గోపీచంద్ ఒక్కడున్నాడు, అదుర్స్ లాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా. తాజాగా ఈయనపై పోలీస్ స్టేషన్‌పై కేసు ఫైల్ అయింది. ఓ కారు డ్రైవర్‌పై చెయ్యి చేసుకున్న ఘటనలో పోలీసులు రంగంలోకి దిగారు. సదరు డ్రైవర్‌ను కొట్టడమే కాకుండా అసభ్యంగా తిట్టినందుకు ఈయనపై కేసు ఫైల్ అయింది. జనవరి 16 రాత్రి 11:30 గంటల సమయంలో తన కారులో పుణె నుంచి సోలాపూర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నట్లుండి ఓ చోట తన కారుకు సడన్ బ్రేకులు వేసాడు మహేష్ మంజ్రేకర్. దాంతో వెనక నుంచి వస్తున్న కారు ఆయన కారును ఢీ కొట్టింది. అందులో డ్రైవర్ పేరు కైలాష్ సత్పుతే. తన కారును డ్యాష్ ఇచ్చిన వెంటనే కోపంతో ఊగిపోయాడు మహేష్. వెంటనే కారు దిగి ఆ డ్రైవర్‌ను కొట్టడమే కాదు తిట్టాడు కూడా. తనపై చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలం కూడా వాడటంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ డ్రైవర్. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే మహేష్ మంజ్రేకర్‌పై కొన్ని సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేసారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనలో తన తప్పేం లేదంటున్నాడు మహేష్ మంజ్రేకర్. తాను కారు ఆపిన తర్వాత వెనక నుంచి వచ్చి సదరు డ్రైవర్ ఢీ కొట్టాడని.. అదే సమయంలో ఇదంతా జరిగిందని చెప్పాడు.

మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar)
తన కారుకు 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. దాంతో పాటు యాక్సిడెంట్ అయినపుడు కారులో మరో ఇద్దరు కూడా ఉన్నారని.. వాళ్లకు కూడా గాయమైందని చెప్పాడు. అప్పుడు తనకు అర్జంట్ పని ఉండటంతో పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు జరుగుతున్న తీరు చూసిన తర్వాత తానే రివర్స్ కంప్లైంట్ ఇస్తానంటున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:January 17, 2021, 19:53 IST