షాద్‌నగర్ లైంగికదాడి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఈ ఒక్క ఘటనతో ఒక్కసారిగా దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇంకా ఇలాంటి మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నారా.. మన కళ్ల ముందే ఇలాంటి ఘోరాలు ఇంకా జరుగుతున్నాయా అని సమాజం కూడా సిగ్గుతో తల దించుకునేలా మారింది ఈ అమానుష ఘటన. ఓ 26 ఏళ్ల యువతి.. ఇంకా ప్రపంచం కూడా పూర్తిగా చూడని ఓ అమాయకురాలిని నలుగురు కామాంధులు లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది.
ఎంత దారుణమైన శిక్షలు పడతాయని తెలిసినా కూడా ఇంకా కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచులు అమ్మాయిలను చెర బడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్లకు ఉరి సరైన శిక్ష అంటూ అంతా గళం ఎత్తుతున్నారు. ఇప్పుడు ప్రియాంక ఘటన కూడా ఇదే. అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడమే కాకుండా సజీవదహనం చేసి మానవత్వానికే మచ్చ తీసుకొచ్చారు. ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తుంది. అందులో టాలీవుడ్ టూ బాలీవుడ్ అంతా ఉన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని వాళ్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.
Whether it is #PriyankaReddy in Hyderabad, #Roja in Tamil Nadu or the law student gangraped in Ranchi,we seem to be losing it as a society. It has been 7 yrs to the gut-wrenching #Nirbhaya case & our moral fabric continues to be in pieces.We need stricter laws.This needs to STOP!
— Akshay Kumar (@akshaykumar) November 29, 2019
ఢిల్లీ 'నిర్భయ' తర్వాత మళ్లీ ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనమైన ఘటన ఇదే కావడం గమనార్హం. దాంతో బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రియాంక రెడ్డి అత్యాచార ఘటనపై నోరు విప్పుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ట్విట్టర్‌లో తన స్పందన తెలియజేసాడు. హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి కావచ్చు.. తమిళనాడులో రోజా కావచ్చు.. లేదంటే రాంచీలో గ్యాంగ్ రేప్‌కు గురైన లా స్టూడెంట్ కావచ్చు.. ఇవన్నీ చూస్తుంటే మనం ఒక సమాజాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. అత్యంత విషాదకరమైన ఘటన నిర్భయ కేసు జరిగి ఏడేళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ మన నైతిక వస్త్రం ముక్కలుగా చిరుగుతూనే ఉంది. చట్టాలను మరింత కఠినంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఆగాలంటూ తన ఆవేదన ట్వీట్‌లో చూపించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood, Priyanka reddy murder, Telugu Cinema, Tollywood