Shahid Kapoor: భారత చలన చిత్ర పరిశ్రమలో తెలుగు పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక బాహుబలి తరువాత ఆ క్రేజ్ మరింత పెరిగింది. బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. అక్కడి వారు ఇక్కడ సినిమాలను అక్కడ రీమేక్ చేస్తన్నారు. స్టార్ హీరోలు సైతం తెలుగు మూవీ రీమేక్‌లలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అలాగే మన టాలీవుడ్ దర్శకులు కూడా చాలా మంది అక్కడికి వెళ్లి సక్సెస్ కొడుతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ కపూర్ టాలీవుడ్ దర్శకులే కావాలనుకుంటున్నాడు. అక్కడి వారిని పక్కనపెట్టి మరీ ఇక్కడి వారిని ఎంచుకున్నాడు. మూడేళ్ల క్రితం పద్మావత్ వంటి భారీ విజయం సాధించిన మూవీలో నటించినప్పటికీ.. ఆ సక్సెస్ రణ్వీర్ సింగ్, దీపికా ఖాతాలోకి పడింది. దీంతో షాహిద్ కన్ను తెలుగు చిత్రాలపై పడింది.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ హీరోగా ఇక్కడ ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి ఎంచుకున్న షాహిద్.. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగనే బాలీవుడ్‌లోకి తీసుకెళ్లాడు. ఇక కబీర్ సింగ్ పేరుతో ఆ మూవీ తెరకెక్కగా.. షాహిద్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు ఆ ఏడాది బాలీవుడ్లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల సరసన కబీర్ సింగ్ నిలిచింది.
ఇక ఆ తరువాత మరో తెలుగు రీమేక్‌ని షాహిద్ ఎంచుకున్నారు. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన జెర్సీని అక్కడ రీమేక్ చేశారు షాహిద్. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి అవ్వగా.. విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. ఇలా ఇప్పటికే వరుసగా ఇద్దరు తెలుగు దర్శకులనే ఎంచుకున్న షాహిద్.. మన వాళ్లను విడవలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగు దర్శకులైన రాజ్-డీకేతో పనిచేయబోతున్నారు ఈ హీరో.
View this post on Instagram
ఫ్యామిలీ మ్యాన్‌తో రాజ్-డీకే పేరు బాలీవుడ్లో మారుమోగిపోయింది. ఇక వారు తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు మరో వెబ్ సిరీస్‌కి ప్లాన్ చేశారు. అందులో షాహిద్ కపూర్ నటిస్తుండగా.. అతడి సరసన రాశి ఖన్నా నటిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చూస్తుంటే షాహిద్‌కి తెలుగు దర్శకులే కావాలి అన్నట్లుగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Shahid Kapoor