Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఐదవ సీజన్’లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్ని నిలిచారు. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవస్థానం దక్కించుకున్నారు. తాజాగా బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో గత నెల 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో అట్ఠహాసంగా ప్రారంభమైంది. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌గా బిగ్‌బాస్ ఓటీటీని నిరంతరాయంగా 84 రోజులు పాటు ఏకధాటిగా ప్రసారం కానుంది. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్‌మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామి ఇచ్చింది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్‌ను తీర్చిదిద్దినట్టు తెలిపారు.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 12 వారాల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా నాగార్జున వారంలో రెండు సార్లు అంటే 24 ఎపిసోడ్లు హౌస్‌ను విజిట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 25 లక్షల చొప్పున మొత్తంగా రూ. 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ నాగార్జునకు డిస్నీ హాట్ స్టార్ ఇవ్వనున్నట్టు సమాచారం.
నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ మూవీతో పలకరించారు. ఈ సినిమాలో ముచ్చటగా మూడోసారి తన పెద్ద తనయుడు నాగ చైతన్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున, తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయం చేసారు. ఆయన మనవడుగా.. పుత్రుడిగా నాగ చైతన్య ‘బంగార్రాజు’ పాత్రలో అదరగొట్టారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దాదాపు రెండు గంటల పాటు స్క్రీన్ పై కనపబడటం విశేషం. అంతేకాదు తాజాగా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా ’బంగార్రాజు’ మూవీ రూ 39 కోట్ల బిజినెస్ చేస్తే.. రూ. 40 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా 2022లో మొదటి విజయంగా నిలిచింది. కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపాడు.పైగా చాలా యేళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.