ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత సంవత్సరంలో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, సత్యనారాయణ, చలపతి రావు వంటి వారు కన్నుమూయగా.. నేడు సీనియర్ నటి జమున కన్నుమూశారు. ఈ విషాదం తాలూకు విషయాలు వైరల్ అవుతుండగానే సీనియర్ స్టంట్ మాస్టర్ జూడో కేకే రత్నం (93) (Judo KK Rathnam) మృతి చెందారు.
వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలతో జూడో కేకే రత్నం కన్నుమూశారు. తన సొంతూరైన వేలూరు జిల్లాలోని గుడియాత్తంలో తుది శ్వాస విడిచారు. 1930 ఆగస్టు 8న జన్మించిన జూడో కేకే రత్నం.. 1970 - 80 మధ్య కాలంలో ఇండస్ట్రీలో రాణించారు. 1959లో తమిళ చిత్రం ‘తామరై కుళం’ అనే సినిమాతో నటుడిగా తన సినీ కెరీర్ ప్రారంభించి ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్.టి.ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, రాజ్‌కుమార్, ప్రేమ్ నజీర్, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి , విజయ్, అజిత్ వంటి అనేక మంది హీరోల చిత్రాలకు ఈయన ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 1200 చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పని చేశారు జూడో కేకే రత్నం. రజనీకాంత్‌తో ఆయన ఏకంగా 46 చిత్రాలకు ఫైట్ మాస్టరుగా పనిచేశారు. ఆయన చివరగా ఫైట్‌మాస్టరుగా పనిచేసిన చిత్రం ‘పాండ్యన్’. 1992లో ఈ సినిమా రిలీజ్ అయింది.
ఫైట్ మాస్టరుగానే కాకుండా తామరైకులం, కొంజుం కుమరి2, పోకిరి రాజా, తలైనగరం లాంటి చిత్రాల్లో నటించారు జూడో కేకే రత్నం. ఈయనకు 2019లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ అవార్డును ప్రదానం చేసింది. జూడో కేకే రత్నం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor