Vinayaka Chavithi 2020 | ఏ పండుగకూ లేనంతటి విశిష్టత సినిమాల్లో వినాయకచవితికి ఉంది...ఏకదంతున్ని కీర్తిస్తూ వచ్చిన పాటలు...సన్నివేశాలు అనేకం...ఈ పండుగ సందర్భంగా వెండితెరపై వినాయకుని వైభవం ఓ సారి గుర్తు చేసుకుందాం..
Ganesh Chaturthi 2020 | విఘ్నాధిపతి, వినాయకుడు..అధిదేవుడు..ఆదిదేవుడు...మనం సంకల్పించిన పని ఏ విఘ్నాలూ...లేకుండా నిరాటంకంగా సాగాలంటే బొజ్జవినాయకుడి చల్లని కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాల్సిందే. ప్రతి యేటా భాద్రపద శుక్ల చవితి రోజున జరుపుకునే ఈ పండుగ హిందువులకు పరమపవిత్రమైనది. అందుకే మన తెలుగు సినిమాల్లో కూడా ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుతారు. ఏ పండుగకూ లేనంతటి విశిష్టత సినిమాల్లో వినాయకచవితికి మాత్రమే ఉంది...ఏకదంతున్ని కీర్తిస్తూ వచ్చిన పాటలు...సన్నివేశాలు అనేకం...ఈ పండుగ సందర్భంగా వెండితెరపై వినాయకుని వైభవం ఓ సారి గుర్తు చేసుకుందాం. ఇంట్లో జరిగే వినాయక పూజ..... సామూహిక ఉత్సవంగా మారడం వెనక పెద్ద కథే ఉంది. 1894లో బాలగంగాధర తిలక్.. భారత ప్రజలను మేలుకొలపడానికి పూనుకున్నాడు. దీనికోసం సరైన వేదికగా వినాయకచవితిని ఎంచుకున్నాడు. ఆ రోజును ఓ సామూహిక ఉత్సవంగా మార్చి... దీంట్లో పాలు పంచుకోవాలని దేశ వాసులకు పిలుపునిచ్చాడు. ఈ ఉత్సవాల్లో పూజలతో పాటు...జాతీయ గీతాలాపనలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు... భారతీయులందరూ సంఘటితం కావడానికి ఎంతో దోహదం చేసాయి. దేశానికి స్వాతంత్య్రం రావడానికీ, ప్రజలందరూ ఐక్యమత్యంగా కలసిమెలసి ఉండటానికీ వినాయక ఉత్సవాలు ఎంతో దోహదం చేశాయి.
తెలుగు సినీ ప్రస్థానం మొదలైనప్పటినుండీ వినాయకుడిని మన సినిమాల్లో అనేక రకాలుగా చూపిస్తూనే ఉన్నారు మన దర్శక నిర్మాతలు. అలాంటి ఓ పాట ‘వినాయక చవితి’ సినిమాలో ఉంది. ‘వాతాపీ గణపతిం భజే’ అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘వినాయక చవితి’ సినిమాలో చవితి రోజు చేయాల్సిన పూజా నియమాలు ఏంటో చక్కగా వివరించింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడంతటి వాడు వినాయకచవితి నాడు చంద్రున్ని చూపి నీలాపనిందల పాలయ్యాడు. శమంతమణిని అపహరించాడన్న అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత వినాయకవ్రతం ఆచరించి, నిర్దోషిగా తనను తాను నిరూపించుకొని బయటపడి, జాంబవతి, సత్యభామలను వివాహమాడాడు. అందుకే మాన్యుల నుంచి సామాన్యుల వరకూ.. అందరూ ఈ చవితినాడు వినాయక వ్రతం ఆచరించి.. ఆ గజానునుని ఆశీస్సులతో ఎలాంటి నీలాపనిందల పాలు కాకుండా ఉంటారని ఈ మూవీలో చూపించారు.
ఇక వినాయక జీవిత చరిత్రపై తెలుగులో పూర్తి స్థాయిలో వచ్చిన ఏకైక సినిమా ‘శ్రీ వినాయక విజయం’. ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వినాయకుని జన్మ వృత్తాంతం. ఏ రకంగా వినాయకుడికి ఏనుగు తలను పెట్టడం..విఘ్నాలకు, ప్రమథ గణాలకు అధిపతి అవడం వంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు.
మరోవైపు ఎన్టీఆర్ రావణ బ్రహ్మగా..ఏఎన్నార్ నారదుడిగా నటించిన ‘భూ కైలాస్’ మూవీ క్లైమాక్స్‌లో శివుడి ఆత్మ లింగం రావణుడి పాలు కాకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. ఈ మూవీలో ఒక బాలుడి రూపంలో వచ్చి శివుడి ఆత్మ లింగం రావణుడు పాలు కాకుండ చేసి అతనికి గర్వ భంగం చేస్తాడు వినాయకుడు.
పౌరాణిక సినిమాలను పక్కన పెడితే..సాంఘిక సినిమాల్లో వినాయకుడిని కీర్తిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో దేవుడు చేసిన మనుషుల్లారా అనే పాట వినాయక నిమజ్జం నేపథ్యంలో సాగే పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరవలేదు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవుళ్లు’ సినిమాలో గణేశుడ్ని కీర్తిస్తూ బాలూ స్వయంగా నటించి, పాడిన పాట ఇప్పటికే వినాయక చవితి ఉత్సవాల్లో వినిస్తూనే ఉంటుంది.
కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన కూలీ నెంబర్ 1 సినిమాలో బొజ్జ వినాయకుడిని కీర్తిస్తూ దండాలయ్యా ఉండ్రాలయ్యా అనే పాట ఇప్పటికీ ప్రతి వినాయక మండపంలో వినిపిస్తూ ఉంటుంది.
ఆ తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘జై చిరంజీవా’ సినిమాతో వినాయకుడిని కీర్తిస్తూ..జై జై గణేషా పాట అబాల గోపాలన్ని అలరించింది.
మహేశ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’లో జగడమే పాటలో ఒక బిట్లో గణపతి బప్పా మోరియా అంటూ ఒక బిట్ సాంగ్ ఉంది.
నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’, రవితేజ నటించిన ‘పవర్’ సినిమాలో వినాయక చవితి ప్రస్థావన ఉంది. మరోవైపు రామ్ హీరోగా నటించిన ‘గణేష్’ సినిమాలో వినాయకుడిపై ఒక పాట ఉంది.బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘డిక్టేటర్’ మూవీలో వినాయకుడిని కీర్తిస్తూ..గం గం గణేషా అనే పాట విఘ్న వినాయకుడిని కీర్తిస్తూ తెరకెక్కిందే.
‘దేవదాస్’ సినిమాలో కూడా వినాయకుడిపై ఒక పాట ఉంది. ఈ పాట కూడా బాగానే పాపులర్ అయింది. ఈ పాటలో నాగార్జునతో పాటు నాని వినాయకుడిని కీర్తిస్తూ ఆడిపాడారు.
వినాయకుడు విజ్ఞానానికి ప్రతీక. ఆయన గుమ్మడికాయంత తల గొప్పగా ఆలోచించమని చెబుతుంది. చాటెడు చెవులు మంచిని గ్రహించి, చెడు వదిలేయమని చెబుతాయి. ఆయన చిన్ని నోరు.. వీలైనంత తక్కువ మాట్లాడమని హెచ్చరిస్తుంది. కళ్లు సూటిగా లక్ష్యాన్ని గురిపెట్టమని చెబుతాయి. బానపొట్ట సుధీర్ఘ జీవితానుభవాన్ని తలపిస్తుంది. ఈ రకంగా వెండితెరపై వినాయకుడి లీలలు, పాటలు సన్నివేశాలు అప్పటికీ ఇప్పటికే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.