news18-telugu
Updated: August 21, 2020, 8:37 PM IST
చిరంజీవి, పవన్ కళ్యాణ్
వినాయకచవితి వచ్చేసింది. విఘ్నాలు తొలగించే గణేషుడికి తమ విఘ్నాలు తొలగించాలంటూ ప్రజలు మొక్కుకుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో అందరూ తమ తమ సమస్యలను పోగొట్టాలని కోరుకుంటూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఏం కోరుకుంటున్నారో తెలుసా. కరోనా పరిస్థితుల నుంచి గట్టెక్కింది అందరూ పని చేసుకుంటూ హ్యాపీగా ఉండేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించారు మెగాస్టార్ చిరంజీవి. ‘షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పనిలేక, చేతులో డబ్బు అందక సినీ కార్మికులు చాలా కష్టపడుతున్నారు. అందుకే సీసీసీ తరఫున మూడోవిడుత సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. అసోసియేషన్లు, యూనియన్లు, సినీ వర్కర్లకు ఇస్తూనే డిస్ట్రిబ్యూటర్ సెంటర్లలో ప్రతినిధులకు కూడా ఇవ్వనున్నాం. సుమారు 10వేల మందికి అందిస్తున్నాం. ఈ సమయంలో అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పరిస్థితి శాశ్వతం కాదు. తాత్కాలిక కష్టమే. కొద్దికాలం మనమంతా ధైర్యంగా నిలబడదాం. పనిచేసుకుంటూ సంతోషంగా గడిపే రోజు త్వరలోనే వస్తుంది. మీ కుటుంబానికి కావాల్సింది మీ అందరి ఆరోగ్యం. మనకేం కాదులే. మనకేం రాదులే అనే నిర్లక్ష్య ధోరణి వద్దు. మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ వినాయకచవితి పండుగ అందరూ క్షేమంగా జరుపుకొంటూ ఈ క్లిష్టపరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కించాలి. మామూలు పరిస్థితులు రావాలి, యధావిధిగా మేం అందరం హాయిగా పనిచేసుకుంటుండాలి. సంతోషంగా ఉండాలి స్వామీ అని ఆ వినాయకుడిని మొక్కుకుందాం.’ అంటూ చిరంజీవి కోరుకున్నారు.
ఇక పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోలా కోరుకున్నారు. కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడాలని పవన్ ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. దేశ సమైక్యతకు, దేశ భక్తికి ఈ పండుగ ప్రతీకమని చెప్పారు. ఈసారి మన దేశభక్తికి పండుగలో ప్రతిబింబించేలా చేద్దామన్నారు. మన పూజగదిలోకి కూడా చొచ్చుకొచ్చిన విదేశీ వస్తువులు, పూజా ద్రవ్యాలను విడిచిపెడదామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మనవాళ్లు స్థానికంగా తయారు చేసే వాటినే వాడదామని పిలుపునిచ్చారు. ‘ఈ పూజ నుంచి మనం విదేశీ వస్తువులను త్యజిద్దాం. మన నేలపై తయారైన వస్తువులను వాడదాం. తద్వారా మన దేశ ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్దికి దోహదపడదాం. మన భారతీయులు, మన గడ్డపై తయారు చేసిన పర్యావరణహిత పూజాద్రవ్యాలతోనే పండుగ జరుపుకొందాం.’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రజలను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలో వినాయకచవితి నుంచే ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పవన్ కళ్యాణ్ జనసేన, ఏపీ బీజేపీ నిర్ణయించారు. వినాయకచవితికి వాడే వస్తువులు, పూజాద్రవ్యాలు అన్నీ స్థానికంగా, భారతీయులు తయారు చేసినవే వాడాలని పవన్ పిలుపునిచ్చారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 21, 2020, 8:31 PM IST