Sobhan Babu Death Anniversary: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’

దివంగత శోభన్ బాబు, దర్శకుడు కోదండరామిరెడ్డి

శనివారం (మార్చి 20) టాలీవుడ్ సీనియర్ హీరో, సోగ్గాడు శోభన్ బాబు 13వ వర్థంతి. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే కోదండరామిరెడ్డి గతంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

  • Share this:
సోగ్గాడు. ఈ పేరు వినగానే తెలుగునాట అందరికీ గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు శోభన్ బాబు. శనివారం (మార్చి 20) ఆయన 13వ వర్థంతి. 2008వ సంవత్సరం మార్చి 20వ తారీఖున ఆయన కన్నుమూశారు. అటు రిలయ్ లైఫ్ లోనూ, ఇటు రీల్ లైఫ్ లోనూ అందరికీ భిన్నంగా ఉండే వ్యక్తి ఆయన. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ రీతిలో మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక టాలీవుడ్ హీరో శోభన్ బాబు. ఆయన సినిమా విడుదలవుతోందంటే చాలు, థియేటర్లకు మహిళలకు క్యూ కట్టేవాళ్లు. సెంటిమెంట్స్ కలగలిపిన చిత్రాలతో గుండెలను పిండేసేవారు. ఎప్పుడైనా దర్శకుడు ఓ మాంచి మాస్ ఫైట్ పెడదాం సార్.. అని శోభన్ బాబుతో అంటే ‘మనకెందుకయ్యా.. అనవసర రిస్కు. లేడీస్ కు నచ్చితే చాలదా. మాస్ ఫాలోయింగ్ దేనికి‘ అని అనేవాళ్లు. దర్శకుడు తప్పదు సార్ అంటే సరేననేవాళ్లు.

సినిమా షూటింగ్ సమయంలో ఆయన నిక్కచ్చిగా ఉంటారనీ, సాయత్రం ఆరు దాటిందంటే షూటింగ్ స్పాటులో ఉండరనీ అందరికీ తెలిసిందే. ఆదివారం కూడా నేను షూటింగ్ రాను, ఇష్టం ఉంటేనే నన్ను హీరోగా తీసుకోండి, లేకుంటే వేరే హీరోను వెతుక్కోండి అని ముందే నిర్మాతలకు చెప్పే ముక్కుసూటి మనిషి ఆయన. ‘నా కండీషన్లు, నా అలవాట్ల గురించి నిర్మాతలకు ముందే చెబుతాను. వాళ్లు ఓకే అంటేనే నేను సినిమా ఒప్పుకుంటా. డబ్బు దగ్గర కచ్చితంగా ఉంటారని అంతా అంటుంటారు. ముందు ఒప్పుకున్న ప్రకారం డబ్బు అడిగితే తప్పేంటి. మనం కష్టపడ్డాం. అడుగుతున్నాం‘ అని శోభన్ బాబు తన సన్నిహితుల వద్ద చెప్పేవారు. తనకంటూ ఓ కుటుంబం ఉందనీ, సినిమా షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లాక, హ్యాపీగా కుటుంబంతో గడపాలన్నదే తన ఆశ అని ఆయన చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

శోభన్ బాబు ఎవరికీ సాయం చేయరని ఇండస్ట్రీలో వినపడే టాక్ ను దర్శకుడు కోదండరామిరెడ్డి గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొట్టిపారేశారు. ఆయన అన్నీ బయటకు చెప్పుకుని చాటింపు చేసుకునే రకం కాదు అని ఆయన తేల్చేశారు. తాను దర్శకుడిగా నిలదొక్కుకున్నానంటే ఆయన చలవేనని కూడా చెప్పారు. ’నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పటి నుంచి నాకు శోభన్ బాబు తెలుసు. ఆయన హీరోగా నటించిన సినిమాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశా. నన్ను చాలా దగ్గర నుంచి చూశారు. ‘వీడు ఈ జన్మకు దర్శకుడు కాలేడు‘ అని ఓ డైరెక్టర్ నా గురించి కామెంట్ చేశారు. అది విన్న శోభన్ బాబు వెంటనే రియాక్టయ్యారు. కోదండరామిరెడ్డి మంచి దర్శకుడు అవుతాడు. కావాలంటే నేను బెట్ కడతానంటూ నాపై పందెం కట్టారు. అది ఆయనకు నా మీద ఉన్న నమ్మకం. నాకు తెలుగులో మొదటి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ను ఆయనే కల్పించారు. నాకు, ఆయనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమాలు మానేశాక కూడా అప్పుడప్పుడు చెన్నైకు వెళ్తే నేను శోభన్ బాబును మాత్రం తప్పకుండా కలిసేవాడిని. మళ్లీ సినిమాల్లో నటించొచ్చు కదా అని అడిగితే.. ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా అని అనేవారు‘ అని దర్శకుడు కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ వీడియోను కూడా చూడండి: మూఢనమ్మకంతో ఊరును ఖాళీ చేసేశారు:

కోదండరామిరెడ్డి దర్శకుడిగా నిలదొక్కుకున్నాక ఆర్థికంగా స్థిరపడ్డాక చెన్నైలోని అన్నానగర్ లో ఓ స్థలం అమ్మకానికి వచ్చిందని తెలిసింది. అది తమిళ నిర్మాతకు చెందిన స్థలం. సినిమా తీసి ఆయన అప్పుల పాలయ్యారు. ఆ అప్పులను తీర్చేందుకే ఆ స్థలాన్ని అమ్మాలని డిసైడయ్యారు. కోదండరామిరెడ్డి ఆ స్థలాన్ని చూసేందుకు వెళ్లారు. అదేమో చెన్నై సిటీకి చాలా దూరంలో ఉంది. కోదండరామిరెడ్డికి తెలిసిన వాళ్లతో ఆ స్థలాన్ని చూసేందుకు వెళ్లారు. ఇక్కడ స్థలం కొనడం శుద్ధ దండగ అని సన్నిహితులంతా అన్నారు. వేరే ఏదైనా చోటు చూసుకో అని సలహా కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ రోజు శోభన్ బాబు వద్దకు కోదండరామిరెడ్డి వెళ్లారు. అయితే ఆయన చూసిన స్థలం ఎదురుగానే శోభన్ బాబు స్థలం ఉంది. ఆ విషయమే ప్రస్తావించారు.

‘అక్కడ కొనడం దండగని చెబుతున్నారు. మీ స్థలం ఎదురుగా ఉన్నదే కొనుక్కోమంటావా’ అని అడిగా. దానికి ఆయన వెంటనే.. ’కళ్లు మూసుకుని ఆ స్థలం కొను. ఇప్పుడు అది దండగగానే అందరికీ కనిపిస్తుంది. కానీ కొంత కాలం తర్వాత ఈ ఏరియా బాగా డవలప్ అవుద్ది. నీకు అదే బువ్వ పెడుతుంది. నా మాట పాటించు. నువ్వు కొననంటే చెప్పు నేనే కొనుక్కుంటా. రెండ్రోజులు నీకు గడువు ఇస్తున్నా. ఈలోపు నువ్వు కొనకపోతే మూడో రోజు నేను అడ్వాన్స్ ఇచ్చేసి ఆ స్థలాన్ని కొనుక్కుంటా‘ అని శోభన్ బాబు అన్నారు. దీంతో ఇంకేం ఆలోచించకుండా నేను ఆ స్థలాన్ని కొన్నాను. ఇప్పుడు ఆ స్థలం విలువ కోట్లలో ఉంది. బాగా డవలప్ అయిన ఆ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాను. అద్దెల రూపంలోనే నాకు ప్రతీ నెలా పది లక్షల రూపాయలు వస్తున్నాయి. అంతా శోభన్ బాబు చలవే..‘ అంటూ దర్శకుడు కోదండరామిరెడ్డి శోభన్ బాబు గురించి గుర్తు చేసుకున్నారు.
Published by:Hasaan Kandula
First published: