తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు తేజది ప్రత్యేక అధ్యాయం. ఇప్పుడు ఆయన ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన వారసులు, హీరోలు ఇప్పుడు స్టార్స్‌గా ఉన్నారు. ఎంతోమందిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత తేజ సొంతం. అలాంటి తేజ 20 ఏళ్ళ కింద చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. చిన్న సినిమాలకు మళ్లీ ప్రాణం పోసిన ఘనత కూడా ఈయన సొంతం. అలాంటి చిన్న సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు తేజ. ఫిబ్రవరి 22న ఈయన పుట్టిన రోజు సందర్భంగా చిత్రం 1.1 పేరుతో చిత్రంకి సీక్వెల్ అనౌన్స్ చేసాడు. ఇందులో మరోసారి కొత్త హీరోనే పరిచయం చేయబోతున్నాడు. హీరో హీరోయిన్లతో పాటు 45 మంది కొత్త వాళ్లను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు తేజ. తన కెరీర్లో అద్భుతమైన పాటలు ఎన్నో ఇచ్చిన ఆర్పీ పట్నాయక్‌ని మరోసారి సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు తేజ. కొన్నేళ్లుగా ఈయన సంగీతానికి దూరంగా ఉన్నాడు. ఇన్నాళ్లకు చిత్రం సీక్వెల్‌తో వస్తున్నాడు. అప్పుడు చిత్రం సినిమాకు ఉదయ్ కిరణ్ దొరికాడు. ఇప్పుడు సీక్వెల్‌కు మరో ఉదయ్ కిరణ్ కావాలి. ఈ సారి బయటికి వెళ్లకుండా ఉదయ్ కిరణ్‌ను ఇంట్లోనే వెతుక్కున్నాడు తేజ. అర్థం కాలేదు కదా.. ఎంతోమంది వారసులను, కొత్త వాళ్లను పరిచయం చేసిన తేజ.. ఇప్పుడు తన వారసుడిని పరిచయం చేసే పనిలో పడ్డాడు. తన తనయుడు అమితవ్ తేజని.. చిత్రం సీక్వెల్‌తో హీరోగా పరిచయం చేయాలని తేజ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

దర్శకుడు తేజ తనయుడు అమితోవ్ (Director Teja son)
అందుకే ఇప్పటికే అమితవ్కి నటనలో శిక్షణ ఇప్పిస్తున్నాడు ఈయన. తను రాసుకున్న కథకు అమితవ్ అయితే సరిపోతాడని తేజ భావిస్తున్నాడని.. తన వారసుడిపై త్వరలోనే ఓ ట్రయల్ షూట్ కూడా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొడుకు కానీ బాగా చేసాడంటే అతన్నే లాంఛ్ చేయబోతున్నాడు తేజ. అలా కాదంటే మాత్రం మరో హీరో కోసం వెతకడం మొదలు పెడతాడు.
Published by:Praveen Kumar Vadla
First published:February 23, 2021, 14:33 IST