హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi: జమున మృతిపై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం.. ఏమన్నారంటే..!

Chiranjeevi: జమున మృతిపై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం.. ఏమన్నారంటే..!

Jamuna Death (Photo twitter)

Jamuna Death (Photo twitter)

Jamuna Death Condolences: జమున మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం అలుముకుంది. జమున ఇకలేరని తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) ఈ రోజు తెల్లవారు జామున మరణించారు (Jamuna Death). గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జమున మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం అలుముకుంది. జమున ఇకలేరని తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జమున మృతిపై బాలకృష్ణ స్పందిస్తూ.. ''అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరస నటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున గారు. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'' అని అన్నారు.

''ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామ గానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

చిరంజీవి స్పందిస్తూ.. ''సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను'' అంటూ ట్వీట్ పెట్టారు.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో జమున నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, జగ్గయ్య సహా పలువురు దిగ్గజ నటులతో జమున నటించారు. మరి కాసేపట్లో జమున భౌతిక కాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారని తెలిసింది. 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జన్మించారు జమున. తనదైన నటనతో వెండితెర సత్యభామగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు.

First published:

Tags: Chiranjeevi, Jamuna, Pawan kalyan, Tollywood

ఉత్తమ కథలు