Tamil Nadigar Sangam: నడిగర్ సంఘంలో అగ్ని ప్రమాదం
తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన నడిగర్ సంఘ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు ఆఫీస్ మొత్తం అగ్నికి అహుతైందనే చెప్పాలి. ఫైర్ డిపార్ట్మెంట్ మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో కీలక పత్రాలన్నీ కాలిపోయాయని అంటున్నారు. ఇంతకు ముందు నడిగర్ సంఘంలో ఎంత మేరకు నిధులున్నాయి. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ కార్యదర్శిగా మారిన తర్వాత నిధులు ఎంత మేరకు ఖర్చు అయ్యాయి. నడిగర్ సంఘం కార్యక్రమాలను నిర్వహించి సేకరించిన నిధులు ఎంత? ఖర్చు అయిన నిధి ఎంత? తదితర వివరాలకు సంబంధించిన విషయాలన్నీ ఈ ఆఫీసులోనే ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు విచారణలో ఇది నిజంగా ప్రమాదమా? లేక ఎవరైనా కావాలనే చేశారా? తేలాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.
విశాల్ కంటే ముందు శరత్ కుమార్ చాలా కాలం పాటు నడిగర్ సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ సమయంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పి.. విశాల్, నాజర్.. తదితరులు ఆరోపణలు చేశారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో దీన్ని కారణంగా చూపి నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ కార్యదర్శిగా గెలిచారు. నడిగర్ సంఘానికి కొత్త భవంతి లేదని, అది కట్టిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ ప్రతిన కూడా చేశాడు. అందుకు తగినట్లు విశాల్ నడిగర్ సంఘం తరపున కార్యక్రమాలను నిర్వహించారు. కానీ ఏ కార్యక్రమానికి ఎంత వరకు నిధులు వచ్చాయని విశాల్ ఎవరికీ లెక్కలు చెప్పలేదు. దీంతో నాజర్, విశాల్ ఆధ్వర్యంలోని నడిగర్ సంఘంపై కూడా విమర్శలు వచ్చాయి. దాదాపు పదికోట్ల రూపాయలు మేరకు నిధులు పక్క దారి పట్టాయని కొందరు ఆరోపణలు చేశారు. అదే సమయంలో నిర్మాతల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ పెద్ద నిర్మాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. సీనియర్ దర్శక నిర్మాత భారతీరాజా కొత్త నిర్మాతల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
#Breaking | நடிகர் சங்க அலுவலகத்தில் அதிகாலை 4.30 மணியளவில் தீ விபத்து. சுமார் 3மணி நேரம் போராடி இப்பொழுது அணைக்கப்பட்டது. #SIAA #NadigarSangam pic.twitter.com/IsmXIoL2Op
— NadigarSangam PrNews (@NadigarsangamP) December 7, 2020
ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికలు, నిర్మాతల సంఘాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలపై కోర్టుకు వెళ్లడంతో ఫలితాలను కోర్టు పెండింగ్లోనే ఉంచింది. ఈ క్రమంలో ఇప్పుడు నడిగర్ సంఘంలో జరిగిన అగ్ని ప్రమాదం అందరిలోనూ నాజర్, విశాల్ అండ్ టీమ్ ఈ పని చేయించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదం గురించి ఇప్పటి వరకు అటు నాజర్, విశాల్.. ఇతరులు కానీ తమ స్పందనను తెలియజేయలేదు. మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుందో చూద్దాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero vishal, Kollyood News