news18-telugu
Updated: August 23, 2019, 7:48 PM IST
వివేక్ ఓబరాయ్, అభినందన్ వర్ధమాన్ (File photo)
గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు నిర్మాతలకు వసూళ్ల పంట పండిస్తున్నాయి. ఇక మన దేశాన్ని దొంగ దెబ్బ తీసిన పాకిస్థాన్‌పై మన దేశ సైనికులు జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ‘URI’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మెరుపు వసూళ్లను సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన విక్కీ కౌశల్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఎంతో ఉద్విగ్నంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య దర్ ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సినిమా మొత్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

జాతీయ ఉత్తమ నటుడు: విక్కీ కౌశల్ (ఉరి)
మరోవైపు ఈ యేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులు పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడిలో అసువులు బాసిన సైనికుల కోసం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు 40 మంది వీర జవాన్ల మరణానికి ధీటైన సమాధానం కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూసారు. తాజాగా వీర జవానుల వీర మరణంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న బాలాకోట్ దగ్గర ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ సర్జికల్ దాడుల సందర్బంగా పాకిస్థాన్ సైనికులకు IAF వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. పాకిస్థాన్ దేశానికి పట్టుపడటం.. ఆ తర్వాత మన ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా పాకిస్థాన్ పై చేసిన ఒత్తిడి కారణంగా పాకిస్థాన్..అభినందన్ వర్ధమాన్‌ను క్షేమంగా విడిచిపెట్టింది. ఈ సంఘటనల నేపథ్యంలో బాలీవుడ్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను ప్రముఖ నటుడు వివేక్ ఓబరాయ్ నిర్మించనున్నాడు. ఈ సంఘటలన్నింటిని వెండితెరపై చూపించబోతున్నారు. ఇందులో అభినందన్ తో పాటు స్క్వాడ్రన్ లీడర్‌గా తెర వెనక సాహసోపేత నిర్ణయాలను ీసుకుంటూ వచ్చిన మింటీ అగర్వాల్ పాత్ర కీలకంగా మారనుంది. ఈ సినిమాకు ‘బాలాకోట్ - ది ట్రూ స్టోరీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

India-Pak Tensions: బాలాకోట్ వైమానిక దాడులు (file photo)
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించిన వివేక్ ఓబరాయ్ ఈ సినిమాను కమర్షియల్‌గా కాకుండా మన దేశ వైమానిక దళ శక్తి సామర్ధ్యాలు తెలియజేయడానికే నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను నిర్మించడానికి తనకు పర్మిషన్ ఇచ్చిన వైమానిక దళంతో పాటు భారత ప్రభుత్వానికి రుణపడి ఉంటానని చెప్పారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఢిల్లీ,ఆగ్రా పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఒకేసారి హిందీతో పాటు తెలుగు, తమిళంలో తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు. ముఖ్యపాత్రల్లో ఎవరు నటిస్తారనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 23, 2019, 7:48 PM IST