ఈ మధ్య సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ప్రేక్షకులకు గుర్తుంటున్నాడు రాజ్ తరుణ్. మొన్నటికి మొన్న ఈయన యాక్సిడెంట్ వీడియో చేసిన రచ్చ మాటల్లో చెప్పడం కష్టం. దాన్ని మీడియా కూడా కొండంత చేసి చూపించింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీకి దూసుకొచ్చిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు పరాజయాలతో పడిపోయాడు. ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకున్నాడో అంతే త్వరగా పోగొట్టుకున్నాడు కూడా. వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ పోవడంతో.. ఇప్పుడు ఈ కుర్ర హీరోను మరిచిపోయే స్టేజికి వచ్చేసారు ప్రేక్షకులు.
దిల్ రాజు నిర్మించిన లవర్ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో రాజ్ తరుణ్ పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పుడు అసలు ఈయన సినిమాలు చేస్తున్నాడా లేదా అనే అనుమానాలు వస్తున్న సమయంలో దిల్ రాజు సంస్థ నుంచి మరో అవకాశం వచ్చింది. ఎక్కడో రాజ్ తరుణ్ నక్క తోక తొక్కాడు కాబట్టి ఈ టైమ్ లో మనోడికి అక్కడ్నుంచి ఆఫర్ వచ్చింది. ఐదేళ్ల కింద సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి అనే సినిమా తీసిన కృష్ణారెడ్డి ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా ఇద్దరి లోకం ఒకటే సినిమా తెరకెక్కించాడు.
ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఇది కానీ తేడా కొడితే రాజ్ తరుణ్‌ను పూర్తిగా మర్చిపోవచ్చు. కానీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా ఈ సారి మాయ చేసేలా కనిపిస్తున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రాజ్ తరుణ్. శాలిని పాండే ఇందులో హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి చూడాలిక.. ఈ చిత్రంతో రాజ్ తరుణ్ ఎలాంటి మాయ చేయబోతున్నాడో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raj tarun, Telugu Cinema, Tollywood