అనుష్కతో తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ తర్వాత దర్శకుడు గుణ శేఖర్ రానా ముఖ్యపాత్రలో ‘హిరణ్యకశ్యప’ టైటిల్‌తో పౌరాణిక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టు దర్శకుడు గుణశేఖర్ తెలియజేసాడు. ఈ సినిమాను దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. భారీ గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు గుణ శేఖర్. గతంలో గుణ శేఖర్ .. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘రామాయణం’ వంటి పౌరాణిక సినిమాను తెరకెక్కించిన అనుభవం ఉంది. ఆ ఎక్స్ పీరియన్స్‌తో ఇపుడు రానా హీరోగా ‘హిరణ్య కశ్యప’ అనే పౌరాణిక సినిమాకు శ్రీకారం చుట్టాడు.
ఇది భక్త ప్రహ్లాద కథే అయినప్పటికీ గుణ శేఖర్ ఈ సినిమాను హిరణ్యకశ్యపుడి కోణంలో తెరకెక్కించబోతున్నాడు. తెలుగులో తొలి టాకీ చిత్రంగా ‘భక్త ప్రహ్లాద’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మునిపల్లె సుబ్బయ్య ..హిరణ్య కశ్యపుడిగా నటిస్తే... మాస్టర్ కృష్ణారావు ప్రహ్లాదుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత ఏవీఎం ప్రొడక్షన్లో చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో ‘భక్త ప్రహ్లాద’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఎస్వీఆర్ హిరణ్యకశ్యపుడిగా యాక్ట్ చేస్తే.. రోజా రమణి భక్త ప్రహ్లాదుడిగా టైటిల్ రోల్ పోషించడం విశేషం.
ఈ సినిమా వచ్చిన 53 ఏళ్ల తర్వాత గుణ శేఖర్ అదే కథాంశంతో ‘హిరణ్యకశ్యప’ అనే టైటిల్‌తో ఈ భారీ పౌరాణిక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. హిరణ్య కశ్యపుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి అతన్ని సంహారిస్తాడు. ఈ పాత్ర కోసం ఓ స్టార్ హీరోను అనుకుంటున్నారు. ఈ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను గుణశేఖర్ సంప్రదించినట్టు సమాచారం. పాత్ర నిడివి తక్కువే అయినా.. ఎన్టీఆర్ లాంటి నటుడు ఈ సినిమాలో విష్ణుమూర్తి పాత్ర పోషిస్తే.. ఈ సినిమాకు మంచి హైప్ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మరి ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాలో నటించే విషయమై ఇంకా కన్ఫామ్ చేయలేదు.
ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు గుణ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రానా విషయానికొస్తే.. ఈ జనరేషన్లో ‘బాహుబలి’ వంటి జానపద, ‘రుద్రమదేవి’ ‘ఘాజీ’వంటి చారిత్రక చిత్రాలతో పాటు ‘హిరణ్యకశ్యప’ వంటి పౌరాణిక సినిమాతో ఈ జనరేషన్లో అన్ని జానర్స్‌లో యాక్ట్ చేసిన ఏకైక హీరోగా రానా ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Gunasekhar, Rana daggubati, Suresh Productions, Tollywood