రివ్యూ: ‘ఎవరు..’ మరోసారి ఆకట్టుకున్న అడవి శేష్..

క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడవి శేష్. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఇదే దారిలో చేసిన సినిమా ఎవరు.. మరి ఇది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 12:44 AM IST
రివ్యూ: ‘ఎవరు..’ మరోసారి ఆకట్టుకున్న అడవి శేష్..
ఎవరు మూవీ రివ్యూ (Source: Twitter)
  • Share this:
నటీనటులు: అడవి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వెంకట్ రాంజీ

నిర్మాత: పివిపి

క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడవి శేష్. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఇదే దారిలో చేసిన సినిమా ఎవరు.. మరి ఇది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..కథ:
అనుకోని పరిస్థితుల్లో రెజీనా మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. నవీన్ చంద్రను చంపేసిన కేసులో ఆమెను కిల్లర్ గా ముద్ర వేస్తారు పోలీసులు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అడవి శేష్. డబ్బు కోసం సాక్ష్యాలను తారుమారు చేయడానికి.. రెజీనాకు సాయం చేయడానికి వస్తాడు శేష్. అయితే ఆ క్రమంలోనే కేస్ గురించి ప్రతీ వివరం కనుక్కుంటాడు. ఆ క్రమంలోనే రెజీనా సమాధానాల నుంచి శేష్ కు కొన్ని నిజాలు తెలుస్తాయి. దాంతో కేస్ సరికొత్త దారుల్లోకి వెళ్తుంటుంది. చివరికి నవీన్ చంద్రను రెజీనా ఎందుకు చంపింది అనేది అసలు కథ..కథనం:
సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు కథ పెద్దగా ఉండదు.. ఉన్నందతా కథనమే. ప్రతీసారి ఈ స్క్రీన్ ప్లేనే నమ్ముకుంటాడు శేష్. తను కొత్త కథల కంటే కథనం కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. క్షణం, గూడఛారి లాంటి సినిమాలు ఇలాగే వర్కవుట్ అయ్యాయి కూడా. ఈ సినిమల్లో కూడా అడవి శేష్ చేసింది స్క్రీన్ ప్లే మాయాజాలమే. అది వర్కవుట్ అయింది కాబట్టే సినిమాలు ఆడేసాయి. ఇప్పుడు ఎవరు సినిమా విషయంలో కూడా ఇదే చేసాడు. మొదట్లోనే మర్డర్ అండ్ రేప్ సీన్‌తో సినిమాను ఓపెన్ చేసాడు దర్శకుడు వెంకట్ రాంజీ. అక్కడే ఆసక్తి పెరిగిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుడిలో కూడా కనిపిస్తుంది. అడవి శేష్ ఎంట్రీ తర్వాత అది మరోస్థాయికి వెళ్లిపోతుంది. రెజీనాతో కూర్చున్న తర్వాత.. కేసు గురించి మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. కథ కూడా వేగంగానే వెళ్తుంది.
ప్రతీ ప్రశ్నలోనూ మనకు తెలిసే కొత్త సమాధానం నెక్ట్స్ ఏం జరుగుతుందనే దానిపై ఆసక్తి పెంచేస్తుంది. ఫస్టాఫ్ అంతా కూడా చాలా ట్విస్టులతో ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత సెకండాఫ్ కాస్త స్లో అయినట్లు అనిపించినా కూడా ఎక్కడా స్క్రీన్ ప్లే మాత్రం పట్టు తప్పలేదు. అనవసరపు హంగామా చేయకుండా సింపుల్‌గా అనుకున్నది అనుకున్నట్లు స్క్రీన్ పై చూపించాడు దర్శకుడు. దానికి స్క్రీన్ ప్లే కూడా బాగానే సాయపడింది. ముఖ్యంగా రెజీనా మర్డర్ అండ్ రేప్ సీన్ సినిమాలో నాలుగు సార్లు వస్తుంది.. కానీ ప్రతీసారి చూపించే కోణం మాత్రం కొత్తగా ఉంటుంది. ఇందులో ఏది నిజం అనేది మాత్రం ప్రేక్షకుడి ఊహకే వదిలేసాడు దర్శకుడు. సమాధానం సగంలోనే తెలిసిపోయినా కూడా క్లైమాక్స్ వరకు కూర్చోబెట్టే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. హిందీలో బద్లా.. హాలీవుడ్ ఇన్వెజబుల్ గెస్ట్ చూడని వాళ్లకు ఎవరు బాగానే నచ్చేస్తుంది.

నటీనటులు:
అడవి శేష్ ఎప్పట్లాగే బాగా చేసాడు. తనకు ఈ తరహా పాత్రలు అచ్చు గుద్దినట్లు సరిపోతున్నాయి. గూడఛారిలో కూడా కాప్ పాత్రలో రప్ఫాడించాడు. ఇప్పుడు ఇదే చేసాడు. రెజీనా మరోసారి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. నవీన్ చంద్ర కీలకమైన పాత్రలో బాగా నటించాడు. ఈయన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మురళీ శర్మ ఉన్నది కాసేపే అయినా కూడా కథను ముందుకు నడిపించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:
శ్రీ చరణ్ పాకాల సంగీతం బాగుంది. ఇలాంటి సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ కీలకం. ఆ విషయంలో ఈయన సరైన న్యాయం చేసాడు. ఎడిటింగ్ బాగుంది. లెంత్ కూడా తక్కువే కావడంతో ఎలాంటి కంప్ల్లైంట్స్ లేకుండా సినిమా ఎంజాయ్ చేసేయొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. తక్కువ బడ్జెట్ అయినా కూడా సినిమాలో రిచ్ నెస్ కనిపించింది. దర్శకుడిగా వెంకట్ రాంజీ ఆకట్టుకున్నాడు.

చివరగా ఒక్కమాట:
ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్..

రేటింగ్: 3/5
First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>