news18-telugu
Updated: September 14, 2020, 4:24 PM IST
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాపయ్య కాంబినేషన్లో రూపొంది అఖండ విజయం సాధించిన చిత్రం"ఇంటి గుట్టు". ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 36 సంవత్సరాలు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను న్యూస్ 18 ప్రత్యేకంగా అందిస్తోంది. ఎన్టీఆర్తో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ కి అత్యంత సన్నిహితుడైన డాక్టర్ డీ.వీ.ఎన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఆద్యంతం వినోదాత్మకంగా ఉండటమే ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం. ఈ చిత్రంలో చిరంజీవి, నళిని ఒక జంటగా, చంద్రమోహన్, సుహాసిని మరో జంటగా నటించారు. పలు విజయవంతమైన చిత్రాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన చిరంజీవి, సుహాసిని ఈ చిత్రంలో అన్నా చెల్లెలుగా నటించడం ఒక విశేషం.
ఈ చిత్రంలో చిరంజీవి నటించిన విజయ్ పాత్రలో పెద్దగా ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కానీ ఆయన కున్న క్రేజ్ అతి సాధారణ పాత్రను కూడా ప్రేక్షకులకు అత్యంత చేరువ చేసింది. మామూలు పాత్రలో కూడా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టు కున్నారు. ఈ చిత్రంతో మరో ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు చిరంజీవి. ఇక ఈ చిత్రంలో అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ తండ్రి కొడుకులుగా నటించారు. వీళ్లు అందించిన వినోదం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. 1964లో తమిళంలో ఘనవిజయం సాధించిన " పణక్కార్ కుడుంబం"చిత్రం ఆధారంగా తెలుగులో బాపయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, విజయాన్ని సాధించడం విశేషం.
మిగిలిన పాత్రల్లో రావుగోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, గిరిబాబు, నర్రా వెంకటేశ్వరరావు, చలపతిరావు, రావి కొండలరావు, అన్నపూర్ణ, జయమాలిని, అత్తిలి లక్ష్మి తదితరులు నటించారు. ప్రముఖ నటులు నూతన్ ప్రసాద్, సారథి అతిధి నటులు గా తళుక్కున మెరిసారు. పరుచూరి బ్రదర్స్ రచన,వేటూరి సుందర రామమూర్తి పాటలు ఈ చిత్రానికి ఆయువుపట్టు అని చెప్పుకోవాలి.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన తెరవెనుక జరిగిన ఆసక్తికర సంఘటన లను చూద్దాం....
* ఈ చిత్రానికి మొదట దర్శక నిర్మాతలు మోహన్ బాబు ను హీరోగా ఎంపిక చేశారు. 1983 జూన్ 29న మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో షూటింగ్ కూడా ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన అనూహ్య మార్పుల కారణంగా మోహన్ బాబు ను సినిమా నుండి తప్పించి హీరోగా చిరంజీవిని ఎంపిక చేశారు.
* ఈ చిత్ర నిర్మాణం సమయానికి దర్శకుడు బాపయ్య హిందీ సినిమాలతో బిజీగా ఉండడంతో కొన్ని సన్నివేశాలను కె.ఎస్.ప్రకాశరావు చిత్రీకరించారు.
*ఈ చిత్రం శతదినోత్సవం 1985 జనవరి 1న గుంటూరు లో జరిగింది.కొత్త సంవత్సరం తొలి రోజునే తన సినిమా శతదినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడంతో ఆ రోజు చిరంజీవి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.*సరిగ్గా 36 ఏళ్ల కిందట విడుదలైన ఈ చిత్రం చిరంజీవి మనసుకు బాగా నచ్చిన చిత్రాల్లో ఒకటి.
Published by:
Shiva Kumar Addula
First published:
September 14, 2020, 4:19 PM IST