తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందంను మించిన కమెడియన్ మరొకరు లేరు.. ఇప్పట్లో రారు కూడా. సినిమాలు చేయడం లేదు.. తెరపై కనిపించడం లేదు క్రేజ్ తగ్గిపోయిందేమో.. ఇక నవ్వించలేడేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ బ్రహ్మి తెరపై కనిపిస్తే అదే విజిల్స్ పడతాయి. అనారోగ్య కారణాలతో ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న ఈయన.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ పై కామెడీ చేసాడు. అయితే సినిమాలో మాత్రం కాదు.. సుడిగాలి సుధీర్ టీం హీరోలుగా నటించిన 3 మంకీస్ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన బ్రహ్మానందం అక్కడ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు.
సాధారణంగానే స్టేజ్ ఎక్కితే నవ్వించే బ్రహ్మి.. ఈ సారి తనకంటే చిన్నవాళ్లే కావడంతో పంచుల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ వినయం అతిగా ఉంటుందని.. తన సినిమా ఈవెంట్‌కు పిలిచినపుడు ఇంటికి వచ్చి చాలా వినయం ప్రదర్శించాడని పంచులేసాడు బ్రహ్మి. గురువు గారూ అంటూ గెటప్ శ్రీను.. గురూజీ అంటూ రాంప్రసాద్.. సర్ సర్ అంటూ సుడిగాలి సుధీర్ చాలా ఎక్స్ ట్రాలు చేసారని.. వాళ్ల వినయం చూడగానే నేనొస్తాన్రా అని చెప్పినట్లు తెలిపాడు బ్రహ్మానందం.
అనుకున్న టైమ్ కంటే వారం రోజులు ఆలస్యం అయినా కూడా తననే మళ్లీ పిలిచినందుకు.. తనకంటే బెటర్ వాన్ని వెతుక్కోనందుకు థ్యాంక్స్ అంటూ సెటైర్లు కూడా వేసాడు బ్రహ్మి. 3 మంకీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం స్పీచ్ అదిరిపోయింది. కమెడియన్లు హీరోలుగా నటించినపుడు తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని.. ఆ సినిమాలు విజయం సాధిస్తే తనకంటే ఎక్కువ ఎవరూ సంతోషించరని చెప్పాడు ఈయన. మొత్తానికి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇస్తూనే మీడియా ముందు సుడిగాలి సుధీర్ టీంకు వేయాల్సిన అక్షింతలు కూడా వేసాడు బ్రహ్మి. జి అనిల్ కుమార్ 3 మంకీస్ సినిమాను తెరకెక్కించాడు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brahmanandam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood