Director Sarath Passes Away | 2022 కూడా చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ముఖ్యంగా భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు.. భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంలో తన పాటలతో మైమరిపించిన కందికొండ కాన్సర్‌తో కన్నుమూసారు. తాజాగా టాలీవుడ్లో తనదైన యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శరత్ ఈ రోజు ఉదయమే కన్నుమూసారు.
గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన .. ప్రముఖ ప్రైవేటు హస్పిటల్లో చికిత్స పొందుతూ.. ఈ రోజు ఉదయం 9 గంటలకు కన్నుమూసారు. ఈయన మరణంతో టాలీవుడ్లో విషాద చాయలు అలుముకున్నాయి. సుమన్, భానుప్రియ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘చాదస్తపు మొగుగు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా డియర్ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఆ తర్వాత 1989లో శోభన్ బాబు, మోహన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి నందమూరి హీరోలుగా తెరకెక్కిన ‘అగ్ని నక్షత్రం’ సినిమా కూడా ఈయనకు దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది.
కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత సుమన్ హీరోగా తెరకెక్కిన ‘పెద్దింటల్లుడు’ సినిమాతో శరత్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆ తర్వాత ఈయన దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. ఈయన ఎక్కువగా సుమన్, బాలకృష్ణలతో సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు శరత్.
ముఖ్యంగా సుమన్‌తో ‘చాదస్తపు మొగుడు’ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న ఈయన ఆ తర్వాత ‘పెద్దింటల్లుడు’, ‘కలెక్టర్ గారి అల్లుడు’,‘బావ బావమరిది, ‘దొంగ అల్లుడు, ‘చిన్న అల్లుడు’, హలో అల్లుడు, అబ్బాయి గారి పెళ్లి వంటి ఎనిమిది చిత్రాలను తెరకెక్కించారు. అటు సూపర్ స్టార్ కృష్ణతో సూపర్ మొగుడు, బాలకృష్ణతో ‘వంశానికొక్కడు,’ పెద్దన్నయ్య’, సుల్తాన్’, వంశానికొక్కడు’ వంటి చిత్రాలతో పాటు అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్‌లతో ‘పండగ’ సినిమాలను తెరకెక్కించారు. టోటల్‌గా సుమన్‌తో ఎనిమిది చిత్రాలు.. బాలయ్యతో నాలుగు చిత్రాలను తెరకెక్కించారు. ఓవరాల్‌గా చూసుకుంటే.. 20 చిత్రాల వరకు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేసారు. సినిమాల్లో పడి ఈయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.