రివ్యూ: డిస్కో రాజా.. మజా లేలో.. కండీషన్స్ అప్లై..

రవితేజ సినిమా అంటే ఒకప్పుడు చాలా అంచనాలు.. నమ్మకాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో చాలా రోజుల గ్యాప్ తీసుకుని డిస్కో రాజా అంటూ వచ్చాడు రవితేజ. డిఫెరెంట్ సినిమాలు చేసే విఐ ఆనంద్ తోడు కావడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. మరి డిస్కో రాజా ఎలా ఉన్నాడు.. ఆకట్టుకున్నాడా లేదా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 24, 2020, 12:51 PM IST
రివ్యూ: డిస్కో రాజా.. మజా లేలో.. కండీషన్స్ అప్లై..
‘డిస్కోరాజా’లో రవితేజ Instagram/raviteja_2628
  • Share this:
నటీనటులు : రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్, బాబీ సింహా, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని

సంగీతం : థమన్
నిర్మాత : ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్
దర్శకత్వం : వి. ఐ ఆనంద్

రవితేజ సినిమా అంటే ఒకప్పుడు చాలా అంచనాలు.. నమ్మకాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో చాలా రోజుల గ్యాప్ తీసుకుని డిస్కో రాజా అంటూ వచ్చాడు రవితేజ. డిఫెరెంట్ సినిమాలు చేసే విఐ ఆనంద్ తోడు కావడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. మరి డిస్కో రాజా ఎలా ఉన్నాడు.. ఆకట్టుకున్నాడా లేదా..?

కథ :లధాక్‌లో వాసు (రవితేజ)పై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేసి చంపేస్తారు. అక్కడే మంచులో వదిలేసి వెళ్లిపోతారు. తర్వాత గడ్డ కట్టుకుని చచ్చిపోతాడు వాసు. మంచు కూరుకుపోతాడు. మరోవైపు ఆయన కోసం ఢిల్లీలో ఆయన కుటుంబం అంతా వేచి చూస్తుంటుంది. అతడి గాళ్ ఫ్రెండ్ నభా (నభా నటేష్) కూడా వాసు కోసం చూస్తుంటుంది. అలాంటి సమయంలో వాసు డెడ్ బాడీని డాక్టర్ పరిణీతి (తాన్యా హోప్) బృందం ల్యాబ్‌కు తెప్పించుకుంటారు. ఛీఫ్ డాక్టర్ తన సైన్స్ ప్రయోగంతో చనిపోయిన వాసును మళ్లీ బతికిస్తాడు. కానీ వాసు గతం మర్చిపోతాడు. తన గతాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో మద్రాస్ వెళ్తాడు. అక్కడ డిస్కో రాజా(రవితేజ) గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. అసలు వాసు, డిస్కో రాజాకు ఏంటి సంబంధం.. వాసును ఎందుకు చంపేస్తారు.. డిస్కో రాజా ఎలా చచ్చిపోతాడు అనేది అసలు కథ..

కథనం:
తెలుగులో కొందరు దర్శకులున్నారు. వాళ్లకు రొటీన్ సినిమాలు తీయడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి దర్శకుడే విఐ ఆనంద్. రొటీన్ కథలకు ఈయన చాలా దూరం. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాల తర్వాత ఈయన నుంచి వచ్చిన సినిమా డిస్కో రాజా. రవితేజ హీరో కావడంతో రొటీన్‌గా ఉంటుందని ఊహించడం సాధారణమే. కానీ డిస్కో రాజా కథ మాత్రం కొత్తగా ఉంటుంది. చనిపోయిన మనిషిని మళ్లీ బతికించి కథ మొదలుపెట్టాడు దర్శకుడు. తొలి సీన్‌లోనే హీరోను చంపేయడం.. ఆ తర్వాత ఆయన్ని సైన్స్ ల్యాబ్ తీసుకొచ్చి ప్రయోగం చేసి బతికించడం.. అన్నీ కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఒక్కసారి రవితేజ గతం కోసం ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆసక్తి పెరిగిపోయింది. డిస్కో రాజాతో తనకేంటి సంబంధం అని తెలుసుకునే క్రమంలో వాసుకు ఆసక్తికరమైన విషయాలు తెలియడం.. అప్పుడు అసలు ట్విస్ట్ బయటికి రావడం ప్రేక్షకులకు షాక్ ఇస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టులు సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేసాయి. అప్పటి వరకు కేవలం రవితేజపైనే కథ నడుస్తుంది. వింటేజ్ రవితేజను గుర్తు చేస్తూ తన ఇమేజ్‌కు సరిపోయే సన్నివేశాలు రాసుకున్నాడు ఆనంద్. ప్రాణం వచ్చిన తర్వాత డిస్కో రాజా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవడానికి రవితేజ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిన తర్వాత సెకండాఫ్‌పై అంచనాలు పెరిగిపోతాయి కానీ రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామా చూపించాడు. ఓ దొంగ.. డాన్ అవ్వడం.. అతడికి మరో డాన్ బాబీ సింహాతో గొడవ.. హీరో విలన్‌ను చిత్తు చేయడం అవన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. అయితే 80స్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు దర్శకుడు. కానీ అతిముఖ్యమైన పాయల్ రాజ్‌పుత్ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. ఆమెతో వచ్చే రవితేజ లవ్ ట్రాక్ అస్సలు ఆకట్టుకోకపోగా బోర్ కొట్టించింది. సెకండాఫ్ మెయిన్ డ్రా బ్యాక్ అదే. అప్పటి వరకు బ్రేకుల్లేకుండా సాగిన సినిమాకు సడన్ బ్రేకులు వేసింది ఈ ట్రాక్. క్లైమాక్స్ మళ్లీ అదిరిపోయింది. బాబీ సింహాను చంపిన తర్వాత వచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. సునీల్ ఈ సినిమాతో మరో టర్న్ తీసుకున్నాడు. క్లైమాక్స్‌లో ఈయన చేసిన నటన కేక పెట్టిస్తుంది. ఓవరాల్‌గా రవితేజ నుంచి వచ్చిన డిఫెరెంట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా డిస్కో రాజా.

నటీనటులు:
రవితేజ నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా ఆయన ఆకట్టుకుంటాడు. ఇప్పుడు కూడా డిస్కో రాజాగా చింపేసాడు రవితేజ. చాలా కోణాలు చూపించాడు ఈయన. బాబీ సింహా కూడా అదరగొట్టాడు. ఆయన ఫేస్‌లోనే ఏదో మ్యాజిక్ ఉంది. స్క్రీన్ పై తెలియని మ్యాజిక్ చేస్తాడు సింహా. ఇక సునీల్ ఈ చిత్రంలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్. క్లైమాక్స్ చంపేసాడు. నభా నటేష్, తాన్యా హోప్, పాయల్ రాజ్‌పుత్ పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:
తమన్ సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆర్ఆర్ అయితే అదరగొట్టాడు. సినిమా రేంజ్ పెంచేసింది ఈ బ్యాగ్రౌండ్ స్కోర్. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు కానీ సెకండాఫ్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు కథ వేగానికి అడ్డుపడినట్లు అనిపించాయి. ఆర్ట్ డైరెక్టర్ టి నాగేంద్ర ప్రసాద్ వర్క్ బాగుంది. 30 ఏళ్ల కింద ఉండే ఫీల్ మళ్లీ తన ఆర్ట్ వర్క్‌తో చూపించాడు ఈయన. దర్శకుడిగా విఐ ఆనంద్ మరోసారి భిన్నమైన కథను తీసుకున్నాడు కానీ మధ్యలో రొటీన్ అయిపోయాడు. ముఖ్యంగా డిస్కో రాజా ఫ్లాష్ బ్యాక్ గురించి చాలా ఊహించుకుంటాం కానీ అంత బలమైన సన్నివేశాలు అక్కడ లేకపోవడం మైనస్ అనిపించింది. అయితే కథ పరంగా కొత్తగా ఉండటం.. రవితేజ నటనను బాగా వాడుకున్నాడు ఈయన. ఓవరాల్‌గా దర్శకుడిగా పూర్తి సత్తా మాత్రం చూపించలేదు. కొత్త పాయింట్ తీసుకున్నా డీల్ చేయడంలో తేడా కొట్టింది.

చివరగా ఒక్కమాట:
డిస్కో రాజా.. సరికొత్త సైన్స్ ఫిక్షన్‌లో రొటీన్ రివేంజ్..

రేటింగ్: 2.75/5
First published: January 24, 2020, 12:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading