దర్శకుడు సుకుమార్ అనారోగ్యం పాలైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఎలాంటి ప్రమాదం లేదని.. కేవలం సీజన్ మారడంతోనే ఈ జ్వరం వచ్చినట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజులుగా ఈయన ఇంటికే పరిమితం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు సుక్కు. ముందు ఒక్క భాగమే అనుకున్నా కూడా.. కథ పెద్దగా ఉండటంతో రెండు భాగాలుగా నిర్ణయించేసాడు దర్శకుడు సుకుమార్. ఈ క్రమంలోనే పుష్ప 1 ఇదే ఏడాది విడుదల కానుందని తెలుస్తుంది. అయితే కరోనా బ్రేక్‌కు తోడు.. మధ్యలో కూడా కొన్ని అనుకోని బ్రేకులు రావడంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతూనే ఉంది. దాంతో 2021లో ఈ సినిమా రావడం కష్టంగానే ఉంది.
2022 సంక్రాంతికి విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎలాంటి బ్రేకులు లేకుండా సజావుగా సాగుతున్న పుష్ప 1 షూటింగ్‌కు మళ్లీ ఇప్పుడు విరామం తప్పడం లేదు. సుకుమార్ అనారోగ్యం కారణంగా కనీసం వారం రోజులు ఈ చిత్ర షూటింగ్‌కు అనుకోని అంతరాయం కలిగేలా కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా సుకుమార్ మెడికల్ ట్రీట్‌మెంట్‌కు దూరంగానే ఉంటాడు. ఈయన కేవలం హోమియోపతి మాత్రమే వాడుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడని తెలుస్తుంది.
జ్వరం తగ్గిపోగానే మళ్లీ షూటింగ్‌తో బిజీ కానున్నాడు ఈ దర్శకుడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్ప సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా పుష్ప రూపొందుతుంది. దాదాపు 100 కోట్లతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Director sukumar, Telugu Cinema, Tollywood