సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గాను ప్రఖ్యాత నటుడు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ -2022 అరుదైన పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ (Film Critics Association) అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఎఫ్.సి.ఏ అధ్యక్ష, కార్యదర్సులు సురేష్ కొండేటి, ఎం. లక్ష్మీ నారాయణ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తెలుగు చలచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకున్న స్వయంకృషీవలుడు మెగాస్టార్ చిరంజీవి అని, సినీ పరిశ్రమకు చేసిన అత్యుత్తమ సేవలకు గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును చిరంజీవిగారికి ప్రకటించడం ముదావాహమని పేర్కొన్నారు.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు గ్రహీతకు నెమలి చిత్రం కలిగిన రజత పతకం, రూ.10 లక్షలు, ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ అవార్డును వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీమ్ ఖాన్, విశ్వజిత్ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్ జోషి అందుకున్నారు.
సినిమా రంగంలో సినిమా జర్నలిస్టులు కూడా ఒక భాగమేనని, సినిమా రంగానికీ ప్రేక్షకులకూ మధ్య వారధి లాంటి వ్యవస్థ సినిమా జర్నలిజం అంటూ గతంలో సినిమా జర్నలిస్టుల గురించి మాట్లాడారు. ఒకరి అవసరం ఇంకొకరికి ఎప్పుడూ ఉంటుందని, సినిమా జర్నలిస్టుల సంక్షేమానికి తాను వెన్నుదన్నుగా నిలుస్తానని హామీ కూడా ఇచ్చారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నీ షూటింగ్ చేసుకుంటున్నాయి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇటీవల దీపావళీ సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానున్నట్లు ప్రకటించింది టీమ్. సంక్రాంతి కానుకగా ప్రకటించడంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం టీమ్ హైదరాబాద్ సిటీ శివార్లలో భారీ సెట్లో స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ పాటలో హిందీ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా నటించనుందని.. ఈ స్పెషల్ సాంగ్ ఓ రేంజ్లో ఉంటుందని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Tollywood actor