డేవిడ్ వార్నర్.. క్రికెట్‌ను ఇష్టపడేవారిలో ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. లాక్డౌన్ సమయంలో డేవిడ్ వార్నర్ సౌత్ సినిమా హీరోలను ఫాలో కావడం మొదలు పెట్టాడు. హైదరాబాద్ సన్ రైజర్స్‌తో క్రికెట్ ఆడటం వల్ల ఏర్పడిన అనుబంధం కావచ్చు మరేదైనా కావచ్చు. కానీ వార్నర్‌కు దక్షిణాదితో సంబంధం ఏర్పడింది. ఈ కారణంగా దక్షిణాది సినిమాలు ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలకు చెందిన స్టార్ హీరోల సినిమాల్లో పాటలకు ఆయన తన భార్యతో కలిసి స్టెప్పులేశాడు. బుట్టబొమ్మ సాంగ్‌లో భార్యతో వార్నర్ వేసిన స్టెప్పులు అందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అలాగే బాహుబలిలో ప్రభాస్ డైలాగ్‌ను చెబుతూ వీడియోలు చేసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు వార్నర్.
తర్వాత ఈ స్టార్ క్రికెటర్ రూటు మార్చాడు పేస్ ఆఫ్ యాప్‌ను ఉపయోగించి సౌత్స్టార్స్ సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో సదరు హీరోల స్థానంలో తన ఫేస్‌ను అతికించి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. 2020 ఏడాదిని ఇలా ముగిస్తున్నాను అంటూ మహేశ్ హీరోగా చేసిన మహర్షి సినిమాలో కొన్ని సన్నివేశాలను ఫేస్ ఆఫ్ చేశాడు. అది మహేశ్ అభిమానులను ఎంతగానో అలరించింది.
లేటెస్ట్గా మరో సూపర్‌స్టార్‌ను ముఖాన్ని డేవిడ్ వార్నర్ ఫేస్ ఆఫ్ చేశాడు. ఆ సూపర్‌స్టార్ ఎవరో కాదు.. మన తలైవా రజినీకాంత్. ఆయన గత ఏడాది హీరోగా నటించిన దర్బార్ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఫేస్ ఆఫ్ చేసి వీడియో పోస్ట్ చేశాడు వార్నర్. ఈ వీడియోతో పాటు ఫాలోవర్స్‌కు న్యూ ఇయర్ శుభాకాంక్షలను తెలిపాడు వార్నర్. ఈ వీడియోకు తలైవా ఫ్యాన్స్ నుండి మంచి ఆదరణ లభిస్తోంది.