకులు ఆర్ట్ సినిమా డైరెక్టర్లుగా ముద్రపడతారు. అవి స్లో మూవీస్‌గా పేరు సాధిస్తాయి. కానీ, శంకర్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు. తనదైన ఇమాజినేషన్‌తో సోషల్ థీం కు కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేసి సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు. మరోసారి ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతుంది న్యూస్ 18.Published by: Kiran Kumar Thanjavur
First published: August 17, 2018, 8:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading