Rajamouli - Boney Kapoor: | రాజమౌళి ఎపుడైతే.. ఆర్ఆర్ఆర్ విడుదల తేదిని అనౌన్స్ చేసాడో.. అప్పటి నుంచి జక్కన్నతీరుపై బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయితూనే ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను దేశ వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ డేట్‌ను అధికారికంగా ప్రకటించడంపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు. ఈయన నిర్మాతగా అజయ్ దేవ్‌గణ్ హీరోగా ‘మైదాన్’ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్టు ఆరు నెలల ముందే ప్రకటించానని చెప్పుకొచ్చాడు. నేను ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించిన డేట్‌కు రెండు రోజులు ముందు ఆర్ఆర్ఆర్ను రాజమౌళి విడుదల చేయాలనుకోవడం అన్యాయం అని చెప్పుకొచ్చాడు.
రెండు పెద్ద సినిమాలను రెండు రోజుల గ్యాప్‌లో విడుదల చేస్తే.. ఆ ఇంపాంక్ట్ కలెక్షన్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మరోవైపు ఈ రెండు సినిమాల్లో అజయ్ దేవ్‌గణ్ కూడా నటించడం విశేషం. ఈ సందర్భంగా తాను ఫోన్ చేస్తే రాజమౌళి సరిగా స్పందించలేదన్నాడు. బయ్యర్స్ ఒత్తిడితోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినట్టు రాజమౌళి ప్రకటించడం హాస్యస్పదంగా ఉందన్నారు. మరోవైపు అప్పట్లో రాజమౌళి.. బాహుబలి సినిమా విషయంలో శ్రీదేవి ప్రొఫెషనల్‌గా లేదని చెప్పిన వ్యాఖ్యలపై బోనీ కపూర్ స్పందించారు.
బాహుబలి సినిమాలో ముందుగా రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర కోసం శ్రీదేవి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసారని రాజమౌళి చెబుతున్న వ్యాఖ్యలను బోనీ కపూర్ ఖండించారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒక హోటల్లోని ఫ్లోర్ మొత్తం బుక్ చేయమని శ్రీదేవి అడిగినట్టు.. ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినట్టు రాజమౌళి చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. అప్పట్లో రాజమౌళి.. శ్రీదేవి అన్ ప్రొఫెషనల్ అంటూ కామెంట్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. అసలు జరిగిన విషయం ఏమిటంటే.. రాజమౌళి ముంబాయికి వచ్చి శ్రీదేవికి స్టోరీ చెప్పారు. ఆమె ఈ కథపై అంతగా ఆసక్తి చూపలేదు. నేను మాత్రం శ్రీదేవికి, ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలు చూపించి రాజమౌళితో సినిమా తప్పక చేయమని చెప్పా. రాజమౌళి చెప్పిన నేరేషన్ విన్నాక.. శ్రీదేవి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. అపుడే నాకు రాజమౌళి నుంచి ఓ సందేశం వచ్చిందన్నారు.
శ్రీదేవి స్టార్‌గా నటిగా నేను ఎంతో ఆరాధిస్తాను. ఆమెకు నేను వీరాభిమానిని చెప్పుకున్నాడు. ఆమె ఇచ్చిన ఇన్పుట్స్ తో ఆమెపై నాకు మరింత గౌరవం పెరిగిందన్నారు. ఇక ఆమె ఆఫర్ చేసిన పారితోషకం చాలా తక్కువ. ఆమెకు అలాంటి ఆఫర్ చేయడం అంటే అవమానించడమే అని చెప్పాడు. పైగా రాజమౌళి.. బాహుబలి తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ తర్వాత రాజమౌళి గురించి మేము ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఇపుడు చూస్తుంటే.. రాజమౌళి దర్శకుడిగా అన్ఫ్రొఫెషనలీ అనిపిస్తోంది. సీనియర్లు అంటే ఆయనకు గౌరవం లేదనిపిస్తోంది. నిజంగా రాజమౌళిలో ఏదో తేడా ఉందన్నారు. ఒకవేళ శ్రీదేవి అన్ప్రొఫెషనలీ అయితే.. ఇన్నేళ్లు అన్ని భాషల్లో ఒక స్టార్లా ఎలా నెగ్గుకురాగలుగుతుంది అంటూ బోనీ కపూర్ ప్రశ్నించాడు.
ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ర జమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
బోనీ కపూర్ నిర్మాతగా ‘మైదాన్’ చిత్ర విషయానికొస్తే.. ఈ సినిమాను ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ .. సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో ఒకేసారి హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఒక చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు చిత్రాల్లో అజయ్ దేవ్‌గణ్ నటించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajay Devgn, Bollywood news, Boney Kapoor, Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood