Costume Krishna Passed Away: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ నటుడు కృష్ణ అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూసారు. ఆయన పూర్తి పేరు కృష్ణ మాదాసు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయ నగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించారు. ఆయన సినీ పరిశ్రమలో కాష్ట్యూమ్ డిజనర్‌గా ఎంతో ఫేమస్. ఆ తర్వాత దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారత్ బంద్’ సినిమాలో విలన్‌గా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో ఆయన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఈయనకు నటుడిగా వరుసగా అవకాశాలు పలకరించాయి. ముఖ్యంగా కోడి రామకృష్ణ ఈయన్ని నటుడిగా మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ఈయన 1994లో సర్కార్ అందివలే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అక్కడ సినిమా వాళ్ల దగ్గర అసిస్టింట్ కాష్ట్యూమర్‌గా జాయిన్ అయ్యారు. ఇక ఈయన డిజైన్ చేసిన కాష్ట్యూమ్స్‌తో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వాణిశ్రీ, జయసుద, శ్రీదేవి, జయప్రద వంటి ఎంతో మంది నటీనటులను తన కాష్ట్యూమ్స్‌తో అందంగా చూపించడంలో ఆయన పాత్ర ఉంది.
అప్పట్లో ఎన్టీఆర్ వేసుకునే బెల్ బాటమ్ ప్యాంట్స్‌కు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ తీసుకొచ్చిన ఘనత కూడా కృష్ణకే దక్కుతుంది. అయితే కాష్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే కోడిరామకృష్ణ ఈయనలోని నటుడిని గుర్తించి ఈయనలో ఏదో ప్రత్యేకత ఉందని చెప్పి సినిమాల్లో నటించమని అడిగారు. మొదట వద్దన్న.. కోడిరామకృష్ణ పట్టుఒదలక పోవడంతో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారత్ బంద్’లో విలన్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక కాష్ట్యూమ్ డిజైనర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విజయ శాంతి హీరోయిన్‌గా బి.గోపాల్ దర్శకత్వంలో ‘అశ్వధ్ధామ’ చిత్రాన్ని నిర్మించారు. ఇక నటుడిగా ‘పెళ్లాం చెబితే వినాలి. మా ఆవిడ కలెక్టర్, కొండపల్లి రాజా, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, ‘పుట్టింటికి రా చెల్లి, చిత్రాలు కాస్టూమ్ కృష్ణకు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇక ఈయన జగపతి బాబు హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘పెళ్లి పందిరి’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ అయినా.. సరైన విధంగా ఈ సినిమాను అమ్మకం విషయంలో జరిగిన అవకతవకల వల్ల ఈయన నష్టపోయారు. మొత్తంగా అశ్వత్ధామ నుంచి పెళ్లి పందిరి వరకు 8 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో కాష్ట్యూమ్ డిజైనర్‌గా అడుగుపెట్టి.. ఆ పై నిర్మాతగా, నటుడిగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఈయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood