లేడీ పవర్ స్టార్ గా మన్ననలు అందుకుంటోన్న తరుణంలో మత హింసపై వ్యాఖ్యలు చేసి కాషాయవాదులకు టార్గెట్ అయ్యారు నటి సాయి పల్లవి (Sai Pallavi). విరాట పర్వం (Virata Parvam) సినిమా విడుదలకు ముందు సంచలనంగా మారిన సాయి పల్లవి కామెంట్లపై సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరుపొంది సీనియర్ నటి, బీజేపీ నేత విజయశాంతి (BJP Vijayashanthi) స్పందించారు. స్వతహాగా సినిమా వ్యక్తి కావడంతో విజయశాంతి.. వ్యాపార కోణాన్ని సైతం ప్రస్తావిస్తూ సాయిపల్లవికి చురకలు వేశారు. వివరాలివే..
సాయి పల్లవి, రాణా తదితురులు ముఖ్యపాత్రల్లో వేణు ఉడుడుల రూపొందించిన ‘విరాట పర్వం’ సినిమా శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే, సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నటి సాయి పల్లవి చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి. మత హింస, వామపక్ష-అతివాద భావజాలంపై మాట్లాడుతూ.. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తోన్న దాడులు ఒకటేనని, వ్యక్తులు ఏ మతానికి చెందినా, ఏ వాదాన్ని నమ్మినా మానవత్వాన్ని మర్చిపోతే ప్రయోజనం ఉండదని సాయిపల్లవి వ్యాఖ్యానించారు.
సాయి పల్లవి మాటలపై హిందూవాదులు మండిపడ్డారు. పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోవులను కాపాడిన రక్షకులను పోల్చడమేంటని ఫైరయ్యాయి. ఈ క్రమంలో నటిపై ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తాయి. ఒక దశలో విరాట పర్వం సినిమా నిలిపివేతకు సైతం ఫిర్యాదులు వచ్చినా, చిత్రం ఇవాళ విడుదలైంది. కాగా, కామెంట్ల ఉదంతంపై తాజాగా నటి విజయశాంతి స్పందించారు. బీజేపీ నేత ఏమన్నారో ఆమె మాటల్లోనే..
‘‘కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం... ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది.
డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.... తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది.
నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతూ.. ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో.. సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి. ఏది ఏమైనా ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోంది’ అని విజయశాంతి తన స్పందన లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Hyderabad, Sai Pallavi, Vijayashanthi, Virata Parvam