హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam: ఎస్పీ బాలు మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ ప్రముఖుల సంతాపం

SP Balasubrahmanyam: ఎస్పీ బాలు మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ ప్రముఖుల సంతాపం

SP బాలసుబ్రమణ్యం:

SP బాలసుబ్రమణ్యం:

గాన గందర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు.

  గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు సహా పలువురు ప్రముఖులు ఎస్పీ బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘మ్యూజిక్ లెజెండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో ఓ మెలోడియస్ వాయిస్‌ను భారత్ కోల్పోయింది. పాడే చందమామగా అభిమానులు పిలుచుకునే ఎస్పీ బాలు పద్మభూషణ్ సహా ఎన్నో జాతీయ పురస్కారాలు పొందారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా సానుభూతి.’ అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

  ‘ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. గాన గంధర్వుడైన ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.

  ‘ఎస్పీ బాలసుబ్రమణ్మం ఆకస్మిక మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం ఎంతో పేదదైపోయింది. ఎస్పీ బాలు అనేది దేశంలోని ప్రతి ఇంట్లో పలికే పేరు. ఆయన మెలోడియస్ వాయిస్, సంగీతం కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ కష్టకాలంలో ఎస్పీ బాలు కుటుంబసభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

  ‘సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు.’

  ‘గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

  ‘కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు. బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు