తెలుగులో రూపుదిద్దుకొని, ఐదు భాషల్లో విడుదలై, భారతీయ సినీ పరిశ్రమ దశ-దిశను మార్చేస్తూ ప్రపంచ ఖ్యాతి పొందిన సినిమా ‘బాహుబలి’. ప్రభాస్ ను ఇండియన్ రెబల్ స్టార్ గా నిలబెట్టిన బాహుబలి ఫ్రాంచైజ్ ఇప్పటికి ది బిగినింగ్, ది కంక్లూజన్ పేరుతో రెండు భాగాలు రాగా, వాటికి కొనసాగింపుగా బాహుబలి-3 రాబోతోందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్స్ రూపొందిచిన బాహుబలి-3 ట్రైలర్లకు లక్షలకొద్దీ వ్యూస్ వస్తుండటం ఆ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని తెలియజేస్తుంది. మరి జనం అంతలా కోరుతోంటే జక్కన మాత్రం కాదంటాడా? ఇన్నాళ్ల గందరగోళానికి తెర దించుతూ ‘బాహుబలి-3’ రాబోతోందని దర్శకధీరుడు రాజమౌళి తన నోటితోనే వెల్లడించారు..
ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలతో ఎన్నెన్నో రికార్డులు సృష్టించాడు రాజమౌళి. కాగా, 'బాహుబలి'కి కొనసాగింపుగా 'బాహుబలి-3' రానుందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారమవుతోన్న వార్తలపై ఇటీవల ప్రభాస్ స్పందిస్తూ.. ‘పార్ట్-3 గురించి నాక్కూడా తెలియదు. సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు' అని చిన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రాజమౌళి సినిమాను కన్ఫామ్ చేశారిలా..
రాజమౌళి రూపొందించిన తాజా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' ఈనెల 25న విడుదల కానుండగా, ఆ సినిమా ప్రమోషన్ భాగంగా ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ‘బాహుబలి-3’తీస్తామని రాజమౌళి వెల్లడించారు. ‘మీ నుంచి 'బాహుబలి-3' వస్తుందని భావించవచ్చా?’ అని హోస్ట్ అడగ్గా.. ‘తప్పకుండా వస్తుంది. 'బాహుబలి' చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నాం’ అని బదులిచ్చారు. అంతేకాదు,
‘నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. బాహుబలి-3ని ప్రేక్షకులకు చూపించడానికి కాస్త సమయం పట్టొచ్చు. కానీ 'బాహుబలి' రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రాబోతోంది’ అని రాజమౌళి వివరించారు. గతంలోనూ ఓసారి సోషల్ మీడియా చాటింగ్ లో రాజమౌళి బాహుబలి-3పై హింట్ ఇచ్చినా, సినిమా కచ్చితంగా తీస్తామని చెప్పడం మాత్రం ఇదే తొలిసారి. రాజమౌళి ప్రకటనతో సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 'బాహుబలి-3' కోసం వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే,
బాహుబలి-3 కచ్చితంగా చేస్తామని, అయితే అందుకు కొంత సమయం పడుతుందన్న రాజమౌళి ఆ ఆలస్యానికి కారణాలను కూడా వివరించారు. ‘ముందుగానే చెప్పినట్లు 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత నేను చేయబోయే ప్రాజెక్ట్ మహేశ్‌బాబుతోనే ఉంటుంది. దానికి సంబంధించి వర్క్ జరుగుతోంది. కాకపోతే ప్రస్తుతం నా దృష్టి అంతా 'ఆర్‌ఆర్‌ఆర్' పైనే ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక.. కాస్త ప్రశాంతంగా మహేశ్ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా’ అని రాజమౌళి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bahubali, Prabhas, RRR, SS Rajamouli