‘బిగ్‌బాస్’ కౌశల్ క్రేజ్... రోశయ్య చేతుల మీదుగా ‘బహుముఖ ప్రజ్ఞారత్న’ బిరుదు

‘మోడలింగ్ మొదలెట్టినప్పుడు వెయ్యి రూపాయల కోసం ఇదే స్టేజీ మీద నడిచాను...’ సన్మాన సభలో కౌశల్ మందా... సత్కార సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ రోశయ్య

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 2, 2018, 10:51 PM IST
‘బిగ్‌బాస్’ కౌశల్ క్రేజ్... రోశయ్య చేతుల మీదుగా ‘బహుముఖ ప్రజ్ఞారత్న’ బిరుదు
‘బిగ్‌బాస్’ టైటిల్‌తో కౌశల్, పక్క చిత్రంలో రోషయ్య చేతుల మీదుగా సత్కారం (Photos: facebook)
  • Share this:
‘బిగ్‌బాస్’ సీజన్ 2 తెలుగు కార్యక్రమం ముగిసి నెల దాటిపోయింది. అయినప్పటికీ ‘బిగ్‌బాస్’ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్‌కు బయటికి వచ్చాక కూడా క్రేజ్ తగ్గడం లేదు. కొన్నాళ్ల క్రితం ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వచ్చిన కౌశల్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. స్టార్ హీరోలను చూసేందుకు వచ్చేంత స్థాయిలో కౌశల్‌తో ఫోటోలు దిగేందుకు, దగ్గర్నుంచి చూసేందుకు జనం ఎగబడడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ‘బిగ్‌బాస్’ టైటిల్ గెలిచినందుకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్వయంగా అభినందిస్తూ ట్వీట్ చేయడమూ తెలిసిందే. ‘బిగ్‌బాస్’ ఓట్ల ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్న కౌశల్, తాజాగా రోశయ్య చేతుల మీదుగా ‘బహుముఖ ప్రజ్ఞారత్న’ బిరుదు అందుకున్నాడు.

కొన్నాళ్లుగా ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు, కొన్ని సిరీయల్స్‌లో విలన్ వేషాలు వేసిన కౌశల్‌...ఒక్క షోతో బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అధికారికంగా లెక్కలు ప్రకటించకపోయినా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కౌశల్‌కి ఏకంగా 39 కోట్ల 50 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈ స్థాయిలో ఓ పార్టిసిపెంట్‌కి ఓట్లు రావడం ‘బిగ్‌బాస్’ చరిత్రలోనే కాదు, ఓ టీవీ కార్యక్రమంలోనే ఓ సంచలనం. ‘బిగ్‌బాస్’ కార్యక్రమం చూసేవారిలో మెజారిటీ శాతం మంది కౌశల్‌కే ఓట్లు వేయడం... తమ అభిమాన పార్టిసిపెంట్ గెలవాలనే తపనతో మరిచిపోకుండా రోజూ ఓట్లు వేశారు. ఈ స్థాయిలో ప్రజాదరణ సొంతం చేసుకున్న కౌశల్... ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ స్థానం సంపాదించుకున్నారు.

దీంతో ఆయన అభిమానులు, కౌశల్ ఆర్మీ నిర్వహకులు కలిసి కౌశల్‌ను‘బహుముఖ ప్రజ్ఞారత్న’ సత్కరించారు. నవంబర్ 2న త్యాగరాజు గానసభలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరై, కౌశల్‌కి బిరుదును బహుకరించారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ... ‘మోడలింగ్ మొదలెట్టినప్పుడు వెయ్యి రూపాయల కోసం ఇదే స్టేజీ మీద నడిచాను. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి చేతుల మీదుగా ‘బహుముఖ ప్రజ్ఞారత్న’ బిరుదును అందుకున్నానంటే నమశక్యంగా లేదు. ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను. నన్ను ఇంతలా ఆదరించిన అభిమానులందరికీ ధన్యవాదాలు...’ అంటూ చెప్పుకొచ్చాడు.First published: November 2, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు