Agriculture Acts: రైతుల ఆందోళనపై రాజకీయ రచ్చ జరుగుతోంది. 21 రోజులుగా ఢిల్లీ శివారులో వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐతే మరికొందరు రైతులు కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. కొత్త చట్టాలు బాగున్నాయని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవద్దని ఇటీవలే కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు, పంజాబ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కొత్త వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు భద్రత పెంచింది కేంద్రం. వై కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే ఇద్దరు కమెండోలు సహా మొత్తం 11 మంది సన్నీ డియోల్‌కు సెక్యూరిటీగా ఉంటారు.
'' ప్రస్తుత పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకొని విపక్షాలు ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారంతా రైతుల గురించి ఆలోలించడం లేదు. వారికి సొంత ఎజెండా ఉంది. పార్టీతో పాటు రైతులకు అండగా ఉంటా. రైతులకు మేలు చేసేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. చర్చల అనంతరం అంతా సర్ధుకుంటుంది.'' అని సన్నీ డియోలో ఇటీవలే పేర్కొన్నారు.
ఐతే సన్నీ డియోల్ ట్వీట్ చేసిన కాసేపటికే.. ఆయన తండ్రి ధర్మేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. నా రైతు సోదరులు పడుతున్న కష్టాలను చూసి నిజంగా చాలా బాధగా ఉందని అన్నారు. ధర్మేంద్ర కూడా గతంలో బీజేపీలో పనిచేసిన విషయం తెలిసిందే. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా సేవలందించారు.
కాగా, సన్నీ డియోల్ బీజేపీ తరపున 2019 ఎన్నికల్లో గురుదాస్‌పూర్ లోక్‌సభ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక 2007లో విడుదలైన తన హిట్ మూవీ అప్నే(Apne)కు ఇటీవలే సీక్వెల్ ప్రకటించారు. అప్నే-2లో ధర్మేంద్ర, ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో పాటు సన్నీ డియోల్ కుమారుడు కరన్ డియోల్ కూడా నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఒక సినిమాలో మూడు తరాలకు చెందిన నటులు కలిసి నటించడం ఇదే తొలిసారి. అప్నే-2 చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అప్నే చిత్రాన్ని కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీకి దీపక్ ముకుట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Bollywood, New Agriculture Acts, Sunny Deol