Home /News /movies /

GEORGE REDDY MOVIE REVIEW AND INTERESTING BIOPIC WITH SOME FLAWS PK

రివ్యూ: జార్జ్ రెడ్డి.. మ్యాన్ ఆఫ్ యాక్షన్..

‘జార్జ్ రెడ్డి’ బయోపిక్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)

‘జార్జ్ రెడ్డి’ బయోపిక్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)

కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో జార్జ్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 45 ఏళ్ల కింద చనిపోయిన ఈ స్టూడెంట్ లీడర్ బయోపిక్ ఇప్పుడు జీవన్ రెడ్డి తెరకెక్కించాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ అలరించిందో చూద్దాం..

నటీనటులు: సందీప్ మాధవ్, ముస్కాన్, సత్యదేవ్, అభయ్, చైతన్యకృష్ణ, మనోజ్ నందం, యాదమ్మ రాజు, సంజయ్ రెడ్డి తదితరులు
ఎడిటర్: ప్రతాప్ కుమార్
సినిమాటోగ్రఫర్: సుధాకర్ రెడ్డి యెక్కంటి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: జీవన్ రెడ్డి
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అప్పి రెడ్డి, దామురెడ్డి, సుధాకర్ రెడ్డి యెక్కంటి

కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో జార్జ్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 45 ఏళ్ల కింద చనిపోయిన ఈ స్టూడెంట్ లీడర్ బయోపిక్ ఇప్పుడు జీవన్ రెడ్డి తెరకెక్కించాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ అలరించిందో చూద్దాం..

కథ:
కేరళలో పుట్టి పెరిగిన జార్జి రెడ్డి (సందీప్ మాధవ్)ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు. ఆయన వచ్చేసరికి యూనివర్సిటీలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడ అగ్రకులాల ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. అది చూసి జార్జ్ రెడ్డి అసలు తట్టుకోలేకపోతాడు. విద్యార్థులకు అన్యాయం చేయాలనుకున్న వాళ్లను.. అలాగే అగ్రకులాల ఆధిపత్య ధోరణికి చరమగీతం పాడాలనుకుంటాడు. ఏ చిన్న తప్పు జరిగినా కూడా వచ్చి గల్లా పట్టుకుని మరీ నిలదీస్తుంటాడు. అది ఇతర స్టూడెంట్ యూనియన్లకు అస్సలు నచ్చదు. దాంతో పాటు అన్ని విషయాలపై కూడా ఉద్యమం లేవదీస్తాడు జార్జ్. అదే సమయంలో కాలేజీలో జరిగే స్టూడెంట్ పాలిటిక్స్‌లో కూడా వచ్చి తన సత్తా చూపించి నాయకుడిగా ఎదుగుతాడు. అలాంటి సమయంలో జార్జి రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు ఆయనను చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..

కథనం:
జార్జి రెడ్డి సినిమా చూస్తుంటే మనకు 30 ఏళ్ల కింద నాగార్జున చేసిన శివ సినిమా గుర్తుకొస్తుంది. నిజానికి అప్పట్లో శివ క్యారెక్టర్ జార్జిరెడ్డి స్ఫూర్తిగా తీసుకొని వర్మ రాసుకున్నాడు అంటారు. ఈ సినిమా చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది. కాలేజ్ యూనియన్లు, గొడవలు, స్టూడెంట్ పాలిటిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా లేని జార్జి రెడ్డి కాలేజీలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవడం.. ఎక్కడైనా ఎవరికైనా సాయం కావాలంటే పరిగెత్తుకుంటూ వెళ్లడం.. ఇవన్నీ హీరో క్యారెక్టరైజేషన్‌లో అద్భుతంగా చూపించాడు దర్శకుడు జీవన్ రెడ్డి. అన్నింటికీ మించి జార్జిరెడ్డిలో ఉన్న ఆవేశాన్ని తెరపై చాలా బాగా ఆవిష్కరించాడు. కానీ ఆ ఆవేశానికి తగిన సన్నివేశాలు సినిమాలో ఉండుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. కేవలం ఆవేశం మాత్రమే చూపించి కథనంపై దృష్టి కోల్పోయాడు దర్శకుడు జీవన్ రెడ్డి. ఫస్టాఫ్ అంతా కేవలం స్టూడెంట్ గొడవలతోనే సరిపోయింది. చెప్పుకోవడానికి బలమైన సన్నివేశాలు అంటూ ఏమీ లేకుండా పోయాయి. జార్జిరెడ్డి చిన్నతనం.. ఆయన కాలేజీకి రావడం.. అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఆధిపత్య ధోరణిని చూడటం.. ఎవరు ఎదురుపడినా తిరగబడటం ఇది మాత్రమే చూపించాడు జీవన్ రెడ్డి. అసలు ఆయన ఎందుకు అంత రెబల్ అయ్యాడు.. ఆయన చేస్తున్న ఉద్యమం ఏంటి అనే విషయాలపై మరింత లోతుగా పరిశోధించి రెండు మూడు బలమైన సన్నివేశాలు సినిమాలో దర్శకుడు రాసి ఉంటే కచ్చితంగా జార్జిరెడ్డి రేంజ్ మరోలా ఉండేది. సెకండ్ హాఫ్ కూడా రైతుల కోసం ఆయన చేస్తున్న ఉద్యమాన్ని పైపైన చూపించినట్లే అనిపించింది. కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఎలా ఉన్నా కూడా సినిమా చివరి అరగంట మాత్రం మరో స్థాయిలో ఉంది. జార్జిరెడ్డి ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఆయనను చంపేయాలని కుట్ర మొదలైన తర్వాత సినిమా పతాక స్థాయికి చేరిపోయింది. క్లైమాక్స్ అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. బరువెక్కిన హృదయంతో థియేటర్ నుంచి బయటకు రావడం ఖాయం. స్టూడెంట్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో ఉన్నాయి.

నటీనటులు:
ఈ తరం ప్రేక్షకులకు జార్జిరెడ్డి అంటే ఎలా ఉంటాడో తెలియదు. కానీ ఇప్పటి నుంచి జార్జిరెడ్డి అంటే సందీప్ గుర్తొస్తాడు. వంగవీటి సినిమాలో ఆయన పాత్రకు ప్రాణం పోసిన సందీప్ ఇప్పుడు జార్జ్ రెడ్డి అయిపోయాడు. ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు ఈ నటుడు. సత్యదేవ్, చైతన్యకృష్ణ, మనోజ్, నందం చిన్న చిన్న పాత్రల్లో పర్వాలేదనిపించారు. హీరోయిన్ ముస్కాన్ కూడా చిన్న పాత్రలో కనిపించింది. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే.

టెక్నికల్ టీం:
జార్జి రెడ్డి సినిమాకు సంగీతం ప్రాణం. సురేష్ బొబ్బిలి అద్భుతమైన ఆర్ఆర్ అందించాడు. చాలా సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని నిలబెట్టింది. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది అనిపించింది. సుధాకర్ రెడ్డి ఎక్కండి సినిమాటోగ్రఫీ బాగుంది. ఉస్మానియా క్యాంపస్‌ను చాలా అద్భుతంగా చూపించాడు. ఇక దర్శకుడు జీవన్ రెడ్డి తాను అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ క్రమంలో జార్జి రెడ్డి గురించి.. ఆయన ఆవేశం గురించి తెలుసుకున్నాడు కానీ దాన్ని స్క్రీన్ పై మరింత పదునుగా ప్రజెంట్ చేయడంలో మాత్రం కాస్త విఫలమైనట్లు కనిపించింది. ఏదేమైనా కూడా చరిత్ర మరచిపోయిన ఒక నాయకుడిని స్క్రీన్ పై బాగానే ఆవిష్కరించాడు ఈ దర్శకుడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

చివరగా ఒక్కమాట:
జార్జ్ రెడ్డి.. మ్యాన్ అఫ్ యాక్షన్.. ల్యాక్ ఆఫ్ స్క్రీన్ ప్లే..

రేటింగ్: 2.75/5
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: George Reddy, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు