మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ కొంత మంది కథానాయకులు..ఆ తర్వాత కాలంలో నాయకులుగా రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఇంకోవైపు రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేసిన పొలిటిషన్స్ జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. అందులో కొందరి నేతలపై ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కుతునాయి.
ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలోని తాజా, మాజీ ప్రధాన మంత్రుల జీవితాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో తమదైన ముద్ర వేసిన ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించి డజను పైగా చిత్రాలు వెండితెరపై కనువిందు చేయనున్నాయి.
తాజాగా జాబితాలో మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ త్వరలో పట్టాలెక్కనుంది. మాములు దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్‌లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా...ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఉంది. ‘మేరీకోమ్’, ‘సరబ్‌జీత్’ ఫేమ్ ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. ‘పీఎం నరేంద్ర మోదీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్నఈ సినిమాను దేశంలోని 23 భాషల్లోతెరకెక్కిస్తున్నారు. ‘దేశభక్తే నా శక్తి’ అనేది ట్యాగ్‌లైన్.
ప్రధాని మోదీగా..వివేక్ ఓబరాయ్ లుక్ అదిరిపోయింది. మాములుగా చూస్తే నరేంద్ర మోదీ అనుకునేలా వివేక్ ఓబరాయ్ ఆహార్యం ఉంది. కొంచెం స్పష్టంగా చూస్తే కానీ..వివేక్ ఓబరాయ్ అని గుర్తించడం కష్టం. అంతలా ప్రధాని మోదీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. సార్వత్రిక ఎన్నికల ముందే ఈ బయోపిక్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
తాజా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా దారి తీసిన పరిస్థితులపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాపై వివాదాలు ముసురుకున్నాయి. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. ఈ సినిమాను ఈ నెల 11న విడుదల కానుంది.
మరోవైపు మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే జీవితకథతో ‘ఠాక్రే’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాల్ ఠాక్రే పాత్రలో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్‌పై వివాదాలు చెలరేగుతున్నాయి.
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ...నటిస్తూ ఈ బయోపిక్‌ను తెరకెక్కించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. రామారావు సినీ ప్రస్థానాన్ని ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. మరోవైపు రామారావు రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎన్టీఆర్..మహానాయకుడు’గా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
మరోవైపు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ...‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్‌తోసినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’. ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది.
తమిళనాడు ప్రజలకు అమ్మగా తన కనుసైగలతో రాజకీయాలను శాసించిన జయలలిత జీవితంపై ఒకేసారి మూడు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే నిత్యామీనన్ జయలలితగా ‘ది ఐరన్ లేడీ’ అనే సినిమాను ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమాను జయలలిత జయంతి రోజున షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారిగా గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు.
వీటితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ‘తెలంగాణ దేవుడు’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో శ్రీకాంత్..కేసీఆర్ పాత్రను పోషిస్తున్నారు. మరోవైపు ‘ఉద్యమ సింహం’ పేరుతో మరో సినిమా కూడా తెరకెక్కోతోంది. వీటితో కేసీఆర్ జీవితంపై మరికొన్ని చిత్రాలు తెరకెక్కనున్నట్టు సమాచారం.
తెలంగాణ సీఎంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితంపై ‘చంద్రోదయం’ మూవీ తెరకెక్కుతోంది. పి.వెంకట రమణ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
మొత్తానికి సార్వత్రిక ఎన్నికల రాజకీయ నేతలపై తెరకెక్కతోన్న బయోపిక్స్‌తో ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ పెరిగింది.
ఇవి కూడా చదవండి
వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ..త్వరలో పట్టాలెక్కనున్న సినిమా
కోర్డు కెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’...అనుపమ్ ఖేర్‌పై కేసు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anupam Kher, Bala Krishna Nandamuri, Bollywood, Chandrababu naidu, CM KCR, Hindi Cinema, Kollywood, Malluwood, Mammootty, Manmohan singh, Narendra modi, Nawazuddin Siddiqui, Nitya Menen, NTR Biopic, Pm modi, Telugu Cinema, Tollywood