రానా చేస్తున్న సినిమాలు.. ఆయన చేస్తున్న కారెక్టర్లు చూస్తుంటే రాజకీయాలంటే ఆయనకు చాలా ఇష్టమనే సంగతి అర్థమవుతుంది. తొలి చిత్రమే లీడర్ అంటూ వచ్చాడు రానా. ఆ తర్వాత నేనేరాజు నేనేమంత్రి సినిమాలో పొలిటికల్ లీడర్ పాత్రలో నటించాడు. ఇక మొన్నటికి మొన్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం చంద్రబాబు పాత్రలో ఒదిగిపోయాడు రానా దగ్గుపాటి. ఇవన్నీ చూసిన తర్వాత ఏదో ఒకరోజు ఈయన రాజకీయ రంగప్రవేశం చేస్తాడని అభిమానులు కూడా ఊహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రశ్న రానా వరకు కూడా వచ్చింది.
దాంతో ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు ఈ హీరో. తనకు రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉందని చెప్పాడు ఈయన. తన జీవితంలో తొలిసారి ఇంకొకరి పాత్రలో నటించానని.. చంద్రబాబు గారి పాత్రలో నటించడం ఈజీ అయిపోయిందని చెప్పాడు రానా. ఆ పాత్ర కోసం ఆయన్ని రెగ్యులర్ గా కలవడం కూడా కలిసొచ్చిందని చెప్పాడు రానా దగ్గుపాటి. ఎన్నో ఏళ్లుగా ఆయన్ని టీవీ, వార్తల్లో చూస్తూనే ఉన్నానని.. అలాంటిది ఆయన పాత్రలో నటించడం చాలా కొత్తగా, ఉత్సాహంగా అనిపించిందని చెప్పాడు రానా.
అసలు చంద్రబాబు పాత్రలో ఎలా ఉండాలనే విషయంలో ఆయనే స్వయంగా కొన్ని సూచనలు ఇచ్చారని చెప్పాడు ఈ నటుడు. ఇక వరసగా రాజకీయ పరమైన పాత్రలు పోషించడంతో త్వరలోనే ఈయన కూడా పాలిటిక్స్ లోకి వస్తాడేమో అనే వార్తలు వచ్చాయి. పైగా రాజకీయ నాయకుడి పాత్ర పోషించడంతో రాజకీయాల్లోకి రావాలనే స్పూర్థి వచ్చిందా అంటే దానికి ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు రానా. రాజకీయాల్లో చాలా డ్రామా ఉంటుంది.. అది తనకు సినిమాల్లో బాగా పనికొస్తుందని చెప్పాడు దగ్గుపాటి వారసుడు.
అక్కడ ఉండే డ్రామాను తన కారెక్టర్స్ కోసం వాడేస్తానని విచిత్రమైన ఆన్సర్ ఇచ్చాడు రానా. కేవలం డ్రామా ఉంటుంది కాబట్టే రాజకీయాలంటే ఇష్టమని.. అంతేకానీ అందులోకి వెళ్లే ఆలోచన మాత్రం లేదని తెగేసి చెప్పాడు రానా దగ్గుపాటి. అంటే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా ఈయన్ని రాజకీయాల్లో చూడటం కష్టమే అన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Chandrababu naidu, NTR Biopic, NTR Mahanayakudu, Rana, Telugu Cinema, Tollywood